Share News

భళా.. ముల్కనూర్‌ సీడ్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 10:41 AM

నాణ్యమైన విత్తనాల సరఫరాలో ముల్కనూర్‌ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తోంది.

భళా.. ముల్కనూర్‌ సీడ్‌
Mulkanoor Seeds

  • వరి విత్తనాల తయారీలో మేటి

  • ఖరీఫ్‏లో లక్ష క్వింటాళ్ల వరి విత్తనాల అమ్మకాలే లక్ష్యం

  • సన్నాలు 60 శాతం.. దొడ్డు రకాలు 40 శాతం అమ్మకమే ధ్యేయం

  • ఇప్పటికే 60 వేల క్వింటాళ్ల వరి విత్తనాల అమ్మకాలు

భీమదేవరపల్లి(వరంగల్): నాణ్యమైన విత్తనాల సరఫరాలో ముల్కనూర్‌ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తోంది. సహకార రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువస్తున్న ముల్కనూర్‌ సహకార బ్యాంకు వరి విత్తనాల అమ్మకాలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా నిలుస్తోంది. 1970లో ముల్కనూర్‌ బ్యాంకు రైతుల కోసం వరి విత్తన తయారీ కోసం విత్తన శుద్ధి కార్మాగారం ఏర్పాటు చేసింది. ముల్కనూర్‌ సహకార బ్యాంకు తయారు చేస్తున్న వరి విత్తనాలు మంచి దిగుబడి, నాణ్యతగా ఉండడంతో వరి విత్తనాలకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఈ ఏడాది ఖరీఫ్‏లో కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‏ఘడ్‌ మహారాష్ట్ర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇస్తుండడంతో తెలంగాణలో రైతులు సన్నవడ్లు పండించేందుకు మొగ్గు చూపెడుతున్నారు.


ఈ సంవత్సరం ముల్కనూర్‌ సహకార బ్యాంకు ద్వారా లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలు అమ్మకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 60వేల క్వింటాళ్ల వరి విత్తనాలను రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలకు సరఫరా చేశారు. ఆర్‌ఎన్‌ఆర్‌, కేఎన్‌ఎం, బీపీటీ, విశ్వనాథ, తదితర సన్నవడ్లను తెలంగాణ రైతులు కొనుగోలు చేస్తుండగా, ముల్కనూర్‌ బ్యాంకు ఈ వరి విత్తనాలను రైతులకు విక్రయిస్తుంది. అలాగే జార్ఖండ్‌, ఒడిస్సా, ఛత్తీస్‏ఘడ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, తదితర రాష్ట్రాలకు దొడ్డు రకం వరి విత్తనాలను ముల్కనూర్‌ బ్యాంకు ఎగుమతి చేస్తుంది.


ముల్కనూర్‌ బ్యాంకు ద్వారా ఎంటీయూ 1010, 1001, 1153, 1156, 1061, జేజేఎల్‌ 24423, ఐఆర్‌ 64, పీఆర్‌ 126 తదితర వరి విత్తనాలకు మంచి డిమాండ్‌ ఉంది. భీమదేవరపల్లిలో 3, కొత్తపల్లిలో 2, రత్నగిరిలో 1, గంటకు నాలుగు టన్నుల వరి విత్తనాలు తయారు చేసే అత్యధునీకమైన విత్తన శుద్ధి కార్మాగారాలున్నాయి. ఈ సంవత్సరం లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో ఇప్పటికే 60శాతం విలువైన వరి విత్తనాలు అమ్మకాలు చేశారు.


hnk1.jpgమరో 40వేల క్వింటాళ్ల వరి విత్తనాలను అమ్మేందుకు విత్తనాలు తయారు చేస్తున్నారు. వర్షాలు కొంచం ఆలస్యం కావడంతో వరి విత్తనాలు కొనుగోలుకు రైతులు వెనుకాడుతున్నారు. వరి విత్తనాలు ముందుగా బ్రీడర్‌, ఫౌండేషన్‌ సీడ్‌ ద్వారా బ్యాంకు పరిధిలోని గ్రామాలకు అందజేస్తారు. వారి వద్ద నుంచి విత్తనాలు సేకరించి వివిధ ప్రాంతాలకు అమ్ముతారు. వరి విత్తనాల సీడ్‌ నాణ్యంగా లేకపోతే కొనుగోలు చేసేందుకు నిర్మొహమాటంగా బ్యాంకు వ్యవసాయాధికారులు తిరస్కరిస్తారు.


మేలైన వరి విత్తనాల అమ్మకమే లక్ష్యం

  • అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బ్యాంకు అధ్యక్షుడు, ముల్కనూర్‌

ముల్కనూర్‌ బ్యాంకు ద్వారా రైతులకు మేలైనా వరి విత్తనాల అమ్మకమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు నాసిరకమైన వరి విత్తనాలు, కల్తీ విత్తనాలతో నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులకు మేలైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈ వర్షాకాలంలో లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలను తయారు చేస్తున్నాం. ఇప్పటికే 60వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అమ్మకం చేశాం. రైతులకు నాణ్యమైన వరి విత్తనాలు అందించడమే బ్యాంకు ప్రధాన లక్ష్యం.


ఇతర రాష్ట్రాలకు అమ్మకం

  • మార్పాటి రాంరెడ్డి, జనరల్‌ మేనేజర్‌, ముల్కనూర్‌ బ్యాంకు

తెలంగాణలోని అన్ని ప్రాంతాలతో పాటు జార్ఖండ్‌, ఒడిస్సా, ఛత్తీస్‏ఘడ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు వరి విత్తనాలు ఈ ఖరీఫ్‏లో అమ్ముతున్నాం. ముల్కనూర్‌ బ్యాంకు నాణ్యమైన విత్తనాలు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి విత్తనాలు కావాలని డిమాండ్‌ వస్తుంది. సన్న రకాలు తెలంగాణ రాష్ట్రంలో అమ్ముతుండగా, దొడ్డు రకం విత్తనాలను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నాం.


ఈ వార్తలు కూడా చదవండి:

20న రెండు ఎంఎంటీఎస్‏లు రద్దు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 11:16 AM