ఇక.. సాకర్ కిక్
ABN , Publish Date - Jun 07 , 2026 | 11:38 AM
యావత్ ప్రపంచం ఆసక్తిగా వీక్షించే అత్యద్భుత ఘట్టానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. 39 రోజుల పాటు క్రీడాలోకం సాకర్ ఫీవర్‌తో హీటెక్కనుంది.
మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్, ఎంబాపెలాంటి యోధానుయోధులు... మైదానంలో పాదరసంలా కదలాడుతూ మైమరపింపజేసే విన్యాసాలు... కురుక్షేత్రాన్ని తలపించే మైదానాలు... స్టార్ల నామస్మరణతో దద్దరిల్లిపోయే స్టేడియాలు... యావత్ ప్రపంచాన్ని టీవీల ముందు అతుక్కుపోయేలా చేసే ఉత్కంఠభరిత దృశ్యాలు... సుమారు నలభైరోజులపాటు విశ్వ క్రీడాజగత్తు కళ్లన్నీ ఆ బంతివైపే! ఇప్పుడందరినోటా ఒకే మాట... సాకర్... సాకర్... సాకర్! నాలుగేళ్లకోసారి ఫుట్‌బాల్ ప్రేమికులను ఉర్రూతలూగించే ‘ఫిఫా’ ప్రపంచకప్ వచ్చేసిందోచ్...
యావత్ ప్రపంచం ఆసక్తిగా వీక్షించే అత్యద్భుత ఘట్టానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. 39 రోజుల పాటు క్రీడాలోకం సాకర్ ఫీవర్‌తో హీటెక్కనుంది. అందరికీ ఇష్టమైన ఫుట్‌బాల్ పండగ, ఫిఫా ప్రపంచకప్ జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం.. జట్లతో పాటు మ్యాచ్‌ల సంఖ్య పెరగడం.. మెస్సీ, రొనాల్డోలాంటి స్టార్లకు ఆఖరి కప్ కానుండడం... ఇలా ఈ 23వ ప్రపంచకప్‌నకు విశేషాలు ఎన్నో ఉన్నాయి.
ప్రతీ నాలుగేళ్లకోసారి వచ్చే ఫిఫా ప్రపంచకప్ మొట్టమొదటిసారిగా 1930లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946 సంవత్సరాల్లో టోర్నీ జరగలేదు. అనంతరం జర్నీ సాఫీగా సాగింది. ప్రతీసారి అమితమైన ఆదరణను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.
ఈసారి ‘వెరీ వెరీ స్పెషల్’..
ఈ ఏడాది ప్రపంచకప్ ఎంతో ప్రత్యేకం. 2022లో గల్ఫ్ దేశం కతార్‌లో జరిగిన టోర్నీలో 32 జట్లు పోటీపడ్డాయి. ఆటను మరింత విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈసారి జట్ల సంఖ్యను 48కి పెంచారు. దీంతో టోర్నీలో రికార్డుస్థాయిలో 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాకౌట్ దశకు అదనంగా రౌండాఫ్ 32ను జోడించారు. 48 జట్లు 12 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్ దశలో 72 మ్యాచ్‌లు జరుగుతాయి. 32 నాకౌట్ మ్యాచ్‌లుంటాయి. ప్రతీ గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో (24) పాటు అన్ని గ్రూపుల నుంచి మూడో స్థానంలోని 8 అత్యుత్తమ జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. నాకౌట్‌లో రౌండాఫ్ 32, ప్రీక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ ఉంటాయి.
అబ్బురం.. మూడు దేశాల ఆతిథ్యం
ఈ ప్రపంచకప్‌నకు మూడు దేశాలు ఆతిథ్యమిస్తుండటం అబ్బురపరిచే విషయం. అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో టోర్నీ జరగనుంది. ఇలా రెండు కన్నా ఎక్కువ దేశాలు కలిసి ప్రపంచకప్ నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో రెండుసార్లు (1970, 1986) నిర్వహించిన మెక్సికో మూడో పర్యాయం నిర్వహిస్తూ... అత్యధికసార్లు ఫిఫా కప్‌నకు ఆతిథ్యమిచ్చిన దేశంగా ఘనత వహిస్తోంది. 1994లో ప్రపంచకప్‌నకు వేదికగా నిలిచిన అమెరికాకు ఇది రెండో ఆతిథ్యం. కెనడాకు మొదటిసారి. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌తో మొదలై.. జూలై 19న అమెరికాలోని ది మెట్‌లైఫ్ స్టేడియం (న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం)లో జరిగే ఫైనల్ పోరుతో టోర్నీ ముగుస్తుంది. మెస్సీ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది.
