ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. చేనేతకు రూ.25 వేల ‘నేతన్న భరోసా’
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:14 PM
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.
అమరావతి, జులై 23: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈరోజు(గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి, తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
పుష్కరాల నిర్వహణకు రూ.50 కోట్లు..
వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. అలాగే శ్రీకాకుళంలోని బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజును కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలకు మంత్రివర్గం నుంచి ఆమోదం లభించింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌పై కూడా మంత్రివర్గం చర్చించింది. అలాగే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతుల మంజూరుపై చర్చ జరిగింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఎల్‌నినోపై చర్చ..
కేబినెట్ సమావేశంలో ఎల్‌నినోను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎలినోవా పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు. తాగునీటి సరఫరా, పశువులకు మేతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. మెగా డీఎస్సీ అంశాన్ని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. లేని వివాదాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయని, అలాంటి చర్యలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మంత్రులు ప్రో-యాక్టివ్‌గా ఉండాలి...
పొగాకు ధరల అంశాన్ని సమావేశంలో మంత్రులు ప్రస్తావించారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రులు చెప్పగా.. వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం పొగాకు రైతుల కోసం తీసుకున్న చర్యలను ప్రజలకు ముందుగానే వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు ముందే తెలియజేస్తే ప్రతిపక్షానికి అవకాశం ఉండదని, ప్రో-యాక్టివ్‌గా మంత్రులు ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
అర్ధరాత్రి వైసీపీ నేతల మద్యం పార్టీ.. ఎక్సైజ్ అధికారుల దాడి.. కేసు నమోదు
Read Latest AP News And Telugu News