Share News

‘గ్లోబరీనా నా బినామీ అయితే ఆధారాలు చూపండి’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

ABN , Publish Date - Jul 23 , 2026 | 04:30 PM

గ్లోబరీనా తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం నోటీసులు పంపానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

‘గ్లోబరీనా నా బినామీ అయితే ఆధారాలు చూపండి’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Former Minister KTR

వరంగల్, జులై 23: గ్లోబరీనా తన బినామీ సంస్థ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటికే పరువు నష్టం నోటీసులు పంపానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి.. ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదని విమర్శించారు. లోక్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకం మాత్రమే అని విమర్శించారు.


‘గ్లోబరీనా నిజంగానే నా బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుంది? మీ ప్రభుత్వమే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, ఇప్పుడు అది నా బినామీ సంస్థ అని చెప్పడం ఎంతవరకు సమంజసం?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో ఉంటారంటూ దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఒక మూట ఇస్తే, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నారని ఆరోపించారు.


‘నేను సీఐడీ విచారణకు సిద్ధం.. రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి అంశంలో సిట్, సీఐడీ విచారణకు సిద్ధమా’ అంటే మాజీ మంత్రి సవాల్ విసిరారు. మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా సీఎం భయపడుతున్నారన్నారు. ఓ వైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారన్నారు. గ్లోబరీనా సంస్థపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. రుజువు చేయాలని.. లేదంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

'ఆయనవన్నీ వేరే పార్టీలు'.. కేటీఆర్ దావత్‌పై రేవంత్ సెటైర్

భారత్‌ను భయంతో కాదు.. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంతో నడపాలి: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 04:51 PM