ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. మెుక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:07 PM
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
మహబూబాబాద్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు గార్ల మండలం సీతంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దోపిడీకి గురవుతున్నారని బుధవారం నాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయ్యాయి.
విషయం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కొనుగోలు కేంద్రాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు మంత్రి సీతక్క రంగంలోకి దిగారు. ఇవాళ(గురువారం) మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేటలో సీతక్క పర్యటించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొక్కజొన్నలు ప్రైవేట్ దళారీలకు విక్రయించి మోసపోవద్దని ఈ సందర్భంగా రైతులకు మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2,400 గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొనుగోలు కేంద్రాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. ఒక్క ఎకరాకు 25 క్వింటాలు మాత్రమే కొనుగోలు కాకుండా 50 క్వింటాలు పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతులు ఇబ్బంది పడకుండా పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ప్రేమగా చూసుకోవాలి: మంత్రి సీతక్క
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు