ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లోనే బాధితులను కాపాడుతాం: మంత్రి రాజనర్సింహ
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:33 PM
రోడ్డుప్రమాద బాధితులను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్: రోడ్డుప్రమాద బాధితులను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇందుకు సమగ్ర ట్రామా కేర్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ మేరకు హైదారాబాద్ కొండాపూర్‌లో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి రాజనర్సింహ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ..'రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను తక్షణమే ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి అవసరమైన అన్ని వసతులతో 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకునేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. అందులో భాగంగా 108 అంబులెన్స్‌ల సంఖ్యా పెంచుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 31 క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నాం. నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నారాయణపేట్, ఆదిలాబాద్‌లో క్రిటికల్ కేర్ బ్లాకులను ఇప్పటికే ప్రారంభించుకున్నాం.
మరో 21 సీసీబీల నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఏడాది చివరికల్లా అన్నీ అందుబాటులోకి తీసుకొస్తాం. కొండాపూర్‌లో రూ.41 కోట్లతో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసుకున్నాం. వీలైనంత వేగంగా నిర్మాణం పూర్తి చేసి అత్యాధునిక వసతులతో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపడతాం. ఇక్కడ నివసించే ప్రజల కోసం ఈ క్రిటికల్ కేర్ సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయి' అని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పొంగులేటి అవినీతి చిట్టా బయటపెట్టింది మేమే.. హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.30 కోట్ల రోలెక్స్ వాచ్‌లు స్వాధీనం..