Share News

జ్ఞాపకాల అయస్కాంతం

ABN , Publish Date - Nov 22 , 2026 | 10:11 AM

ఫ్రిజ్‌ అంటే ఆహార పదార్థాలను భద్రపరుచుకునేది. కానీ ఇప్పుడు జ్ఞాపకాల అయస్కాంతం. ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ అనేవి దాని రూపురేఖల్ని మార్చేశాయి. రకరకాల ఫ్రిజ్‌ మాగ్నెట్లతో అది అచ్చంగా ఒక గ్యాలరీగా మారుతోంది. నవతరం పోకడల విశేషాలివి...

జ్ఞాపకాల అయస్కాంతం
lifestyle

ఫ్రిజ్‌ అంటే ఆహార పదార్థాలను భద్రపరుచుకునేది. కానీ ఇప్పుడు జ్ఞాపకాల అయస్కాంతం. ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ అనేవి దాని రూపురేఖల్ని మార్చేశాయి. రకరకాల ఫ్రిజ్‌ మాగ్నెట్లతో అది అచ్చంగా ఒక గ్యాలరీగా మారుతోంది. నవతరం పోకడల విశేషాలివి...

ఫ్రిజ్‌ లోపల ఏముంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఫ్రిజ్‌ డోర్‌పై ఏం ఉన్నాయనేది ఇప్పుడు ప్రత్యేకం. ఎవరి ఇంట్లో ఫ్రిజ్‌ డోర్‌పై చూసినా... రకరకాల బొమ్మలు అతికించి ఉండటం చూసే ఉంటారు. వాటిని ‘ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌’ అంటారు. అవి ఇప్పుడు అలంకరణ వస్తువులు మాత్రమే కాదు... వ్యక్తిగత అభిరుచులకు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి.

ఫోన్‌లో వేల ఫొటోలు ఉన్నా, ప్రతీరోజూ కళ్లముందు కనిపించే ఒక చిన్న మాగ్నెట్‌ ఇచ్చే అనుభూతి చాలా ప్రత్యేకం. ఒకప్పుడు ఫ్రిజ్‌పై ఎక్కువగా టూరిస్ట్‌ ప్రాంతాల పేర్లు, పండ్లు, పూలు, కార్టూన్‌ బొమ్మలు కనిపించేవి. కానీ ట్రెండ్‌ మారింది. మినిమలిస్ట్‌ డిజైన్స్‌ నుంచి మినియేచర్స్‌ వరకు, వ్యక్తిగత ఫొటోల నుంచి ఫుడ్‌ థీమ్‌ వరకు... రకరకాల డిజైన్‌ మాగ్నెట్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా యువత, ట్రావెల్‌ లవర్స్‌, హోమ్‌ డెకర్‌ను ఇష్టపడేవారు ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ను ఒక కలెక్షన్‌లా చూస్తున్నారు. తమకు నచ్చిన ప్రదేశం, వ్యక్తి, సినిమా, సందర్భం లేదా జీవితంలోని మధుర జ్ఞాపకాన్ని ఒక చిన్న మాగ్నెట్‌ రూపంలో ఫ్రిజ్‌పై అతికిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఫ్రిజ్‌ డోర్‌ ఒక చిన్నపాటి జ్ఞాపకాల గ్యాలరీగా మారుతోంది. అంతెందుకు... బహుమతిగా ఇవ్వడానికి ఫ్రిజ్‌ మాగ్నెట్లు ఎంచుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పుట్టినరోజు, పెళ్లిరోజున ప్రత్యేకంగా తయారుచేయించిన ఫ్రిజ్‌ మాగ్నెట్లను ఆత్మీయుల పుట్టినరోజున లేక పెళ్లిరోజున గిఫ్ట్‌గా అందిస్తున్నారు. కస్టమైజ్డ్‌ ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ అందుకున్నవారికి మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తున్నాయి.


ప్రయాణ జ్ఞాపకాలు...

