గోప్రో కెమెరాపై చైనా మౌనం.. ఎన్ఐఏ ప్రశ్నలకు స్పందించని డ్రాగన్ దేశ అధికారులు
ABN , Publish Date - Nov 21 , 2026 | 08:50 AM
పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలకంగా మారిన గోప్రో కెమెరా వ్యవహారంపై చైనా నుంచి ఎలాంటి స్పందన లేదని జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అమెరికాలో తయారైన ఈ కెమెరా చైనాలోని ఓ సంస్థ కొనుగోలు చేసింది. అక్కడి నుంచి పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకునేందుకు ఎన్ఐఏ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: పహల్గాం ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలకంగా మారిన గోప్రో కెమెరా వ్యవహారంపై చైనా నుంచి ఎలాంటి స్పందన లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెల్లడించింది. అమెరికాలో తయారైన ఈ కెమెరాని చైనాకు చెందిన ఓ సంస్థ కొనుగోలు చేసింది. అక్కడి నుంచి పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతికి ఎలా వెళ్లిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై చైనా ప్రభుత్వాన్ని వివరణ కోరినట్లు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. కాల్పుల సందర్భంగా ఉగ్రవాదులు గోప్రో కెమెరాలు ధరించి ఉన్నారని ఎన్ఐఏ గుర్తించింది. ఈ మేరకు 2025 జులైలో శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని తనిఖీ చేసి గోప్రో కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కెమెరా ఉగ్రవాదులకు ఎలా చేరిందనే అంశంపై దృష్టి సారించిన ఎన్ఐఏ.. దర్యాప్తులో కెమెరాను అమెరికాకు చెందిన గోప్రో కంపెనీ తయారు చేసినట్లు గుర్తించింది.
ఈ నేపథ్యంలో కెమెరా సరఫరాకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని గోప్రో సంస్థను ఎన్ఐఏ కోరింది. దీనికి స్పందించిన ఆ సంస్థ.. కెమెరాను చైనాలోని ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు విక్రయించినట్లు తెలిపింది. 2024 జనవరి 30న చైనాలోని డోంగువాన్ నగరంలో అది తొలిసారిగా యాక్టివేట్ అయినట్లు పేర్కొంది. అయితే, చైనాలో ఈ కెమెరాను ఎవరు కొనుగోలు చేశారు? ఎవరి ద్వారా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లింది? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. దీంతో మరింత స్పష్టత కోసం చైనా అధికారులను ఎన్ఐఏ సంప్రదించింది. కెమెరాను కొనుగోలు చేసిన వ్యక్తులు ఎవరు, అది ఉగ్రవాదుల చేతికి ఎలా వెళ్లిందనే సమాచారం ఇవ్వాలని కోరింది. అయితే, చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి
పెరూలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం.. రాజధానిలోనూ ప్రకంపనలు..
మణిపూర్‌లో కల్తీ మద్యం కలకలం.. 12 మంది మృతి, 180 మందికి అస్వస్థత