సుఖనిద్రకు ‘ఇండోర్’ మంత్రం
ABN , Publish Date - Nov 22 , 2026 | 10:53 AM
సుఖప్రదమైన నిద్రకు మొక్కలు కూడా ఉపకరిస్తాయి. పడకగదిలో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
సుఖప్రదమైన నిద్రకు మొక్కలు కూడా ఉపకరిస్తాయి. పడకగదిలో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఏయే మొక్కల వల్ల మంచి నిద్ర పడుతుందంటే...
పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ‘లావెండర్’ మొక్క మంచి ఎంపిక. ఊదారంగు పూలతో ఆకట్టుకునే ఈ మొక్క నుంచి వచ్చే ప్రత్యేకమైన సువాసన మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. అందుకే స్పాలు, వెల్నెస్ సెంటర్లలోనూ ఈ మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.అయితే గదిలో తగినంత సూర్యరశ్మి అవసరం.
చూడడానికి కత్తుల్లాంటి పొడవాటి ఆకులతో కనిపించే ‘స్నేక్‌ప్లాంట్’ ప్రత్యేకమైనది. ఈ మొక్కల్లో ప్రత్యేకమైన కిరణజన్య సంయోగ క్రియ విధానం ఉంటుంది. దీనివల్ల రాత్రిపూట కూడా కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహించగలదు. తక్కువ నీటితోనే పెరగడం, ఎక్కువ నిర్వహణ అవసరం లేకపోవడం దీని మరో ప్రత్యేకత.

తెల్లని పూలు, మెరిసే ఆకులతో కనిపించే ‘పీస్ లిల్లీ’ మొక్క పడకగదిలో చక్కగా సరిపోతుంది. ప్రశాంతతను కోరుకునేవారు ఈ మొక్కను ఇష్టపడతారు. తక్కువ వెలుతురులో కూడా పెరగడం దీని ప్రత్యేకత. అయితే ఈ మొక్క ఆకులు తెలియకుండా నోట్లో పెట్టుకుంటే విషపూరితం కావొచ్చు.
మల్లెపూల గుబాళింపు అంటే ఇష్టపడని వారు ఉండరు. తెల్లని ‘జాస్మిన్’ మొక్క బెడ్రూమ్కు సహజమైన పరిమళాన్ని తీసుకొస్తుంది. కొన్ని పరిశోధనలు ఈ సువాసన విశ్రాంతి భావనతో సంబంధం కలిగి ఉండవచ్చని చెబుతున్నాయి. భారతీయ సంప్రదాయాల్లో మల్లెపూలను శుభప్రదంగా కూడా భావిస్తారు. అయితే ఈ మొక్కను గదిలో సూర్యరశ్మి పడే చోట పెట్టాలి.

ఇళ్లలో ఎక్కువగా కనిపించే ఇండోర్ మొక్కల్లో ‘మనీ ప్లాంట్’ ఒకటి. హృదయాకారంలో ఉండే ఆకులు, తీగల్లా విస్తరించే కొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. వాస్తు, ఫెంగ్‌షూయ్ నమ్మకాల ప్రకారం మనీ ప్లాంట్ సంపద, అదృష్టం, అభివృద్ధికి చిహ్నం. తక్కువ వెలుతురులో కూడా పెరుగుతుంది. నిర్వహణ పెద్దగా అవసరం లేదు. అయితే వీటిని ఇంట్లో పెట్స్ తినకుండా చూడాలి.
ఔషధ గుణాలున్న మొక్కగా ప్రసిద్ధి చెందిన ‘అలోవెరా’ను బెడ్రూమ్లో ఉంచొచ్చు. మందపాటి ఆకుల్లో నీటిని నిల్వ చేసుకునే ఈ మొక్క తక్కువ నీటితోనే జీవించగలదు. స్నేక్ప్లాంట్లాగే ఇది కూడా రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. వాస్తు నమ్మకాల ప్రకారం... దీనిని ఆరోగ్యం, సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు. కిటికీ దగ్గర ఉంచితే బాగా పెరుగుతుంది.
వంటల్లో సువాసన కోసం ఉపయోగించే ‘రోజ్మేరీ’ మొక్కకు ఇంటి అలంకరణ లోనూ ప్రత్యేక స్థానం ఉంది. సూది ఆకారంలో ఉండే ఆకులు, ప్రత్యేకమైన సువాసన ఈ మొక్కను ఆకర్షణీయంగా మారుస్తాయి. రోజ్మేరీని జ్ఞాపకశక్తి, స్పష్టమైన ఆలోచనలకు ప్రతీకగా భావిస్తారు. దీని వాసనపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇది నిద్రకు ఉపయోగకరం.
గులాబీ, ఆకుపచ్చ, ఎరుపు రంగుల కలయికతో కనిపించే ‘అగ్లోనిమా’ మొక్క ఇండోర్ ప్లాంట్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీన్ని చైనీస్ ఎవర్గ్రీన్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కని అదృష్టం, అభివృద్ధికి చిహ్నంగా భావిస్తారు. నీరు కూడా పోయాల్సిన అవసరం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News