ఎప్పుడో ఒకసారి ఆల్బమ్‌ తిరగేస్తుంటే... ఇష్టమైన ప్రదేశాలను సందర్శించినప్పటి ఫొటోలు కనిపిస్తే మనసంతా సంతోషంతో నిండిపోతోంది. అప్పటి జ్ఞాపకాలన్నీ కళ్లముందు కదలాడతాయి. అవే ఫొటోలు ఎప్పుడూ కనిపించేలా ఫ్రిజ్‌పై పెట్టుకుంటే ఆ సంతోషం ప్రతీరోజూ పలకరిస్తుంది. అందుకే ఈతరం అలాంటి ఫొటోలను ఫ్రిజ్‌ మాగ్నెట్ల రూపంలో అతికిస్తోంది. ప్రయాణ అనుభవాలు, ముఖ్యమైన ప్రదేశాలు, టూర్‌లో జరిగిన ప్రత్యేక సంఘటనలతో రూపొందించిన మాగ్నెట్స్‌ను ఎంచుకోవడం ఇప్పుడు ట్రెండ్‌. అందుకే ట్రావెల్‌ థీమ్‌ ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతీ ట్రిప్‌నకు ఒక మాగ్నెట్‌ కొనడం సాధారణ విషయంగా మారింది. ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లినప్పుడు అక్కడి ప్రత్యేకతను గుర్తుచేసే మాగ్నెట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈఫిల్‌ టవర్‌, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ నుంచి గోవా, కేరళ వంటి మాగ్నెట్స్‌ వాటిలో కొన్ని. మరికొందరు మాగ్నెట్స్‌పై పేరు, ప్రయాణించిన తేదీ, ప్రదేశం, ప్రయాణ సమయంలో తీసిన ప్రత్యేక ఫోటోలను ఉపయోగించి కస్టమైజ్డ్‌ మాగ్నెట్స్‌ తయారుచేయిస్తున్నారు. బంధువులు, స్నేహితులు ఇంటికొచ్చినప్పుడు వాటి గురించి గొప్పగా చెబుతూ... మరొకసారి ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు.


ఫంక్షనల్‌ మాగ్నెట్స్‌

ఇంట్లో అలంకరణ వస్తువులు ఉండటం మంచిదే. అయితే ఆ వస్తువులు చిన్నచిన్న పనులకు పనికొచ్చేవై ఉంటే ఇంకా మంచిది కదూ! అలాంటివే ఫంక్షనల్‌ మాగ్నెట్స్‌. ఈ జాబితాలో బాటిల్‌ ఓపెనర్లు, నోట్‌ హోల్డర్లు, స్టిక్కీ నోట్స్‌ హోల్డర్లు వంటి సౌకర్యాలు కలిగిన మాగ్నెట్లు ఉంటున్నాయి. ఈ తరహా మాగ్నెట్లను ఎంచుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.

బార్‌కోడ్‌ ఉన్నవైతే...

ఈ రోజుల్లో బార్‌కోడ్‌ లేకుండా వస్తువు ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. చివరకు ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌లో కూడా బార్‌కోడ్‌ వచ్చి చేరింది. ఇలాంటి మాగ్నెట్స్‌ను ఎంచుకునేవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. బార్‌కోడ్‌ మాగ్నెట్స్‌ని స్కాన్‌ చేస్తే ట్రావెల్‌ టూర్‌కి సంబంధించిన డిజిటల్‌ సమాచారం, ఫొటోలు, వీడియోలు వంటి వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల టూర్‌ సంబంధిత జ్ఞాపకాలు మరోసారి మదిలో మెదులుతాయి.


book3.4.jpgసంస్కృతిని గుర్తు చేసేవి...

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. కానీ వెళ్లినచోట అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవాలని ఆరాటపడేవారు కొద్దిమందే ఉంటారు. అలాంటివారు టూర్‌లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కళలు, ప్రకృతి దృశ్యాలు, స్థానిక నిర్మాణ శైలిని ప్రతిబింబించే డిజైన్‌ మాగ్నెట్లు ఇందులో ఉంటున్నాయి. ఈ మాగ్నెట్స్‌ స్థానిక కళలు, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

వ్యక్తిగత ఫొటోలతో...

పిల్లల చిన్ననాటి ఫొటోలు చూసినప్పుడు తల్లిదండ్రులకు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఆ అనుభూతి రోజూ సొంతం చేసుకునేందుకు వాటిని ఫ్రిజ్‌ మాగ్నెట్లుగా ఎంచుకుంటున్నారు. జీవితంలోని మధుర క్షణాలను శాశ్వత జ్ఞాపకాలుగా నిలుపుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఫ్రిజ్‌ తెరిచిన ప్రతిసారీ ఒక అందమైన సెల్ఫీ, ఫ్యామిలీ ఫొటో, పిల్లల ఫొటోలు లేదా సంతోషకరమైన రోజుకు సంబంధించిన జ్ఞాపకం కళ్లముందు కనిపిస్తుంది. పెళ్లి ఫొటో, పెంపుడు జంతువుల ఫొటోలు కూడా ఇందులో ఉంటున్నాయి. వీటికి గిరాకీ ఎక్కువ.