క్వార్టర్‌ఫైనల్స్ నుంచి మ్యాచ్‌లన్నీ అమెరికా స్టేడియాల్లోనే నిర్వహిస్తున్నారు. బెర్ముడా, కెంచుకీ, బ్లూ గడ్డితో మైదానాలను తయారు చేస్తున్నారు. ఫైనల్ సహా 8 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న మెట్‌లైఫ్ స్టేడియంలో సాధారణంగా రగ్బీ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. కానీ, ఫిఫా టోర్నీకి అనుగుణంగా ఈసారి స్టేడియాన్ని ముస్తాబు చేశారు. మ్యాచ్‌లో కార్నర్ కిక్‌లను దృష్టిలో ఉంచుకొని స్టేడియంలోని కార్నర్లలో 1700కు పైగా సీట్లను తొలగించారు.
టాప్‌లో బ్రెజిల్...
ఇప్పటిదాకా 22 సాకర్ ప్రపంచకప్‌లు జరిగితే, కప్పును అందుకునే అదృష్టం 8 దేశాలకు మాత్రమే దక్కింది. ఇందులో అత్యధికంగా ఐదుసార్లు బ్రెజిల్ చాంపియన్‌గా నిలిచి టాప్‌లో ఉంది. జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు.. అర్జెంటీనా మూడుసార్లు, ఫ్రాన్స్, ఉరుగ్వే రెండేసి సార్లు విశ్వ విజేతలుగా నిలిచాయి. ఇంగ్లండ్, స్పెయిన్ ఒక్కోసారి ట్రోఫీని ముద్దాడాయి.
ఈసారి కప్ ఎవరిది..?
ఫిఫా వరల్డ్‌కప్ వచ్చిందనగానే.. ఈసారి చాంపియన్ ఎవరు అవుతారన్న ఆసక్తి నెలకొనడం సహజం. ఈ ప్రశ్నకు సాకర్ పండితుల టాప్ ఫేవరెట్లు ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా. కిలియాన్ ఎంబాపెతో పాటు ఒలివర్ గిరార్డ్, డెంబెలెలాంటి టాప్ ఆటగాళ్లున్న ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకర్ ఫ్రాన్స్ టైటిల్ కొట్టే అవకాశాలున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రెంచ్ జట్టు... గత టోర్నీ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడింది. కానీ, ఈసారి కప్ కోసం పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉంది. తొలిసారి 2010లో విజేతగా నిలిచిన స్పెయిన్ పూర్వవైభవం కోసం 16 ఏళ్లుగా శ్రమిస్తూనే ఉంది. రెండో ర్యాంక్‌లోనున్న స్పానిష్ జట్టు లామినె యామల్ లాంటి యువ అటాకర్లతో పటిష్టంగా కనబడుతోంది.
అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న మూడో ర్యాంకర్ అర్జెంటీనాకు ఆయువుపట్టు జట్టు సారథి మెస్సీ. అయితే, మెస్సీ గాయంతో బాధపడుతుండడం జట్టుకు ఆందోళనకరంగా మారింది. అయినా, మార్టినెజ్, అల్వారెజ్, రోడ్రిగోపాల్‌లాంటి ఆటగాళ్లుండడం జట్టుకు అదనపు బలం. హ్యారీ కేన్, బెల్లింగ్‌హామ్, బుకాయా సకా వంటి స్టార్లున్న ఇంగ్లండ్.. నెయ్‌మార్, విన్సియస్, ఎస్తేవాలతో కూడిన బ్రెజిల్.. రొనాల్డోకు తోడు బ్రూనో ఫెర్నాండెజ్, జావో నెవెస్‌లాంటి పటిష్ట ప్లేయర్లున్న పోర్చుగల్ టైటిల్‌వేటలో గట్టి పోటీదార్లు. వెటరన్ స్టార్ లూకా మోడ్రిక్ కెప్టెన్సీలోని క్రొయేషియా, కొలంబియా మొరాకో అవకాశాలను కొట్టిపారేయలేం.
