Share News

బాలుడి మేజిక్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. అండగా ఉంటానంటూ ట్వీట్

ABN , Publish Date - Jun 07 , 2026 | 08:03 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నైనితాల్‌కు చెందిన సాహిల్ అనే ఓ చిన్నారి అద్భుతమైన ప్రతిభ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే..

బాలుడి మేజిక్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా.. అండగా ఉంటానంటూ ట్వీట్
Anand Mahindra

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, వాటిలో కొన్ని వీడియోలు మాత్రం అసాధారణమైన ప్రతిభను వెలుగులోకి తెచ్చి, వారి జీవితాలనే మార్చేస్తుంటాయి. గతంలో ఎందరో సామాన్యులు ఒకే ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే కోవలోకి చేరాడు ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు చెందిన సాహిల్ అనే ఓ బాల మెజీషియన్. వీధిలో ఈ బాలుడు ప్రదర్శిస్తున్న అద్భుతమైన మేజిక్ ట్రిక్స్.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకోగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంటపడటంతో ఈ బుడతడి జీవితం కీలక మలుపు తిరిగినట్లైంది.


సాహిల్ ప్రదర్శించిన అద్భుతమైన ప్రతిభకు సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో సాహిల్ ఒక చిన్న ఇనుప గిన్నె, ఒక మేజిక్ స్టిక్, ఒక నాణెం, కొన్ని చిన్న ఎరుపు రంగు బంతులతో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. తన చుట్టూ ఉన్న ప్రేక్షకులను పెద్ద పెద్ద మాటలతో, అపారమైన ఆత్మవిశ్వాసంతో కట్టిపడేస్తూ.. అతను చేసిన ప్రదర్శన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒక ట్రిక్‌లో గిన్నెలోని బంతిని మాయం చేసి, మరో గిన్నెలోకి రప్పించడం, చూస్తున్న వారి బూట్లు, చెవులు, ముక్కుల నుంచి నాణేలను బయటకు తీయడం వంటి విన్యాసాలు చేస్తూ అందరినీ అలరించాడు. సాహిల్ చూపిన ఈ అసాధారణ ప్రతిభ, అతని ముఖంలోని ఆత్మవిశ్వాసం, సహజమైన ప్రదర్శనా శైలి ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకున్నాయి.

sahil.jpgఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, సాహిల్ ప్రతిభను ప్రశంసించడమే కాకుండా అతనికి అండగా నిలబడతామని ప్రకటించారు. ఈ బాలుడు ఎంతో ప్రతిభావంతుడని, అతను ఇంకా నైనితాల్ వీధుల్లోనే ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్నాడా అని నెటిజన్లను ప్రశ్నించారు. సాహిల్ చదువుకు అయ్యే ఖర్చులను భరించడంతో పాటూ మ్యాజిక్ రంగంలో అతనికి ఉన్న ఆసక్తిని మరింత ప్రోత్సహించాలనుకుంటున్నట్లు మహీంద్రా వెల్లడించారు. భవిష్యత్తులో అతను ప్రపంచంలోనే అత్యుత్తమ మేజిషియన్లలో ఒకడిగా ఎందుకు ఎదగకూడదనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ.. ఆ బాలుడితో గానీ, అతని తల్లిదండ్రులతో గానీ తనను సంప్రదింపజేయడానికి ఎవరైనా సహాయం చేయగలరా అని కోరారు. ఆనంద్ మహీంద్రా చేసిన ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

ఐటీ రిటర్నుల ఫైలింగ్‌కు వేళాయే..

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

Updated Date - Jun 07 , 2026 | 10:22 AM