స్ఫూర్తినిచ్చే కొటేషన్లతో...

ఒక మంచి కొటేషన్‌ రోజంతా స్ఫూర్తినిస్తుంది. ఆఫీసుకు బయలుదేరేందుకు కావలసిన ఉత్సాహాన్ని, ప్రేరణను అందిస్తుంది. అందుకే చాలామంది స్ఫూర్తినిచ్చే కస్టమైజ్డ్‌ ఫ్రిజ్‌ మాగ్నెట్లను స్టిక్‌ చేస్తున్నారు. వాటిపై చిన్న సందేశం లేదా ఇష్టమైన కొటేషన్‌ ఉండేలా చూస్తున్నారు.

గ్రీన్‌ మాగ్నెట్స్‌

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అందరికీ ఇష్టమే. అయితే ఆ మొక్కలు బాల్కనీలోనే కాదు. సరదాగా ఫ్రిజ్‌పైన ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడిదే ట్రెండ్‌ కూడా. కృత్రిమ మొక్కలు, హైడ్రోఫోనిక్‌ పద్ధతిలో పెంచే మొక్కలను ఫ్రిజ్‌ మాగ్నెట్ల రూపంలో ఎంచుకుంటున్నారు. ప్రకృతి ప్రేమికులు ఈ తరహా మాగ్నెట్‌ మొక్కల కుండీల పట్ల ఆసక్తి చూపుతున్నారు.


book3,1.jpgకళాత్మకంగా...

ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ కాస్త ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేవారు కళాత్మక మాగ్నెట్స్‌ని ఎంచుకుంటున్నారు. చేతితో తయారుచేసిన వుడ్‌, టెర్రాకోట, సిరామిక్‌, రెసిన్‌ మాగ్నెట్స్‌ పట్ల మహిళలు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. మధుబని, వార్లీ వంటి భారతీయ కళారూపాలతో తయారయ్యే మాగ్నెట్స్‌కు ఇటీవల ఆదరణ పెరిగింది. మధుబని, వార్లీ, ఫోక్‌ ఆర్ట్‌, టెర్రకోట, చెక్కతో తయారుచేసిన ప్రత్యేకమైన డిజైన్‌ మాగ్నెట్స్‌ ఫ్రిజ్‌కు ఒక ప్రత్యేక లుక్‌ని తీసుకొస్తున్నాయి. సాధారణ డిజైన్స్‌కు భిన్నంగా ప్రత్యేకమైన ఫినిషింగ్‌, రంగులు, ఆకృతులతో ఇవి ఆకట్టుకుంటున్నాయి.


ప్రమాదమా?

ఫ్రిజ్‌కు అంటించే మాగ్నెట్స్‌ వల్ల ఏదైనా ఇబ్బంది, ప్రమాదం ఉంటుందా? దీర్ఘకాలంలో ఫ్రిజ్‌ దెబ్బతింటుందా? ఈ సందేహాలు సహజంగానే చాలామందిలో ఉంటాయి. అయితే మాగ్నెట్స్‌ వల్ల ఫ్రిజ్‌కి ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు అంటున్నారు. అలాగే ఫ్రిజ్‌ పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండదని చెబుతున్నారు.

పాటలు వినిపిస్తాయి...

వంటింట్లో పాటలు పాడే ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌ కూడా ఉన్నాయండోయ్‌... మ్యూజికల్‌ ఫ్రిజ్‌ మాగ్నెట్స్‌గా పిలిచే వీటికి ఆదరణ పెరుగుతోంది. సంగీత ప్రియులు ఈ తరహా మాగ్నెట్స్‌ గురించి ఎక్కువగా ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఫ్రిజ్‌పై అతికించిన మాగ్నెట్‌ బటన్‌ ఆన్‌ చేస్తే చాలు... ఎంచక్కా పాటలు వింటూ పనులు చేసుకోవచ్చు. వీటిలో బిల్ట్‌ఇన్‌ స్పీకర్‌ ఉంటుంది. వాయిస్‌ మెసేజ్‌ను రికార్డ్‌ చేయొచ్చు. చార్జర్‌తో రీచార్జ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌తో కనెక్ట్‌ చేసుకుని పాటలను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరో రెండు తుఫాన్ల ముప్పు!

ఏఐని ఆపలేం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 10:11 AM