2-3 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:37 AM
రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ నెల 12 వరకు వర్షాలు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం.. జలమయమైన రహదారులు
చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12 వరకు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈమేరకు రాష్ట్రానికి యెల్లో అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలుచోట్ల మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మియాపూర్‌లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దేవరకద్రలో అత్యధికంగా 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఖమ్మం జిల్లా మధిరలో అత్యధికంగా 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇప్పటి దాకా వేడి తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ నగర వాసులు శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో తడిసి ముద్దయ్యారు. గంటన్నరపాటు కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. షేక్‌పేటలో 4.1 సెం.మీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి జంక్షన్, మైండ్‌స్పేస్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కొండాపూర్ జంక్షన్, కొత్తగూడ చౌరస్తా ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ జంక్షన్ వద్ద, రాయదుర్గం-ఖాజాగూడ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పా్‌సల నిర్మాణం పనులు, రోడ్ల విస్తరణ పనులతో రోడ్లన్నీ మట్టితో గుంతలు తేలి ఉండడంతో వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. పలు మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో అత్యధికంగా 51 మి.మీ వర్షం కురిసింది. అలాగే రంగారెడ్డి జిల్లా మాడ్గుల్‌లో 44.3 మి.మీ, శేరిలింగంపల్లిలో 43.8 మి.మీ వర్షం పడింది. పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏపీకి రుతుపవనాల రాక
నైరుతి రుతుపవనాలు శనివారం ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఏపీలో రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో కొంతవరకు విస్తరించాయి. 2, 3 రోజుల్లో మరికొన్ని జిల్లాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
