యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ : హోంమంత్రి అనిత
ABN , Publish Date - Jun 07 , 2026 | 08:55 AM
విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్న ఆమె, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విజయవాడ: యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉందని, దానిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు.
14 రోజుల యోగాంధ్ర కార్యక్రమం
జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద-ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
డ్రగ్స్‌పై దండయాత్ర 2.0
అనంతరం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ.. డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమంతో పాటు యోగాంధ్రను అనుసంధానించడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రస్తుతం డ్రగ్స్ వినియోగదారులుగా గుర్తించిన వెయ్యికి పైగా మందిని పునరావాసం కల్పించి సమాజంలోకి తీసుకురావడానికి పోలీస్, ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 21 నాటికి వారందరూ డ్రగ్స్ రహితులుగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీపీ రాజశేఖర్‌బాబు, ఐఏఎస్ అధికారులు వీర పాండ్యన్ ఇలక్కియా, ధ్యాన్‌చంద్ర తదితరులు యోగాసనాలు చేశారు. సుమారు నాలుగు వేల మందితో యోగాంధ్ర-2026 ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి రహిత, ఆరోగ్యవంతమైన, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని అధికారులు పిలుపునిచ్చారు.
Also read:
పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు తొలగింపు