Share News

ఏఐని ఆపలేం

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:50 AM

న్యాయ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను పూర్తిగా నిషేధించడం ఆచరణ సాధ్యమూ కాదు, వివేకమూ కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు.

ఏఐని ఆపలేం
CJI Justice Surya Kant

  • నిషేధిస్తే చాటు నుంచి వాడేస్తారు

  • న్యాయ రంగంలో ఏఐ వినియోగానికి మార్గదర్శకాలు రూపొందించాలి

  • యంత్రం మాటతో విద్యార్థిని దోషిని చేయొద్దు

  • ఏఐ డిటెక్టర్లు ఏమాత్రం నమ్మదగ్గవి కావు

  • సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టీకరణ

  • ఇంగ్లిషు మాతృభాష కాని వారి వ్యాసాలపై ‘యంత్రం రాసిందే’నని తప్పుడు ముద్ర ప్రమాదం

  • రాత పనికి తోడు మౌఖిక వివరణ ఉండాలి

  • రహస్య సమాచారాన్ని ఏఐకి ఎక్కించొద్దు

  • భవిష్యత్తులో జడ్జిల మెదళ్లనూ చదివేస్తారేమో!

  • న్యాయ సహాయ సేవ చేసిన వారికే పట్టా ఇవ్వాలి

  • కామన్వెల్త్‌ న్యాయ విద్యా సదస్సులో వ్యాఖ్యలు

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): న్యాయ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను పూర్తిగా నిషేధించడం ఆచరణ సాధ్యమూ కాదు, వివేకమూ కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. నిషేధానికి బదులు స్పష్టమైన నిబంధనలతో నియంత్రించడం, బాధ్యతాయుతంగా వాడటం నేర్పించడమే సరైన మార్గమన్నారు. ఒక వ్యాసం విద్యార్థి రాశాడా, యంత్రం రాసిందా అని తేల్చే సాఫ్ట్‌వేర్‌ నమ్మదగినది కాదని, యంత్రం మాట ఆధారంగా ఏ విద్యార్థినీ దోషిగా తేల్చకూడదని హెచ్చరించారు. ప్రతి న్యాయ విద్యార్థికి పట్టా ఇవ్వాలంటే కనీస కాలం న్యాయ సహాయ సేవ చేయడాన్ని తప్పనిసరి చేయాలని, అంతకు మించి సేవ చేసేవారికి అదనపు క్రెడిట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. కామన్వెల్త్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ (సీఎల్‌ఈఏ) ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో శనివారం మొదటి వార్షిక అంతర్జాతీయ న్యాయ విద్యా సదస్సు-2026 ప్రారంభమైంది. దీనికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు.


TG copy.jpgసూత్రం నేర్చుకుంటే చాలదు

తరగతి గదిలో నేర్చుకున్న సిద్ధాంతాలను కోర్టు హాలు వాస్తవాలతో అనుసంధానించాలని సీజేఐ అన్నారు. ‘‘ఒప్పందం ఉల్లంఘిస్తే నష్టపరిహారం ఇప్పించాలన్న సూత్రాన్ని విద్యార్థి క్లాసులో నేర్చుకుంటాడు. కానీ కోర్టులో న్యాయమూర్తి అసలు ఎంత నష్టం జరిగింది? దాన్ని ఎలా నిరూపిస్తారు? కొనుగోలుదారు ఆ నష్టాన్ని ముందే ఊహించగలడా? మరో కొనుగోలుదారు కోసం మీ క్లయింటు ఏం చేశారు?’’ అని అడిగినప్పుడే అసలు పరీక్ష మొదలవుతుందన్నారు. ‘‘విద్యార్థి సూత్రాన్ని నేర్చుకుంటాడు. న్యాయవాది దానికి కట్టుబడి నిలబడాలి’’ అన్నారు. న్యాయ విద్యఎన్నడూ నిశ్చలమైనది కాదని, కానీ ఇన్ని సవాళ్లను, ప్రశ్నలను ఒకేసారి ఎదుర్కోవడం ఇదే మొదటిసారని చెప్పారు. ‘‘శాసనసభలు చట్టాలను చేయొచ్చు, కోర్టులు వ్యాఖ్యానించొచ్చు, ప్రభుత్వాలు అమలు చేయొచ్చు. కానీ చట్టం భవిష్యత్తు చివరకు మనం తీర్చిదిద్దే విద్యార్థుల చేతుల్లోనే రూపు దిద్దుకుంటుంది’’ అని గుర్తుచేశారు.


