కర్రెగుట్టల్లో మావోయిస్టుల భారీ డంప్
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:18 AM
కర్రెగుట్టల్లో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధాల డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి.
అందులో 711 బీజీఎల్ షెల్స్‌ను
స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు
మందుపాతర్లున్నాయి.. అడవిలోకి వెళ్లొద్దు
స్థానికులను హెచ్చరించిన బీజాపూర్ పోలీసులు
చర్ల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కర్రెగుట్టల్లో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధాల డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ డంప్‌లో ఉన్న 711 బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (బీజీఎల్) షెల్స్‌ను బీజాపూర్ జిల్లాకు చెందిన కోబ్రా, సీఆర్‌పీఎఫ్ దళాలు శుక్రవారం స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్ అడవుల్లో మావోయిస్టు పార్టీ దాచిపెట్టిన డంప్‌లను కొద్దిరోజులుగా కేంద్ర బలగాలు గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్రెగుట్ట అడవుల్లోని ఈ డంప్ గురించి బీజాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో అడవుల్లో కూంబింగ్ చేపట్టగా.. తెలంగాణలోని ములుగు జిల్లా తడపల గ్రామానికి కిలోమీటర్ దూరంలో భూమిలో పాతి పెట్టిన డంప్‌ను బలగాలు గుర్తించాయి. అనంతరం బాంబ్‌స్క్వాడ్ సహాయంతో ఆ డంప్‌ను బయటకు తీయగా అందులో సుమారు 711 బీజీఎల్ షెల్స్ బయటపడ్డాయి.
మావోయిస్టులు సుమారు 10 అడుగుల గుంత తవ్వి వాటిని కవర్‌లో పెట్టి పాతి పెట్టారని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులే ఈ పనిచేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం ఆ షెల్స్‌ను సమీపంలోని తడపల బేస్ క్యాంప్‌కు తరలించారు. కాగా, ఇంత భారీ మొత్తంలో బీజీఎల్ షెల్స్‌ను బలగాలు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారి. ఇలాంటి డంపులు అడవుల్లో చాలా ఉన్నాయని వాటిని కూడా వెలికితీస్తామని బీజాపూర్ పోలీసులు తెలిపారు. అడవుల్లో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతర్లు (ఐఈడీ) ఉన్నాయని, కర్రెగుట్టల్లోకి స్థానికులు, పర్యాటకులు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మందుపాతర్లను బయటకు తీస్తామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News