మిడ్‌ఫీల్డర్‌గా ఖ్యాతికెక్కిన 40 ఏళ్ల మోడ్రిక్‌కు ఇదే ఆఖరి టోర్నీ కావడంతో అతనిపైనే క్రొయేషియా ఆశలన్నీ. ఆసియా, ఆఫ్రికా జట్ల ప్రదర్శన గురించి గొప్పగా చెప్పేందుకు ఏమీ లేదు. ఇప్పటిదాకా ఆసియా తరఫున 12 జట్లు ప్రపంచకప్‌లో పోటీపడ్డాయి. 2002లో దక్షిణ కొరియా నాలుగో స్థానంలో నిలవడమే ఇప్పటి దాకా ఆసియా తరఫున అత్యుత్తమం. ఆఫ్రికా నుంచి కామెరూన్, సెనెగల్, ఘనా క్వార్టర్ ఫైనల్ వరకు చేరగలిగాయి. ఇక.. అమెరికా, మెక్సికో, కెనడా సొంతగడ్డపై ఎంతవరకు సత్తా చాటుతాయన్నది సందేహమే.
అయ్యో ఇటలీ..
సాకర్‌లో ఘన చరిత్ర ఉన్న మాజీ చాంపియన్ ఇటలీకి మళ్లీ నిరాశే ఎదురైంది. వరుసగా మూడోసారి ఆ జట్టు మెగా టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమవడంతో ఆ దేశ అభిమానుల ఆవేదన అంతా ఇంతా కాదు.
కళ్లన్నీ వీళ్లపైనే!
ప్రతీ కథలో ఓ నాయకుడు ఉంటాడు. అతనే కథను మొత్తం నడిపిస్తుంటాడు. అందరిని తనవైపు తిప్పుకుంటాడు. అలాగే ఫుట్‌బాల్‌లో కూడా ప్రతీ జట్టులో ఓ స్టార్ ఉంటాడు. అతను మైదానంలో అడుగుపెడితే అందరి కళ్లూ వెంటాడతాయి. ఈసారి ప్రపంచ కప్‌లోనూ అలాంటి హీరోలకు కొదవలేదు.
పోర్చుగల్ వీరుడు సాధిస్తాడా..?
అందరికన్నా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జిస్తోన్న ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డోది అగ్రస్థానం. మైదానంలో మెరుపును తలపిస్తూ, దూకుడుకు నైపుణ్యాన్ని జోడించి ప్రత్యర్థులను చిత్తుచేసే మ్యాజిక్ ఇతని సొంతం. జాతీయ జట్టుతో పాటు తాను ప్రాతినిధ్యం వహించే క్లబ్‌లకు ఎన్నో విజయాలు అందించాడు. కెరీర్‌లో ఇన్ని ఘనతలు సాధించినా, ఇప్పటి దాకా ప్రపంచకప్‌ను మాత్రం
ముద్దాడలేకపోవడం రొనాల్డోకు తీరని లోటుగా మారింది. కప్పే లక్ష్యంగా రికార్డుస్థాయిలో ఆరోసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న 41 ఏళ్ల రొనాల్డో.. తన నాయకత్వంలో పోర్చుగల్‌ను ముందుకు నడిపించనున్నాడు. ఇతడికి దాదాపు ఇదే ఆఖరి ప్రపంచకప్ కావడంతో ఎలాగైనా జట్టును విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు.
మెస్సీ మళ్లీ మెప్పిస్తాడా..?
