Share News

బీజేపీలో చేరిన టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:48 AM

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరాడు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యాడు.

బీజేపీలో చేరిన టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్
Yuzvendra Chahal

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. శనివారం చాహల్ బీజేపీలో చేరగా... పార్టీ అతడ్ని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.అంతకుముందు చాహల్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ అమర్‌పాల్ మౌర్యతో భేటీ అయ్యారు. మోర్చాకు జరుగుతున్న కొత్త విడత నియామకాలలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నియామకం చేపట్టారు.


పార్టీలో చేరిన అనంతరం చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'బీజేపీ కుటుంబంలో నాకు స్థానం, సముచిత గౌరవం కల్పించిన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు' అని చాహల్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం భారత జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న చాహల్.. ఇటీవల ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రం కొనసాగిస్తానని అతడు స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. గతంలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో కెంట్, నార్తాంప్టన్‌షైర్ జట్ల తరఫున ఆడాడు.


మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఓబీసీ మోర్చా నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని అమర్‌పాల్ మౌర్య తెలిపారు. బీజేపీ తన ఒబీసీ మోర్చాకు ఏడుగురు జాతీయ ఉపాధ్యక్షులను నియమించింది. జోగెన్ మోహన్ (అస్సాం), మమతా మొహంత (ఒడిశా), సంగమ్ లాల్ గుప్తా (యూపీ), బబన్‌రావ్ రావ్జీ చౌదరి (మహారాష్ట్ర), సత్ ప్రకాష్ రాణా (ఢిల్లీ), అర్జున్ సాహ్ని (బీహార్), సంగీత బల్వంత్ బింద్ (యూపీ). జాతీయ ప్రధాన కార్యదర్శులుగా గజేంద్ర యాదవ్ (ఢిల్లీ), ప్రమోద్ మధ్వరాజ్ (కర్ణాటక), లలిత్ చంద్రకర్ (ఛత్తీస్‌గఢ్)లు ఎంపికయ్యారు.


జాతీయ కార్యదర్శులుగా కడగంచి రమేష్ (తెలంగాణ), దశరథ్‌జీ ఠాకూర్ (గుజరాత్), టి. వరదరాజన్ (తమిళనాడు), సంజీవ్ కుమార్ (జార్ఖండ్), సరితా జాంగిడ్ (హర్యానా), వైభవ్ పన్వార్ (మధ్యప్రదేశ్), భీమ్ కుమార్ సాహు (బీహార్) నియమితులయ్యారు. వీరితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి 37 మందిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 09:50 AM