Share News

పంత్ శతకంపై హర్షం వ్యక్తం చేసిన గావస్కర్.. వీడియో వైరల్!

ABN , Publish Date - Nov 22 , 2026 | 10:43 AM

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (128) అద్భుత సెంచరీ చేశాడు. అతడి శతకంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ హర్షం వ్యక్తం చేస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

పంత్ శతకంపై హర్షం వ్యక్తం చేసిన గావస్కర్.. వీడియో వైరల్!
Rishabh Pant

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (128; 153 బంతుల్లో) అద్భుత సెంచరీ చేశాడు. అతడి శతకంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ హర్షం వ్యక్తం చేస్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఇవాళ(ఆదివారం) నాలుగో రోజు ఆటలో 99 పరుగుల వద్ద ఉన్న పంత్.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి, ఆపై ముందుకు వచ్చి మిడాఫ్ మీదుగా భారీ సిక్సర్‌తో శతకం చేశాడు. దీంతో అతడు టెస్టుల్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. పంత్ సిక్సర్‌తో శతకం బాదగానే కామెంట్రీ బాక్స్‌లో ఉన్న గావస్కర్ ఆనందంతో సీటులోంచి లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


గతంలో పంత్ ఆటతీరుపై విమర్శలు చేసిన గావస్కర్.. ఈసారి అతడి ఇన్నింగ్స్‌ను మనసారా అభినందించడం గమనార్హం. ఈ సెంచరీతో వికెట్‌కీపర్ బ్యాటర్లలో అత్యధిక టెస్టు శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కీపర్ లెస్ అమెస్ (8)ను అధిగమించి పంత్ (9) మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ (17), ఆండీ ఫ్లవర్ (12) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అలాగే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (సెనా) దేశాల్లో టెస్టు శతకాలు నమోదు చేసిన తొలి ఆసియా వికెట్‌కీపర్‌గానూ పంత్ చరిత్ర సృష్టించాడు.


ఈ ఘనత సాధించిన మూడో వికెట్‌కీపర్‌గా నిలిచాడు. 29 ఏళ్ల పంత్ తన తొమ్మిది టెస్టు శతకాల్లో ఏడు విదేశాల్లో, రెండు స్వదేశంలో సాధించాడు. ఓవల్ (114), సిడ్నీ (159*), కేప్‌టౌన్ (100*), ఎడ్జ్‌బాస్టన్ (146), లీడ్స్ (134, 118)లలో సెంచరీలు చేసిన పంత్.. తాజాగా వెల్లింగ్టన్‌లో (128) శతకంతో మెరిశాడు. పంత్, కేఎల్ రాహుల్ (136) శతకాలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 720/9 వద్ద డిక్లేర్ చేసి 352 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 80/2తో ఆట కొనసాగిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 10:56 AM