నిషేధిస్తే చాటుకు పోతుంది

జనరేటివ్‌ ఏఐ వచ్చాక జవాబుపత్రం గానీ, పరిశోధనా పత్రం గానీ విద్యార్థికి ఏం తెలుసో చెప్పే సాక్ష్యం అనే నమ్మకం కదిలిపోయిందని సీజేఐ వ్యాఖ్యానించారు. ‘‘విద్యార్థులు ఈ సాధనాలు వాడతారా లేదా అన్నది ఇక ప్రశ్న కాదు. వారి పనిలో వారి సొంత తర్కం, అవగాహన ప్రతిఫలిస్తున్నాయా లేదా అన్నదే ప్రశ్న’’ అన్నారు. కామన్వెల్త్‌ దేశాల కోర్టులు చాలావరకు ఏఐని నిషేధించకుండా నియంత్రించే మార్గాన్నే ఎంచుకున్నాయని చెప్పారు. సింగపూర్‌ సుప్రీంకోర్టు ఏఐ వాడకానికి అనుమతిస్తూనే, దాఖలు చేసే ప్రతి పత్రానికీ వాడిన వారినే పూర్తి బాధ్యులను చేస్తోందని ఉదహరించారు. ‘‘నిషేధం విధిస్తే ఈ వాడకం కంటికి కనిపించకుండా చాటుకుపోతుంది. అక్కడ దానికి మార్గనిర్దేశం చేయలేం, పరిశీలించనూ లేం’’ అన్నారు.


డిటెక్టర్లతో నిజాయతీపరులకు మోసగాళ్ల ముద్ర

ఏఐ రాసిందో లేదో తేల్చే సాఫ్ట్‌వేర్‌ ఇచ్చే తీర్పునే అక్రమానికి రుజువుగా భావించాలనిపిస్తుందని, కానీ అది ఏ మాత్రం నమ్మదగినది కాదని సీజేఐ చెప్పారు. 2023 నాటి ఒక అధ్యయనాన్ని ఉదహరించారు. ‘‘విస్తృతంగా వాడుకలో ఉన్న ఏడు డిటెక్టర్లు అమెరికా పాఠశాల విద్యార్థుల వ్యాసాలను దాదాపు తప్పు లేకుండా గుర్తించాయి. కానీ ఇంగ్లిషు మాతృభాష కానివారు రాసిన ప్రతి ఐదు వ్యాసాల్లో మూడింటికి పైగా యంత్రం రాసినవేనని తప్పుగా తేల్చాయి’’ అని సీజేఐ తెలిపారు. ‘ఎంతోమంది ఇంగ్లిషును రెండో, మూడో భాషగా రాసే కామన్వెల్త్‌లో.. ఎవరూ వివరించలేని, ఆ విద్యార్థి సవాలు చేయలేని ఒక అంకె ఆధారంగా నిజాయతీపరుడైన విద్యార్థికి మోసగాడనే ముద్ర పడొచ్చు’’ అని సీజేఐ హెచ్చరించారు. ఎలాంటి వాడకానికి అనుమతి ఉంది, దేన్ని వెల్లడించాలి అనేది పరీక్షకు ముందే విద్యార్థులకు స్పష్టం చేయాలన్నారు. రాతపనికి తోడు మౌఖిక వివరణ, ఉదహరించిన ఆధారాలను సమర్థించుకోవడం, యంత్రం జవాబులో తప్పులు పట్టుకునే అభ్యాసం ఉండాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ సూచించారు. ‘తమ పట్టభద్రులు ఏం చేయగలరో ఒక న్యాయ కళాశాల నమ్మకంగా ధ్రువీకరించగలగాలి‘ అన్నారు.


