Share News

నానాటికీ... లోలోతుకు....!

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:07 AM

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే అన్ని జిల్లాల్లో నీరు మరింత లోతుకు వెళ్లి పోయింది.

నానాటికీ... లోలోతుకు....!
మహబూబ్‌నగర్‌ జిల్లా బోయపల్లి సమీపంలో అడుగంటున్న చెరువు, (ఇంసెట్లో) హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో ఎండిన వరిపంట

· ఉమ్మడి పాలమూరులో వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు

· గతేడాదితో పోల్చితే అన్ని జిల్లాల్లోనూ పడిపోయిన నీటిమట్టం

· మహబూబ్‌నగర్‌లో గతేడాదితో పోల్చితే 4.22 మీటర్ల లోతుకు..

· నాగర్‌కర్నూలు జిల్లాలో అత్యల్పంగా భూగర్భ జలాల తగ్గుదల

· వర్షాలు కురవకపోతే యాసంగి సీజన్‌లో మరింత అట్టడుగుకు..

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోల్చితే అన్ని జిల్లాల్లో నీరు మరింత లోతుకు వెళ్లి పోయింది. సరైన వర్షపాతం లేకపోవడం, ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరదలు రాక.. అన్ని జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు లేకపోవడం దీనికి కారణంగా చెప్పవచ్చు. ఎల్‌నినో ప్రభావంతో సెప్టెంబర్‌ నెలలో దాదాపు 50 శాతం లోటు వర్షపాతం ఉమ్మడి జిల్లాలో నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో భూగర్భ జలాల స్థాయి ఆందోళనకరంగా ఉంది. గతేడాదితో పోల్చితే సగటు లోతు ఆగస్టు నాటికే దాదాపు రెట్టింపుగా నమోదైంది. జిల్లా సగటున గతేడాది ఆగస్టులో 5.90 మీటర్ల లోతులో నీరు లభ్యం కాగా.. ఈ ఏడాది ఏకంగా 10.12 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. దాదాపు 4.12 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. ఇక నారాయణపేట జిల్లాలో 0.91 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇక్కడ గతేడాది ఆగస్టులో 6.93 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఇప్పుడు 7.84 మీటర్ల లోతుకు చేరుకుంది. గద్వాల జిల్లాలో గతేడాది ఆగస్టులో సగటున 4.23 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ ఏడాది 6.08 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే 1.85 మీటర్ల లోతుకు అదనంగా పడిపోయాయి. అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గతేడాది 3.45 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు, ఈ ఏడాది 0.37 మీటర్ల లోతుకు పడిపోయాయి. వనపర్తి జిల్లాలో గతేడాదితో పోల్చితే 1.33 మీటర్ల లోతుకు అదనంగా భూగర్భ జలాలు పడిపోయాయని చెప్పవచ్చు. గతేడాది ఆగస్టులో 5.05 మీటర్ల లోతులో ఉండగా.. ఇప్పుడు 6.34 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇది జిల్లా సగటు కాగా.. కొన్ని మండలాల్లో మరింత లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని చెప్పవచ్చు.

కరువు, వాడకమే కారణం...:

ఎల్‌నీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు దశాబ్దకాలంగా ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే.. భూగర్భజలాలు పెరగడంతోపాటు.. రైతులు పంపుసెట్ల వినియోగం కూడా తక్కువగా చేస్తారు. కానీ వర్షాలు కురవకపోవడం వల్ల రైతులు పంపుసెట్ల వాడకం విపరీతంగా పెంచారు. ముఖ్యంగా ఆరుతడి పంటలను కాదని, వర్షాలు కురుస్తాయనే ఆశతో వరి వంటి వాటర్‌ క్రాప్స్‌ సాగుచేసిన రైతులు మరింత ఎక్కువగా నీటిని వాడుతున్నారు. ఓవైపు కరువుతో భూగర్భజలాలు రీచార్జ్‌ కాకపోవడం, గతంలో కరువు వచ్చినప్పటి కంటే నీటి వనరుల లభ్యత పెరిగిన తర్వాత సాగు విస్తీర్ణం.. అందులో ముఖ్యంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో అప్పటితో పోల్చితే ఒక్క సంవత్సరం వర్షాలు కురవకపోయినా.. పంటలు పండకపోయినా రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఒక్క సీజన్‌లో కరువు వస్తేనే భూగర్భజలాలు వేగంగా తగ్గిపోవడానికి కూడా వరిసాగు పెరగడమే కారణంగా చెప్పవచ్చు. అయితే యాసంగి సీజన్‌లోనైనా పంటల సాగు పెరుగుతుందా? అంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్‌లో లోటు వర్షపాతం నమోదు కాగా.. అక్టోబర్‌, నవంబర్‌లో కూడా పెద్దగా వర్షాలు కురుస్తాయని అంచనాలు కూడా లేవు. దీంతో రెండు సీజన్లకు కలిపి.. రైతులు భూగర్భజలాలు తగ్గడం వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడనున్నారు.

ఇక్కడ ఎక్కువ... అక్కడ తక్కువ...:

భూగర్భజలాలు ఆయా జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేవు.. కొన్ని ప్రాం తాల్లో భూ ఉపరితలానికి చాలా పైనే ఉండగా... కొన్ని మండలాల్లో అత్యంత లోతుకు పడిపోయాయి. నారాయణపేట జిల్లాలో గుండుమాల్‌ మండలంలో గతేడాది 6.77 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 21.64 మీటర్లలోతుకు వెళ్లిపోయా యి.. అంటే దాదాపు 14.87 మీటర్లు గతేడా దితో పోల్చితే తగ్గాయి. ఇదే జిల్లా మక్తల్‌ మండలంలో 3.49 మీటర్ల లోతులోనే ఉన్నా యి. జిల్లా సగటుతో పోల్చినా చాలాపైన నీరు అందుబాటులో ఉంది. మహబూబ్‌ నగర్‌ జిల్లా హన్వాడ మండలంలో గతేడాది 6.74 మీటర్లు ఉండగా.. ఈ ఏడాది ఆగస్టులో 18.92 మీటర్లకు పడిపోయింది. అంటే దాదాపు 12 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఇక మహ్మదాబాద్‌లో జిల్లా సగటుతో పోల్చినా చాలాపైన భూగర్భ జలాలు ఉన్నాయి. కేవలం 3.61 మీటర్ల లోతునే నీటి లభ్యత ఉంది. నాగర్‌కర్నూలు జిల్లాలో అమ్రాబాద్‌ మండలంలో 12.05 మీటర్ల లోతులో నీటి లభ్యత ఉండగా.. అత్యల్పంగా కోడేర్‌ మండ లంలో 1.03 మీటర్ల లోతులో ఉంది. గద్వాల జిల్లాలో అలంపూర్‌, ధరూర్‌, గట్టు ఇలా అన్ని మండలాల్లో సగటున 2 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.

Updated Date - Sep 26 , 2026 | 12:07 AM