ఊరంతా కళాత్మకం..
ABN , Publish Date - Jun 07 , 2026 | 10:27 AM
ఆ గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ చిత్రకారులే. ఇంటిగోడలే వారికి కాన్వాసులు. తమ చిత్రకళా నైపుణ్యంతో ఇంటి గోడలను కళాత్మకంగా తీర్చిదిద్దుతారు.
ఆ గ్రామాల్లో ప్రతీ ఒక్కరూ చిత్రకారులే. ఇంటిగోడలే వారికి కాన్వాసులు. తమ చిత్రకళా నైపుణ్యంతో ఇంటి గోడలను కళాత్మకంగా తీర్చిదిద్దుతారు. దూరం నుంచి చూస్తే గోడలకు టైల్స్ అతికిం చారా? అనే అనుమానం కలుగుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఊరు ఊరంతా ఇదే చిత్రం... అదే విచిత్రం...
పూర్వం పండగ రోజుల్లో మట్టి ఇంటిని పేడ నీళ్లతో అలికి ఎంచక్కా ముగ్గులు పెట్టి, అలంకరించేవారు. అయితే క్రమంగా మట్టి ఇళ్ల స్థానంలో కాంక్రీట్ భవనాలు వెలిశాయి. ఇల్లు అలకడం, ముగ్గు వేయడం మరిచిపోయారు. అయితే ఇప్పటికీ ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొన్ని గిరిజన గ్రామాల్లో పండగ వస్తోందంటే చాలు... ఇంటి గోడలపై రంగురంగుల చిత్రాలు, కళాకృతులు వేసి ముస్తాబు చేస్తుంటారు. అక్కడ ఇప్పటికీ మట్టి ఇళ్లే కనిపిస్తాయి. ఒడిశాలో కియోంజర్ జిల్లాలో హరిహరపూర్ గ్రామంలోకి అడుగుపెడితే ప్రతీ ఇల్లూ రంగురంగుల కళాకృతులతో ఆకర్షణీయంగా ఉంటుంది. హంసలు, గులాబీరేకులు, చెట్టు కొమ్మపై వాలిన రామచిలుకలు... ఇలా రకరకాల ఆకర్షణీయమైన గ్రామీణ బొమ్మలు ఇంటిగోడలపై కనువిందు చేస్తాయి. చూపరులను కట్టిపడేస్తాయి. సంతాల్ తెగకు చెందిన మహిళలు సంప్రదాయంగా ఈ కళను కొనసాగిస్తున్నారు.
సోహ్రాయ్ పండగ కళ...
ఒడిశాలో కియోంజర్, మయూర్‌భంజ్ జిల్లాలలో... జార్ఖండ్‌లోని తూర్పుసింగ్‌భూమ్, సెరాయ్‌కెలా, ఖార్సావాన్ జిల్లాల్లో... పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఆధిపత్యం వహించే సంతాల్ తెగకు చెందినవారు... ఇంటి గోడలపై చిత్రాలు వేయడం తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. దీపావళి, కాళీమాత పూజతో పాటు పంట కోతల అనంతరం ప్రజలంతా జరుపుకొనే పండగ ‘సోహ్రాయ్’. ఈ సమయంలో సంతాలీ తెగకు చెందిన మహిళలు తమ ఇళ్ల గోడలపై చిత్రాలు, ముగ్గులు వేస్తుంటారు. ‘‘సోహ్రాయ్ పండగ సమయాల్లో ఇంటి గోడలపై బొమ్మలు వేయడానికి మహిళలు పోటీ పడుతుంటారు. అప్పుడు ఊరు ఊరంతా సరికొత్తగా కళకళలాడుతూ ఉంటుంది’’ అని హంసల చిత్రాన్ని గీసిన స్థానిక మహిళ సుమతీ మారండి అంటారు.
జీఐ’ ట్యాగ్...
కేవలం ‘సోహ్రాయ్’ పండగ సమయంలోనేగాక ... పెళ్లిళ్లు, ప్రసవాలు, ఇతర శుభకార్యాల సమయంలో సైతం ఇంటిని కుడ్యచిత్రాలతో చూడచక్కగా అలంకరిస్తారు. చాంధ్‌పూర్ గ్రామంలో సంతాల్ తెగ ప్రజలతో పాటు భూమ్జీ తెగకు చెందినవారు సైతం గోడలపై బొమ్మలు వేసి, ఇంటిని అందంగా అలంకరిస్తారు. ప్రతీ యేడు కొత్త కొత్త డిజైన్లతో బొమ్మలు వేస్తారు. ఏ బొమ్మలు ఎలావేయాలో నిర్ణయించుకునేందుకు, సాధన చేసేందుకు తగినంత సమయం వెచ్చిస్తారు. ఈ చిత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే... జీవితం పట్ల వారికున్న అవగాహనకు ప్రతిబింబాలుగా కనిస్తాయి. రకరకాల చిత్రాల ద్వారా కథలు చెప్పే సంప్రదాయాన్ని గుర్తుకుతెస్తాయి. హజారీబాగ్ జిల్లాలోని సంతాయ్ తెగకు చెందిన మహిళలు వేసిన చిత్రాలకు 2020లో జీఐ (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్) ట్యాగ్ లభించడం విశేషం.
సహజసిద్ధమైన రంగులతో...
ఈ ప్రాంతాల్లో మహిళలు ఏడాదికోసారి సహజ రంగుల తయారీకి అవసరమైన పదార్థాల సేకరణ కోసం అడవికి వెళతారు. నదులు విస్తరించి ఉన్న ప్రదేశాలలో నుంచి తెల్ల బంక మట్టిని సేకరిస్తారు. కొన్నిసార్లు ఇనుప ఖనిజ నిక్షేపాల నుంచి సేకరిస్తారు. నలుపు, తెలుపు రంగుల కోసం బంకమట్టిని ఉపయోగిస్తారు. ఎరుపు రంగు కోసం రాతి లోయల్లో లభించే ఐరన్ ఆక్సైడ్, హెమటైట్ కలిగి ఉన్న మొరంను వాడతారు.
గోడలపై వేసే ఈ కళాకృతులు దేవుడిని, పూర్వీకులను ప్రసన్నం చేసుకుని... ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని అందిస్తాయని నమ్ముతారు. రాను రాను సహజ సిద్ధమైన రంగులు లభించకపోవడంతో కొత్తతరం మార్కెట్లో లభించే రంగులను కొనుగోలు చేసి, వాటితో బొమ్మలు వేస్తోంది. కాలం మారుతున్న కొద్దీ... ఆయా ప్రాంతాల్లో మట్టి ఇళ్ల స్థానంలో కాంక్రీటు భవనాలు వెలుస్తున్నాయి. దానితో సంప్రదాయ సోహ్రాయ్ కళకు ఆదరణ తగ్గుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న విజయ్ ఆంటోనీ.. 3 సంవత్సరాల తర్వాత..
Read Latest AP News And Telangana News And International News And Telugu News