Share News

పెరూలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం.. రాజధానిలోనూ ప్రకంపనలు..

ABN , Publish Date - Nov 21 , 2026 | 07:02 AM

దక్షిణ అమెరికా దేశమైన పెరూలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. మధ్య పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించింది.

పెరూలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం.. రాజధానిలోనూ ప్రకంపనలు..
Peru Earthquake

లిమా, నవంబర్ 21: దక్షిణ అమెరికా దేశమైన పెరూలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. మధ్య పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7:09 గంటలకు భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని కేంద్రం ఆండీస్ పర్వత ప్రాంతంలోని జునిన్‌కు ఉత్తరాన 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది. అలాగే, భూమి లోపల 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.


భూప్రకంపనలు పెరూ రాజధాని లిమానీ తాకడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని పెరూ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. కాగా, ప్రపంచంలో తరచుగా భూకంపాలు సంభవించే పసిఫిక్ బేసిన్‌లోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో పెరూ దేశం ఉంది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది ఆగస్టులో పెరూలోని ఆండీస్ పర్వత ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరు గాయపడగా, అనేక ఇళ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు సహా ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. అలాగే, జూలైలోనూ జునిన్ ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 30 మంది గాయపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

పెరిగిన జీవన వ్యయంపై ఇటలీలో నిరసనలు

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసులో నిఖిల్‌ గుప్తాకు 19 ఏళ్ల జైలు శిక్ష

Updated Date - Nov 21 , 2026 | 07:11 AM