లియోనెల్ మెస్సీ.. ఈ అర్జెంటీనా దిగ్గజం గురించి పరిచయం అక్కర్లేదు. మైదానంలో పాదరసంలా కదలాడుతూ, కళ్లు చెదిరే షాట్లతో గోల్స్ కురిపించడంలో నేర్పరి. మారడోనా వారసుడిగా పేరు పొందిన 38 ఏళ్ల మెస్సీ.. ప్రపంచకప్ నెగ్గాలన్న తన చిరకాల స్వప్నాన్ని గత టోర్నీతో నెరవేర్చుకున్నాడు. ఆ టోర్నీలో ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ గోల్ కొట్టి అరుదైన రికార్డును అందుకున్నాడు. కానీ, ఈసారి సరిగ్గా ప్రపంచకప్ ముందు గాయ పడడం మెస్సీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేకెత్తిస్తోంది. మయామి క్లబ్ మ్యాచ్‌లో బంతిని కొట్టే క్రమంలో మెస్సీ ఎడమకాలికి గాయ మైంది. గాయం తీవ్రంగానే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మెస్సీ అస్సలు టోర్నీలో ఆడతాడా అన్న అనుమానాలు మొదలైనా, చివరికి అతడిని జట్టుకు ఎంపికచేశారు. కానీ, మునపటి స్థాయిలో అతను రాణిస్తాడా..? వరుసగా రెండోసారి ట్రోఫీతో మెప్పిస్తాడా అన్నది చూడాలి.
సాంబా హో అనిపిస్తాడా..?
ప్రతీ ప్రపంచకప్‌లోనూ అందరి దృష్టిని ఆకర్షించే దేశం బ్రెజిల్. ఎప్పటిలాగే ఈసారి కూడా సాంబా జట్టులోని స్టార్ ఆటగాడు నెయ్‌మార్ జూనియర్ గురించే అంతా చర్చ. అద్భుతమైన డ్రిబ్లింగ్, మైదానంలో మెరుపు వేగం, కళ్లు చెదిరే గోల్స్ సత్తా.. ఈ లక్షణాలతో అనతికాలంలో స్టార్ ఆటగాడిగా నీరాజనాలందుకున్న 34 ఏళ్ల నెయ్‌మార్.. తాను ప్రాతినిఽథ్యం వహించిన క్లబ్‌లకు ఘనమైన విజయాలు కట్టబెట్టాడు. ఆమధ్య కాన్ఫడరేషన్స్ కప్‌లో బ్రెజిల్‌ను గెలిపించి గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నాడు. అయితే ఇటీవలికాలంలో ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతోన్న నెయ్‌మార్‌ను అతని ఆటతీరుపై ఉన్న నమ్మకంతో సెలెక్టర్లు ప్రపంచకప్‌నకు ఎంపిక చేశారు. మరి.. ఈసారి జట్టును గెలిపిస్తాడో లేదో చూడాలి.
యామల్.. ఏ మాయ చేస్తాడో..?
స్పెయిన్‌కు చెందిన ఈ 18 ఏళ్ల లామినె యామల్.. నవతరం ఫుట్‌బాల్‌లో అతిపెద్ద సంచలనం. టీనేజ్‌లోనే సీనియర్లకు దీటుగా చెలరేగుతూ గోల్స్ వర్షం కురిపిస్తున్న ఈ రైట్ వింగర్‌పై ప్రపంచకప్‌లో భారీ అంచనాలున్నాయి. స్పెయిన్ జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న యామల్ ఆటతీరును చూసి అప్పుడే దిగ్గజాలైన మారడోనా, మెస్సీలతో పోలుస్తున్నారు సాకర్ పండితులు. చిన్న వయసులోనే ఎంతో పరిణతితో, బలమైన మానసిక దృక్పథంతో కనిపిస్తున్న యామల్, ప్రపంచకప్‌లో కచ్చితంగా అందరి హృదయాలను కొల్లగొడతాడనడంలో సందేహం లేకపోవచ్చు. యూరో కప్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో స్పెయిన్‌కు విజయం అందించడంతో పాటు బార్సిలోనా క్లబ్ టైటిళ్లు నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మెరుపు వేగంతో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లడం, క్షణాల్లో బంతిని లోపలికి పంపించడం యామల్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఆడబోతున్నది తొలి ప్రపంచకప్ అయినా యామల్ ఒక్కసారి చెలరేగితే మైదానంలోని అతడిని అడ్డుకోవడం సవాలే.
ఎంబాపెను ఆపేదెవరు?
