అరటి ఊచ... ఉక్కు ఊచ
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:11 PM
అరటి కాండం పైన డొప్పల్ని ఒలిస్తే తెల్లని సారవంతమైన, మృదువైన భాగం ఉంటుంది. దీన్ని ఊచ, బొందె, దూట ఇలా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు.
అరటి కాండం పైన డొప్పల్ని ఒలిస్తే తెల్లని సారవంతమైన, మృదువైన భాగం ఉంటుంది. దీన్ని ఊచ, బొందె, దూట ఇలా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. ‘రంభాంతరా గర్భం’ అన్నాడు దీన్ని పాకదర్పణంలో నలుడు. సారవంతమైనది. బలమైనదాన్ని ‘ఊచపట్టు’ అంటాం. ఇనుప కమ్మీల్ని ఊచలంటాం. అరటి ఊచ ఎంత మెత్తగా ఉంటుందో శరీరానికి అంతటి ఉక్కు శక్తినిస్తుంది. మృదువుగా ఉండటాన్నిబట్టి ‘ఊచకోత కోయడం’ అనే పదబంధం పుట్టింది. మన భోజనం ఊచ పట్టుగా అంటే బలాన్నిచ్చేదిగా ఉండాలన్నది అరటి ఊచ ఇచ్చే సందేశం. అరటి ఆకులు అమ్మే వారి దగ్గర, కూరగాయల మార్కెట్లో కూడా దొరుకుతుంది.
అరటి ఊచతో కూర, పప్పు, పచ్చడి, పులుసు, సాంబారు, పెరుగుపచ్చడి ఇలా అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. గుజ్జుగా చేసి శనగపిండి లేదా గోధుమపిండి కలిపి పకోడీలు వేసుకోవచ్చు. గారెలు వగైరా వంట కాల్లో అరటి ఊచని చేర్చవచ్చు. బిట్టర్ టానిక్ అనే పదానికి అరటి ఊచే సాక్ష్యం. దీనిలోని వగరు రుచే దీని పోషకత్వానికి నిదర్శనం.
చల్ల: అరటి ఊచని చిన్న ముక్కలుగా తరిగి పెరుగు కలిపి మిక్సీ పడితే చిక్కటి మజ్జిగ వస్తుంది. ఖాళీ కడుపున ఈ మజ్జిగ రోజూ తాగితే స్థూలకాయానికి విరుగుడుగా పనిచేస్తుంది. షుగరు రోగులూ,స్థూలకాయులూ తప్పనిసరిగా దీన్ని రోజూ తీసుకోవాలి.
చల్లపులుసు: అరటి ఊచని ముక్కలుగా తరిగి ఇతర కూరగాయ ముక్కలు కూడా కలిపి మెత్తగా అయ్యేలా ఉడికించి, సుగంధద్రవ్యాల్ని పేస్టులాగా చేసి అన్నింటినీ మజ్జిగలో కలిపి ఒక పొంగు వచ్చేలా ఉడికించినది చల్ల లేదా మజ్జిగ పులుసు. వేడిని తగ్గిస్తుంది బలకరం.
పెరుగుపచ్చడి: అరటి ఊచ ముక్కల్ని మెత్తగా ఉడికించి పెరుగు కలిపి తాలింపు పెట్టినది పెరుగుపచ్చడి. పొయ్యి ఎక్కించాల్సిన అవసరం లేని వంటకం. గొప్ప ఆహార ఔషధం. పెరుగు ప్రోబయాటిక్‌గా, అరటి ఊచలోని పీచు ప్రీబయాటిక్‌గా పనిచేస్తాయి. వేడినీ, బీపీనీ, షుగరువ్యాధినీ తగ్గిస్తుంది. పేగుపూత, గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ సమస్యలున్నవారికి ఇది మేలు చేస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు, లివర్ వ్యాధుల్లో మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కూర: ఒక అంగుళం మందాన అరటి ఊచ ముక్కని తీసుకుని దాన్ని దోసెలకోసం ఉల్లిముక్కలంత సన్నగా తరగండి. తరిగేప్పుడు వేలితో చుడుతూ ఉంటే పీచు ఊడి వచ్చేస్తుంది. తరిగిన ముక్కల్ని తరిగినట్టుగా పసుపు నీళ్లలో వేస్తుంటే నల్లబడకుండా ఉంటాయి. ఈ ముక్కల్ని ఒక భాండీలో వేసి, ఉప్పు, పసుపు కలిపి సన్నసెగన ఉమ్మగిల నివ్వండి. ముక్కలు మెత్తబడిన తరువాత నెయ్యి, ఇంగువ, ఇతర సుగంధ ద్రవ్యాలు కలిపి కాసేపు వేగనివ్వండి. వేడి అన్నంలో తింటే ఈ కూర కమ్మగా ఉంటుంది. ఒక రెబ్బ చింతపండుగానీ ఒక చెంచా నిమ్మరసం గానీ కావాలంటే కలుపుకోవచ్చు.
వగరు రుచి కలిగినది కావటాన షుగరు రోగులకు, స్థూలకాయులకూ చాలా మేలు చేస్తుంది. తీసుకున్న ఆహారం వంటబట్టించి శక్తి ఉత్పత్తిలో సహకరిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియని వేగిరపరుస్తుంది. రక్తస్రావాన్ని, బీపీని తగ్గిస్తుంది. ఎముక పుష్టినిస్తుంది. నీటి ఉబ్బు (ఎడీమా)ని తగ్గిస్తుంది. పక్షవాతం రాకుండా నివారిస్తుంది. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. శరీరంలో జలధాతు సమతుల్యతను (వాటర్ బ్యాలెన్స్) కాపాడుతుంది. విషదోషాలను పోగొడుతుంది. ఊచ అరటి పండుకన్నా చవకైనది, ఉత్తమ ఔషధ గుణాలు కలిగింది.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. 3 సంవత్సరాల తర్వాత..
Read Latest AP News And Telangana News And International News And Telugu News