Share News

వరంగల్‌ కేంద్రంగా బీజేపీ వ్యూహరచన

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:52 AM

వరంగల్‌ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్‌, ఖమ్మం, నల్లగొండలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

వరంగల్‌ కేంద్రంగా బీజేపీ వ్యూహరచన
BJP Telangana

  • రాష్ట్రంలో అధికారం దిశగా కసరత్తు ..

  • వరంగల్‌లో పునర్‌వైభవం సాధించాలని జాతీయ నాయకత్వం దిశానిర్దేశం

  • వరంగల్‌, ఖమ్మం, నల్లగొండల్లో అత్యధిక అసెంబ్లీ సీట్లు గెల్చుకోవాలని ప్రణాళిక

  • దీంట్లో భాగంగానే సంస్థాగత మార్పులు

  • దశరథ్‌, మధుకర్‌లకు కీలక బాధ్యతలు

  • కొత్త టీంకు ఎమ్మెల్సీ ఎన్నికలు,

  • ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలే తొలి పరీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ కేంద్రంగా తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. మూడు ఉమ్మడి జిల్లాలు వరంగల్‌, ఖమ్మం, నల్లగొండలపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలంటే.. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోంది.


తాజా పరిణామాలపై పార్టీకి చెందిన ఓ కీలక నేత మాట్లాడుతూ.. ‘ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీకి ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌ వంటి పదవులను ఓటర్లు మాకు కట్టబెట్టారు. తర్వాత కాలంలో అక్కడ పార్టీ ప్రాభవం తగ్గింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ తొలి నుంచీ బలంగా లేదు. వచ్చే ఎన్నికల్లో పట్టు సాధించాలంటే, ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో పార్టీని గణనీయంగా మెరుగపరచాల్సిన అవశ్యకత ఉందని పార్టీ నాయకత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌ని నియమించింది’ అని తెలిపారు.


కాగా మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలతో పాటు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఇటీవల వరుసగా రెండురోజుల వ్యవధిలో రాష్ట్ర పార్టీకి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకూ సంస్థాగత ఇంఛార్జిగా కొనసాగిన సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌కు పూర్తిస్థాయి ఇంఛార్జి బాధ్యతలు అప్పగించగా, మరో ఇద్దరు సీనియర్‌ నేతలు అభయ్‌పాటిల్‌, రేఖాశర్మలను సహ ఇంఛార్జులుగా నియమించింది.


స్థానిక నాయకుడు నూకల మధుకర్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఆరేళ్ల కిందటి వరకు ఈ పదవిలో మంత్రి శ్రీనివాస్‌ కొనసాగారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తెలుగు వ్యక్తిని ఈ కీలక పదవిలో నియమించారు. ఇదే క్రమంలో తెలుగు మీద బాగా పట్టున్న కర్ణాటకకు చెందిన సీనియర్‌ నేత దశరథ్‌ని సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బీజేపీ అధిష్ఠానం నియమించింది. పార్టీలో సంస్థాగతంగా చోటుచేసుకున్న ఈ మార్పులు.. ఇప్పటి వరకు కొనసాగిన అసంతృప్త వాతావరణాన్ని మార్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘పార్టీలో అంతర్గతంగా మూడు గ్రూపులు, ఆరు తగాదాలు అన్న పరిస్థితి కొనసాగుతూ వచ్చింది.


ఇప్పటి వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన చంద్రశేఖర్‌ తివారీ వైఖరి పట్ల పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు తెలుగుభాష రాకపోవడంతోపాటు క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో, జాతీయ నాయకత్వం ఆయన స్థానంలో స్థానిక నాయకుడైన నూకల మధుకర్‌ను నియమించటం మంచి పరిణామం. కొత్త టీం సభ్యులందరూ నిబద్ధత ఉన్నవారే. తెలంగాణపై మా నాయకత్వం ప్రత్యేకదృష్టి సారించింది అని చెప్పడానికి వీరి నియామకమే నిదర్శనం’ అని ఆ వర్గాలు వివరించాయి. దశరథ్‌ ఉమ్మడి వరంగల్‌ కేంద్రంగా, మధుకర్‌ హైదరాబాద్‌ కేంద్రంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పేర్కొన్నాయి.


కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మరో సవాల్‌

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డికి మరో సవాలేనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ పార్లమెంటు పరిధిలోనే ఖైరతాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంటు ఉంది. ఇంతకుముందు ఉప ఎన్నిక జరిగిన జూబ్లీహిల్స్‌ కూడా సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఆ ఉప ఎన్నిక బీజేపీకి ఆశించిన ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో ఖైరతాబాద్‌లో ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, ఎన్నిక సన్నద్ధతలో భాగంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సమావేశం అవుతున్నారు. ఈ సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పార్టీ నేతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 03:52 AM