ఈ ప్రపంచకప్‌లో అభిమానులు మెస్సీ ఆటకోసం ఎంతగా ఎదురుచూస్తారో, ఎంబాపె మెరుపుల కోసం అంతే ఎగబడతారనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అవును మరి.. అంతగా మెగా టోర్నీలో ఈ ఫ్రాన్స్ ఆటగాడి విజృంభణ ఉంటుంది. తన అద్భుత ఆటతీరుతో ఎనిమిదేళ్ల క్రితం నాలుగు గోల్స్ చేసి ఫ్రాన్స్‌కు ప్రపంచకప్ అందించిన 27 ఏళ్ల ఎంబాపె, కతార్ టోర్నీలో తన జట్టును ఫైనల్ చేర్చడంలోనూ అంతే కీలకంగా ఉన్నాడు. ఇక.. ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఫ్రాన్స్ ఓడినా.. ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగి మెస్సీకి దీటుగా నిలిచాడు. ఆ టోర్నీలో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ కూడా అందుకున్న ఇతడు.. మైదానంలో చిరుత వేగంతో, బంతిపై గొప్ప నియంత్రణతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి సంధించడంలో దిట్ట. అటాకర్ ఒక్కసారి జూలు విదిల్చితే అతడిని ఆపడం కష్టతరమే.
అమెరికా వద్దంది... మెక్సికో రమ్మంది
పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా ఇరాన్‌పై అగ్రరాజ్యం అమెరికా దాడులకు పాల్పడడం.. ఆ జట్టు తమ దేశంలో అడుగుపెడితే భద్రత కల్పించలేమని అమెరికా వ్యాఖ్యానించడం.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ, తమ జట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచకప్‌లో ఆడతుందని ఇరాన్ స్పష్టం చేసింది. దీంతో తమ దేశంలో బస చేసేందుకు ఇరాన్ జట్టుకు అమెరికా అనుమతి నిరాకరించింది. అయితే, ఇరాన్ జట్టు బేస్ క్యాంప్‌ను మెక్సికోలో ఏర్పాటు చేసుకుంది. ఇరాన్ జట్టు మ్యాచ్ జరిగే రోజు మాత్రమే అమెరికాకు వెళ్లి మ్యాచ్ ముగిసిన వెంటనే తిరిగి మెక్సికో చేరుకోనుంది. ప్రపంచకప్‌లో ఇరాన్‌కు రికార్డు గొప్పగా లేదు. ఆ జట్టు ఒక్కసారి కూడా గ్రూప్ దశ దాటలేదు. కానీ, ఈసారి ప్రదర్శనను మెరుగుపరచుకొని తమ ఆటతోనే అమెరికాకు గట్టి సమాధానం చెప్పాలనుకుంటోంది.
అక్షరాలా రూ. 5911 కోట్లు...
నాలుగేళ్ల క్రితం టోర్నీతో పోలిస్తే ఈసారి ప్రైజ్‌మనీని యాభై శాతానికి పెంచడం విశేషం. ఈసారి ఫిఫా కప్‌లో అందించనున్న మొత్తం రూ. 5911 కోట్లు. గత కప్‌లో ఓవరాల్ ప్రైజ్‌మనీ రూ. 3,590 కోట్లుగా ఉంటే.. ఈసారి దాన్ని దాదాపు రెట్టింపు చేశారు.
విజేతకు రూ. 451 కోట్లు.. ఫైనల్లో ఓడిన జట్టుకు రూ. 297 కోట్లు దక్కుతుంది.
మూడో స్థానం జట్టుకు రూ. 261 కోట్లు, నాలుగో స్థానానికి రూ. 243 కోట్లు లభిస్తాయి.
క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమిస్తే (5 నుంచి 8 స్థానాల్లో నిలిచిన జట్లకు) ఒక్కో జట్టుకు రూ. 171 కోట్ల చొప్పున దక్కుతాయి.
ప్రీ క్వార్టర్‌ఫైనల్లో వెనుదిరిగితే (9 నుంచి 16 స్థానాల్లో నిలిచిన జట్లు) ఒక్కో జట్టు రూ. 135 కోట్ల చొప్పున అందుకోనుంది.
