సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన హరీశ్ రావు..
ABN , Publish Date - Apr 09 , 2026 | 08:48 PM
పాలమూరు వలస జిల్లాగా మారటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం పూర్తి చేశామని ఆయన చెప్పారు.
వనపర్తి: పాలమూరు వలస జిల్లాగా మారటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.30 వేల కోట్లు ఖర్చు చేసి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 80 శాతం పూర్తి చేశామని ఆయన చెప్పారు. మిగిలిన 20 శాతం పనులు చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావటం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండుంటే పాలమూరు జిల్లా ఇప్పటికే పూర్తిస్థాయిలో సస్యశ్యామలం అయ్యేదని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందన్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు హరీశ్ రావు.
సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు హరీశ్ రావు. అవసరం లేని గొల్లపల్లి- చీర్కపల్లి రిజర్వాయర్ ఎందుకు నిర్మిస్తున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జూరాల వద్ద పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. తమ పాలనలో ఈ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గొప్పలు చేసినట్టు కేరళంలో పల్లకీ మోస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని ఆగ్రహించారు. ఇప్పటికే మూడు రైతు బందులు ఎగ్గొట్టారని.. ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాపీ జరిగిందా? అంటూ ప్రశ్నించారు. నాలుగు విడతల రైతు బందు వచ్చిందని రైతులు చెపితే తన పదవికి రాజీనామా చేస్తానని.. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు రెడీనా అంటూ సవాల్ విసిరారు.
మొక్కజొన్నలు కొనుగోలు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వంతో పోరాటం చేసి గొల్లపల్లి, చీర్కపల్లి గ్రామాలకు న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టే కేసులకు కార్యకర్తల భయపడాల్సిన పని లేదని.. రెండేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు. ఈసారి అధికారంలోకి వస్తానని సీఎం రేవంత్ పగటి కలలు కంటున్నారని.. ఆయన ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
యువతిపై సామూహిక హత్యాచారం.. ధర్నాకు దిగిన బాధిత కుటుంబం..
విద్యార్థులకు బిగ్‌అలర్ట్.. ఇంటర్ ఫలితాలపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు..