Share News

ఊసే లేని రాజీవ్‌ యువ వికాసం

ABN , Publish Date - May 09 , 2026 | 12:43 PM

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అందిస్తానన్న పథకం కోసం కోటి ఆశలతో యువత ఎదురు చూస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటి రాజీవ్‌ యువ వికాసం.

 ఊసే లేని రాజీవ్‌ యువ వికాసం
Rajiv Yuva Vikasam Scheme

  • దరఖాస్తుల స్వీకరణకే పరిమితం

  • నిరుత్సాహంలో నిరుద్యోగ యువత

వరంగల్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం అందిస్తానన్న పథకం కోసం కోటి ఆశలతో యువత ఎదురు చూస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటి రాజీవ్‌ యువ వికాసం. ప్రభుత్వం కొలువు దీరిన సంవత్సరం తర్వాత నిరు ద్యోగుల నుంచి సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులను కోరింది. స్వయం ఉపాధి కోసం వివిధ యూనిట్లకు సరిపడా రుణాలు రూ. 50 వేల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2025 ఏప్రిల్‌లో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడగానే ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత కులం,


ఆదాయ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగారు. సం తోషంగా తమ కులం, ఆదాయం, బ్యాంకు, రేషన్‌ తదితర వివరాలను పొందుపరిచి మండల పరిషత్‌ కార్యాయలయంలో సమర్పించారు. ఇకపై ప్రభుత్వం అందించే రుణంతో సొంత వ్యాపారం మొదలుపెట్టి జీవితంలో స్థిరపడాలన్న యువత ఆశలు సంవత్సరం గడిచినా రుణాలు రాకపో వడంతో వారి ఆశలు గాలిలో కలిసిపోయాయి. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వాటి ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.


hnk1.2.jpgదరఖాస్తుల కోసం హడావుడి

తమకు సంబంధించిన కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం కొత్తగా మీ సేవలో దరఖాస్తు చేసి తహసీల్దార్‌ కార్యాలయంలో పని కోసం పడిగాపులు కాశారు. పరిమితకాలంలో (16ఏప్రిల్‌ 2025 లోపు) దరఖాస్తులు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో యువకులు, మహిళలు ఎండల్లో చెమటలు కక్కుతూ తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగారు. సర్వర్లు డౌన్‌ అయితే ఎక్కడ తమకు అవకాశం పోతుం దోనని తీవ్ర ఆందోళన చెందారు. దరఖాస్తు ఫారంతో పాటు కులం, ఆదాయం, బ్యాంకు ఖాతా, రేషన్‌ కార్డు, తదితర పత్రాలను జతచేసి ఎంపీడీవో కార్యాలయంలో క్యూలో నిలబడి మరీ అందజేశారు. కార్యాలయంలో అధికారులు దరఖాస్తు ఫారాలు తీసుకోగానే సబ్సిడీ రుణం వచ్చినంత సంబ రపడిపోయారు. కానీ ఇప్పటి వరకు ఏ నాయకుడి నోట దాని ఊసే లేకపోయేసరికి తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందజేస్తే యువత స్వయం ఉపాధి తో జీవనం సాగించాలని కోరుకుంటున్నారు.


ప్రభుత్వం చేతగాని తనం

  • నందికొండ గణపతిరెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, చర్లపల్లి

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుకు నోచుకోని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తోంది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నిరుద్యోగ యువతకి మొండి చేయి అందిస్తోంది. గత వేసవిలో మండుటెండల్లో యువత వారికి సంబంధించిన పత్రాలను పట్టుకుని మండల కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టు తిరిగి రూ. 500 నుంచి 1000 వరకు ఖర్చు చేసుకుని దరఖాస్తు చేస్తే సంవత్సరం గడిచినా వాటి ఊసే ఎత్తకపోవడం ప్రభుత్వ చేతగాని పని తీరుకి నిదర్శనం.


వెయ్యికి పైగా దరఖాస్తులొచ్చాయి..

  • రామ రామకృష్ణ, ఎంపీడీవో

గత సంవత్సరం ఏప్రిల్‌లో రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి, మండలంలోని పలు గ్రామాల నిరుద్యోగ యువత నుంచి మొత్తం 1,041 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకైతే ప్రభుత్వం నుండి పథకానికి సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. ప్రస్తుతం ఎస్సీ, మైనార్టీ వర్గాలకి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తోంది. వాటి అనంతరం రాజీవ్‌ యువ వికాసం పథకం అమలు చేస్తుందేమో చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

టెక్నాలజీతో ఇంటికి భద్రత

గవర్నర్‌ నిర్ణయం సరైనదే!

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2026 | 12:43 PM