చిన్న దేశాలకు కూడా ఆర్ధికంగా చేయూతనిచ్చేలా ఈసారి ప్రైజ్‌మనీని రూపొందించారు. ఎలాగంటే.. ఫిఫా కప్‌నకు అర్హత సాధించినందుకు ప్రతీ జట్టుకు ప్రిపరేషన్ కింద రూ. 13.53 కోట్లు అందజేస్తారు. ఇక, కనీసం తొలిరౌండ్ దాటకపోయినా రూ. 81 కోట్లు అందుకునే జట్టు.. ప్రిపరేషన్ మొత్తంతో కలిపి ఓవరాల్‌గా రూ. 95 కోట్లతో ఇంటికి వెళుతుంది. టోర్నీలో పోటీపడ్డ ప్రతీ జట్టు లాభపడేలా ఈ నగదు బహుమతి ప్రక్రియ ఉంటుంది.
అన్ని చోట్లా వేడుకలు...
ఫిఫా ప్రపంచకప్ వేడుకలు కూడా మూడు వేర్వేలు వేదికల్లో జరగనున్నాయి. ఆతిథ్య దేశాల్లో ఆరంభ మ్యాచ్‌కు 90 నిమిషాల ముందు సంబరాలు మొదలవుతాయి. తొలిరోజు జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో, జూన్ 12న కెనడాలో, జూన్ 12న అమెరికాలో పాప్ తారలు, అందాల భామల ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. గత ప్రపంచకప్‌లో సందడి చేసిన మన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ తన ఆటాపాటతో ఈమారు టొరంటోలో ప్రదర్శన ఇవ్వనుంది. కేటీ పెర్రీ, అనిట్టా, లీసా, రేమా, అలెజాండ్రో ఫెర్నాండెజ్, అలనిస్‌లాంటి పాప్ స్టార్లు వేడుకల్లో అలరించనున్నారు.
మన చోటు ఎక్కడ..?
ఈ ప్రపంచకప్‌లో ఆడుతోన్న కురకావో దేశ జనాభా కేవలం లక్షా యాభై వేలు.. అదే 140 కోట్లకు పైగా ప్రజలున్న భారత్ మాత్రం ఇప్పటిదాకా ప్రపంచకప్‌లో అడుగు పెట్టలేకపోయింది. ప్రతీ నాలుగేళ్లకోసారి కనీసం రెండు, మూడు కొత్త జట్లు మెగా టోర్నీలో ప్రవేశిస్తుంటే.. భారత జట్టు మాత్రం అర్హత స్థాయిని కూడా అందుకోలేకపోతోంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 136వ స్థానంతో దిగువన ఉన్న భారత్ ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడంలో విఫలమైంది. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రిలాంటి స్టార్ ఆటగాళ్లున్నా సమష్టిగా రాణించలేక భారత్ ప్రతిసారీ వెనకబడుతూనే ఉంది.
పొంచి ఉన్న పర్యావరణ ముప్పు...
ఈ ప్రపంచకప్‌తో పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్న నివేదికలు వెలువడుతున్నాయి. మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, లక్షలాది మంది అభిమానులు మూడు దేశాల మధ్య సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో టోర్నీ పూర్తయ్యేలోపు దాదాపు 9 మిలియన్ టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలు విడుదలయ్యే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత కాలుష్యకరమైన ప్రపంచకప్‌గా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదని పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఎండ, ఉక్కపోత వల్ల ఆటగాళ్ల ఆరోగ్యం, మ్యాచ్‌ల వీక్షణకు వచ్చే అభిమానుల భద్రతకు ఆందోళనకరంగా మారొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
శ్రీభానుకాంత్ రెడ్డి, 80966 77403
మస్కట్లు... మేపుల్, జాయు, క్లచ్
ఈ ఫిఫా ప్రపంచకప్ మూడు దేశాల్లో జరుగుతుండడంతో ఆ దేశాలకు చెందిన మూడు జంతువులు మేపుల్ (దుప్పి - కెనడా), జాయు (జాగ్వార్ - మెక్సికో), క్లచ్ (డేగ - అమెరికా) పేరిట టోర్నీ అధికారిక చిహ్నాల (మస్కట్)ను తయారు చేశారు. ఆయా దేశాల ఉజ్వలమైన సంస్కృతి, స్ఫూర్తి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు. మేపుల్ అంటే సృజనాత్మకత, దృఢమైన సంకల్పం కలిగిన గోల్‌కీపర్‌కు, జాయును చురుకైన, శక్తివంతమైన ఫార్వర్డ్ ఆటగాడికి, క్లచ్‌ను నిర్భయమైన, సాహసోపేతమైన మిడ్‌ఫీల్డర్‌కు సంకేతాలుగా ఫిఫా అభివర్ణించింది.
