శత్రువుకు పరాభవం తప్పదు.. అమెరికాకు ఐఆర్‌జీసీ చీఫ్ హెచ్చరిక
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:43 PM
అమెరికా, దాని మిత్రదేశాలకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వహీదీ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమతో కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, దాని మిత్రదేశాలకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వహీదీ మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమతో కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ శత్రువు గతంలో ఎన్నడూ లేనంతగా అవమానాన్ని ఎదుర్కొనేలా చూస్తామన్నారు. ఇరాన్‌కు చెందిన ఓ మిసైల్ సిటీని వహీదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. 'శత్రువు ఎదుర్కొంటున్నది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో వారు మరింత పరాభవం చవిచూస్తారు. అసత్యంపై సత్యం విజయం సాధించి తీరుతుంది. అసత్యం నాశనం కావాలని దేవుడు సంకల్పించాడు' అని వహీదీ వ్యాఖ్యానించినట్లు ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
హోర్ముజ్ జలసంధిలో అమెరికా డ్రోన్ కూల్చివేత?
హోర్ముజ్ జలసంధి మీదుగా ఎగురుతున్న అమెరికా సైనిక డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. శనివారం తమ ఏరోస్పేస్ ఫోర్స్ కొత్తగా మోహరించిన వైమానిక రక్షణ వ్యవస్థతో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఐఆర్‌జీసీ వెల్లడించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై నిఘా పెట్టిన సమయంలో డ్రోన్‌ను గుర్తించి అడ్డుకున్నామని పేర్కొంది. ఇప్పటివరకు ఇరాన్ కూల్చివేసిన అమెరికా ఎంక్యూ-9 డ్రోన్ల సంఖ్య 58కు చేరిందని ఐఆర్‌జీసీ ప్రకటించింది.
బహ్రెయిన్‌లో అమెరికా రాడార్ కేంద్రంపై దాడి?
మరోవైపు, బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక రక్షణ రాడార్ కేంద్రంపై దాడి చేశామని ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఈనెల 15న అల్-రీఫా హెలికాప్టర్ స్థావరంలోని రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఆరు డ్రోన్లతో దాడి చేశామని వెల్లడించింది. అమెరికా సైనిక చర్యలకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగానే ఈ దాడి జరిగిందని పేర్కొంది. అయితే, ఇరాన్ నుంచి వచ్చిన పలు వైమానిక దాడులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని బహ్రెయిన్ ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక