'ఆయనవన్నీ వేరే పార్టీలు'.. కేటీఆర్ దావత్‌పై రేవంత్ సెటైర్
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:54 PM
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు.
హైదరాబాద్, జులై 23: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్, బీజేపీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని ఆరోపించారు. ఈరోజు(గురువారం) మీడియాతో నిర్వహించి చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. గ్లోబరీనా తప్పిదాల వల్ల 27 మంది చనిపోయారని.. ఆ సంస్థ పేరు మార్చుకొని CBSE పరీక్షల కాంట్రాక్టు పొందిందని వ్యాఖ్యానించారు. వీటి ఆధారంగానే నీట్ కుంభకోణం జరిగిందన్నారు. గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ ముక్కు నేలకు రాయాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
కేటీఆర్ బర్త్‌డేపై ఆసక్తికర వ్యాఖ్యలు
కేటీఆర్ బర్త్ డే పై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కేటీఆర్ పుట్టిన రోజు దావత్ ఇస్తాడో అడగాలి. కేటీఆర్ ఇచ్చే దావత్ నేను తీసుకోలేనేమో. ఆయనవి అన్నీ వేరే పార్టీలు’ అంటూ సెటైర్ విసిరారు. హరీశ్ గొప్పవాడైతే మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. అతి తెలివి తేటలతో ఏదిపడితే అది మాట్లాడతానంటే నడవదని హరీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు కన్నెపెల్లి పంపు హౌజ్ గురించి మాట్లాడుతున్నారని... మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ గురించి మాట్లాడితే ప్రజలు చెప్పుతో కొడతారని మండిపడ్డారు. మేడిగడ్డ కట్టింది, కూల్చింది బీఆర్ఎస్ వాళ్లే అని వ్యాఖ్యానించారు.
నాకు రెండు ఓట్లు లేవు..
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ప్రక్రియ అయిపోయే వరకూ ఎమ్మెల్యేలను గ్రామాల్లోనే ఉండమని చెప్పానని ముఖ్యమంత్రి అన్నారు. SIR.. నాయకులకు సంబంధించింది కాదని, ప్రజలకు సంబంధించిందని స్పష్టం చేశారు. ‘తెలిసీ తెలియక నాకు రెండు ఓట్లు ఉన్నాయని అంటున్నారు. కలెక్టర్ అనుమతి తీసుకొని నా గ్రామంలో ఉన్న ఓటును కొడంగల్‌కు మార్చుకున్నాను. గతంలో కొడంగల్ ప్రాంతం కర్ణాటకలోని జిల్లాలో ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేసినప్పుడు కొడంగల్ పాలమూరులోకి వచ్చిందని చెప్పారు.
SIR పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే..
బీజేపీ కుట్రపూరితంగా ఓట్లను తొలగించే అవకాశముందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతంలో అమాయకుల ఓట్లు పోయే అవకాశముందన్నారు. SIR ఉద్దేశం ప్రక్షాళన అని.. కుట్ర పూరితంగా సర్‌ను వాడుతున్నారని ఆరోపించారు. SIR పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు పోతే.. కాంగ్రెస్ ఓట్లు పోయినట్టే అని అన్నారు. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల ఓట్లు పోయే అవకాశముందన్నారు. ‘ఓటుహక్కు లేకపోతే పథకాలు పోతాయి.. ఓటుహక్కు లేకపోతే ఆధార్ పోతుంది. ఓటుహక్కు లేకపోతే గుర్తింపే ఉండదు... ఓటుహక్కు లేకపోతే సంక్షేమం రాదు’ అని అన్నారు.
మేం చెప్పిందే చేస్తున్నాం...
బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. బీజేపీ నాయకులకు ఒకరంటే ఒకరికి పడదన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు ఎక్కడుంటాయో బీజేపీకి తెలుసని వెల్లడించారు. చిన్నచిన్న కారణాలతో ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు ఇవ్వాలని డిసైడ్ అయిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు.. బ్రోకర్లకు అమ్ముకొని దళారీ వ్యవస్థ తెచ్చారని మండిపడ్డారు. ‘మేం ఏం చేస్తున్నామో అదే చెప్తున్నాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ చాలా గొప్పగా ఉన్నాయి: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య
Read Latest Telangana News And Telugu News