కాంగ్రెస్ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:10 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజాయతీగల మోసగాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. వెనుకటి రోజులను మళ్లీ తెస్తానని చెప్పినట్లుగా తీసుకొచ్చారని మండిపడ్డారు.
ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదు
చెప్పినట్టే వెనుకటి రోజులు తెచ్చిన రేవంత్‌రెడ్డి
సమస్యల పరిష్కారానికి నా గడ్డం అడ్డొస్తోందా?
మహిళలను కోటీశ్వరుల్ని కాదు.. లక్షాధికారుల్ని చేసినా రాజకీయాల నుంచి తప్పుకుంటా
రేవంత్‌ది ప్రజాపాలన కాదు.. పర్సంటేజీల పాలన
కేసీఆర్ సీఎంగా రావడానికి ఇంకా 500 రోజులే..
హనుమకొండ జనచైతన్య సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హనుమకొండ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజాయతీగల మోసగాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. వెనుకటి రోజులను మళ్లీ తెస్తానని చెప్పినట్లుగా తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. హనుమకొండలోని కేడీసీ మైదానంలో ఆదివారం నిర్వహించిన జనచైతన్య సభలో కేటీఆర్ మాట్లాడారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం.. అందుకు ఇంకా 500 రోజులే మిగిలి ఉన్నాయి. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ భద్రంగా ఉంటుంది. అందుకే ఆయన తిరిగి సీఎంగా రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం నిజంగా చేశారా? వారిని కోటీశ్వరులను కాదు.. కనీసం లక్షాధికారులను చేసినా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తానన్న హామీ ఏమైంది? వచ్చే రెండేళ్లను కూడా కలుపుకొని ఒక్కో మహిళలకు ప్రభుత్వం రూ.1.50 లక్షలు వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలి. సీఎం చెప్పినట్టే ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వెనుకటి రోజులను మళ్లీ తీసుకువచ్చారు’ అని కేటీఆర్ విమర్శించారు. పెన్షన్లపై కాంగ్రెస్ మంత్రులు వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. 4.71 లక్షల పెన్షన్లను తొలగించి.. కొత్తగా 4.63 లక్షల పెన్షన్లు మాత్రమే ఇవ్వటం.. పెన్షన్లను పెంచినట్లా..? తగ్గించినట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని వాగ్దానాలంటూ సభలో ఒక వీడియోను ప్రదర్శించారు.
రేవంత్‌ది పర్సంటేజీల పాలన
మూడేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కొత్తగా తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల దందా సాగుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 20 శాతం కమీషన్ల దందాను బయటపెడుతున్నారు. ఇది ప్రజాపాలన కాదు.. పర్సంటేజీల పాలన. పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ.వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అవినీతి బాగోతాన్ని బయట పెడుతున్నాయి’ అని ధ్వజమెత్తారు. వరంగల్ అభివృద్ధిని మూడేళ్లలో అటకెక్కించారని విమర్శించారు.
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రి కుటుంబాలకు చెందిన ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంటర్మీడియట్ విద్యను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీల గురించి ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘నా గడ్డంపై మాట్లాడటం తప్ప రాష్ట్ర సమస్యలపై సీఎం దృష్టిపెట్టడం లేదు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సీఎంకు నా గడ్డమే అడ్డం వస్తోందా?’ అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.. ఎంపీ అరవింద్ ధ్వజం
ఆన్‌లైన్ గేమింగ్ నెట్‌వర్క్‌పై డీజీజీఐ మెరుపు దాడులు
స్నేహ గ్రూప్‌పై ఐటీ శాఖ మెరుపు దాడులు.... 16 ప్రాంతాల్లో సోదాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News