కల్పిత తీర్పులూ నిజమైనవిలానే..

న్యాయ పరిశోధనలో ఏఐతో ప్రమాదం ఇంకా ఎక్కువని సీజేఐ అన్నారు. ‘ధారాళంగా వచ్చిన జవాబు కచ్చితమైనదే కానక్కర్లేదు. కల్పిత ఆధారం పూర్తిగా నమ్మదగ్గదిలా కనిపించవచ్చు‘ అని హెచ్చరించారు. పరిశోధకులు ప్రతి ఆధారాన్నీ మూల ప్రతితో సరిచూడాలని, గణనీయమైన సాయం తీసుకుంటే వెల్లడించాలని చెప్పారు. ఆ పనికి ఏఐ బాధ్యత వహించలేదు కాబట్టి దాన్ని రచయితగా పేర్కొనలేమన్నారు. ప్రచురించని రాత ప్రతులు, పరిశోధన డేటా, క్లయింట్ల రహస్య సమాచారాన్ని అనుమతి, గోప్యత, భద్రత పట్టించుకోకుండా ఏఐ వేదికల్లోకి ఎక్కించకూడదని జస్టిస్‌ సూర్యకాంత్‌ హెచ్చరించారు. న్యాయ పరిశోధనలో ఏఐ సాయాన్ని వెల్లడించడంపై నమూనా మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతను సీఎల్‌ఈఏ తీసుకోవాలని సూచించారు. దర్యాప్తులో వాడే బ్రెయిన్‌ మ్యాపింగ్‌ను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఏఐ ఏకంగా న్యాయమూర్తుల మెదడును చదివే చిప్‌ను కూడా తయారు చేస్తుందేమోనని సీజేఐ చమత్కరించారు.


TG copy.jpgరామ్‌ జెఠ్మలానీ విగ్రహావిష్కరణ

సీనియర్‌ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్మన్‌ రామ్‌ జెఠ్మలానీ విగ్రహాన్ని కరీంనగర్‌లోని జస్టిస్‌ కుమారయ్య కాలేజ్‌ ఆఫ్‌ లా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ శనివారం హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో దాన్ని ఆవిష్కరించారు.

పట్టాకు ముందు న్యాయ సహాయం

‘‘హక్కులను ఎలా వినియోగించుకోవాలో తెలియని వారికి ఆహక్కుల వల్ల ఒరిగేదేమీ ఉండదు’’ అని సీజేఐ అన్నారు. కూలి అందని కార్మికుడు, పత్రాల్లో తప్పువల్ల పింఛను ఆగిపోయిన వితంతు వు, సొంతఇంట్లో హింస ఎదుర్కొంటున్న మహిళ.. వీరికి మొదటి అడ్డంకి పరిష్కారాన్ని వివరించి, అది అందేలా సాయం చేసేవారు లేకపోవడమేనని చెప్పారు. ఏ నిబంధనా లేని రోజుల్లోనే విద్యార్థులను తరగతి గది దాటించి పేదల కోసం లీగల్‌ క్లినిక్‌లు నడిపించిన ప్రొఫెసర్‌ ఎన్‌.ఆర్‌.మాధవ మేనన్‌ కృషిని ఈ సందర్భంగా సీజేఐ స్మరించుకున్నారు. .


సెలవుల్లో సేవ చేసే విద్యార్థులకు వాస్తవంగా చేసిన పనికి సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. ఛాంబర్లకు వెళ్లని విద్యార్థికి ఇచ్చే నకిలీ ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఆ విద్యార్థికే కాదు, అతడు భవిష్యత్తులో వాదించే ప్రతి క్లయింటుకూ అన్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌ పాల్గొన్నారు. శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏ.హెచ్‌.ఎం.డి.నవాజ్‌, వివిధ హైకోర్టులకు చెందిన 32 మంది సిట్టింగ్‌ న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి. సామ్‌ కోషి, నిర్వాహక కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ ఈ.వి.వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి, సదస్సు చైర్మన్‌ శివకుమార్‌, పలు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల వీసీలు పాల్గొన్నారు


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 03:01 AM