షకీరా నోట.. డాయ్ డాయ్
2010లో వాకా వాకా, 2014లో లా లా లా అంటూ సాకర్ ప్రపంచాన్ని ఊపేసిన పాప్ సెన్సేషన్ షకీరా ఈసారి ‘డాయ్ డాయ్’ అంటూ అభిమానుల ముందుకొచ్చింది. ఆనవాయితీ ప్రకారం మెగా టోర్నీకి ముందు విడుదలజేసే ఈ అధికారిక ఫిఫా గీతంలో నైజీరియా కళాకారుడు బర్నా బాయ్‌తో కలిసి షకీరా చిందులేసింది. ఫుట్‌బాల్ కల్చర్, గ్లోబల్ యూనిటీని చాటిచెబుతూ రూపొందించిన ఈ వీడియోలో మెస్సీ, ఎంబాపె, వినిసియస్ జూనియర్, హ్యారీకేన్‌లాంటి సాకర్ స్టార్లు దర్శనమిస్తారు. ఈ మ్యూజిక్ వీడియో ద్వారా వచ్చే రాయల్టీ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద పిల్లల ఉచిత విద్య, క్రీడా సదుపాయాల కోసం ఖర్చు చేస్తారు.
స్మార్ట్ బాల్.. ట్రియాండా
టోర్నీలో వాడే అధికారిక బంతి పేరు ట్రియాండా. స్పానిష్‌లో ట్రియాండా అంటే మూడు అలలు అని అర్థం. ఆతిథ్య దేశాల గుర్తింపును సూచించేలా ఎరుపు రంగు మేపుల్ లీఫ్ (కెనడా), ఆకుపచ్చ రంగు డే (మెక్సికో), నీలిరంగు నక్షత్రం (అమెరికా) గుర్తులను బంతిపై ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది అత్యాధునికమైనది. ఈ స్మార్ట్‌బాల్‌లో నాలుగు ప్యానెళ్లు ఉంటాయి. దీనివల్ల బంతి స్థిరంగా, వేగంగా గాలిలో ఎగురుతుంది. ఇందులో 500 హెచ్‌జెడ్ మోషన్ సెన్సార్ చిప్‌ను అమర్చారు. సెకనుకు 500 సార్లు కదలికల డేటాను రియల్ టైమ్‌లో రికార్డ్ చేయడంలో రిఫరీలకు సాయపడుతుంది.
చిన్న దేశం.. పెద్ద విజయం...
ఆఫ్రికాలోని అతి చిన్న దేశం కేప్ వెర్డె అద్భుత పోరాటానికి నిదర్శనం ఇది. కేవలం 5 లక్షల 25 వేల జనాభా ఉన్న కేప్ వెర్డె.. మొదటిసారి ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ తరఫున జరిగిన అర్హత పోరులో విజేతగా నిలిచి ఫిపా టోర్నీకి ఎంపికైన కేప్ వెర్డె జట్టు.. ఈసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న చిరుదేశంగా గుర్తింపు పొందింది.
గోల్డెన్ అవార్డ్స్
ఓవరాల్‌గా మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎంపిక చేసి పురస్కారాలు అందజేయడం ఫిఫా కప్‌లో ఆనవాయితీ. వాళ్లకు గోల్డెన్ అవార్డ్స్ అందజేస్తారు.
గోల్డెన్ బాల్
టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి బెస్ట్ ప్లేయర్ కేటగిరి కింద ఇస్తారు.
గోల్డెన్ బూట్
టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడికి అందజేస్తారు.
గోల్డెన్ గ్లోవ్
టోర్నీలో ఉత్తమ గోల్‌కీపర్‌కు దక్కే అవార్డు ఇది.
ఈ వార్తలు కూడా చదవండి:
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. 3 సంవత్సరాల తర్వాత..
Read Latest AP News And Telangana News And International News And Telugu News