Share News

భారత్‌లో పడిపోయిన జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:26 AM

భారత్‌లో అక్షరాస్యుల్లో జననాల రేటు భారీగా పడిపోవడంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ జనాభాలో మార్పులపై ఏఎఫ్‌పీ వార్త సంస్థ ప్రచురించిన కథనాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

భారత్‌లో పడిపోయిన జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో జననాల రేటు పడిపోవడంపై టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్షరాస్యుల్లో సంతానోత్పత్తి (టీఎఫ్ఆర్) రేటు బాగా తగ్గిపోయిందని హెచ్చరించారు. చాలా ఏళ్ల క్రితమే ఈ మార్పు చోటుచేసుకుందని చెప్పారు. జనాభా సుస్థిరంగా ఉండేందుకు కావాల్సిన రీప్లేస్‌మెంట్ రేటు (2.1) కంటే దిగువకు సంతానోత్పత్తి పడిపోయిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఏఎఫ్‌పీ వార్తా సంస్థ కథనాన్ని షేర్ చేశారు.


ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత దశాబ్దంలో భారత్‌లో టోటల్ ఫర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 2.3 నుంచి 1.9కి పడిపోయింది. ఒక మహిళకు సగటున ఆమె జీవితకాలంలో కలిగే పిల్లల సంఖ్యను టీఎఫ్ఆర్ అని అంటారు. జనాభా సుస్థిరంగా ఉండేందుకు టీఎఫ్ఆర్ 2.1గా ఉండాలని నిపుణులు చెబుతారు.

ఇక సంతానోత్పత్తి రేటులో రాష్ట్రాల వారీగా వ్యత్యాసాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీలో కనిష్ఠంగా టీఎఫ్ఆర్ ఏకంగా 1.2కు చేరుకోగా తమిళనాడు సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భారీగా పడిపోయింది. అయితే, బిహార్, ఝార్ఖండ్, యూపీ, రాజస్థాన్‌లో మాత్రం టీఎఫ్ఆర్ 2.1కి పైనే ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జనాభాలో వృద్ధుల వాటా పెరిగి సామాజిక భద్రత, వాణిజ్యం, తదితర అంశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలూ చదవండి:

నన్ను ఎవరూ ఎంపీ పదవికి రాజీనామా చేయమనలేదు: యూసఫ్ పఠాన్

సామాన్యుడిపై మరోసారి గ్యాస్ భారం.. పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధరల

Updated Date - Jun 07 , 2026 | 11:52 AM