మా కొద్దు.. ఈ ఇందిరమ్మ ఇళ్లు!
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:46 PM
తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది.
బిల్లులు సరిగా రాక రద్దు చేసుకుంటున్న లబ్ధిదారులు
హనుమకొండ జిల్లాలో ముందుకు సాగని పథకం
9,860 ఇళ్లలో పూర్తయినవి 260, వివిధ దశల్లో ఉన్నవి 3,099
పూర్తయిన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు సైతం కేటాయించని వైనం
హనుమకొండ: తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది. ఇండ్లు మంజూరైవారు ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఇళ్లు కట్టుకోవచ్చునని సంతోషపడ్డారు. తాముంటున్న గుడిసెలను తొ లగించి ఆ స్థలంలోనే ఇళ్లను మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి వారికి చు క్కలు కనిపిస్తున్నాయి. అటు ఇల్లు పూర్తికాక.. ఇటు ఉన్న నీడ కూడా పోయి రెంటికి చెడిన రేవడి చందంగా మారింది. వీరి పరిస్థితిని చూసిన మిగతా లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టడానికి జంకుతున్నారు. మరికొంత మంది తమకు మంజూరైన ఇళ్లు తమ వల్లకాదని రద్దు చేసుకుంటున్నారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లుల చెల్లింపులో తీవ్రజాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు మొదట తమ సొంత డబ్బుతో ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత దశల వారిగా బిల్లులను చెల్లిస్తారు. అయితే పునాదులు పూర్తయిన ఇళ్లకే సకా లంలో మొదటి విడత బిల్లు రావడం లేదు. అది వస్తే తప్పా లబ్ధిదారులు నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి. బిల్లు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని లబ్ధిదారులు వాపోతు న్నారు. సాంకేతిక సమస్యలు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పలు వల్ల తొలి విడత బిల్లే పెండింగ్‌లో పడుతున్నది. శ్లాబ్ పనులు పూర్తయినా ఇళ్లకు బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్న స్ప ష్టమైన ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరో పణలు వినవస్తున్నాయి. కొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు ఇంటి నిర్మాణాలు చేపట్టినా వారి ఖాతాల్లో అనుకున్న సమయంలో బిల్లుపడకపోవడంతో ఎందుకు ఇంటి నిర్మాణం చేపట్టామా అని తలలు పట్టుకుంటున్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయి ఇళ్ల నిర్మాణంలో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు.
రద్దు చేసుకుంటున్న లబ్ధిదారులు
బిల్లులు సకాలంలో రావడం లేదని, పైగా ప్రభుత్వం ఇచ్చే రుణసాయం ఏ మూలకు సరిపోదని తెలిసి కొందరు లబ్ధిదారు లు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టకముందే తమకు వద్దని రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలకు లిఖితపూర్వకంగా రాసిస్తున్నారు. ప్రతీ మండలంలో 15 నుంచి 20 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులను రద్దు చేయించుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లను మొదలు పెట్టిన తర్వాత లబ్ధిదారులు పడుతున్న కష్టాలను చూసి తమకు జ్ఞానోదమైందని, అందుకే ముందుగా జాగ్రత్త పడుతున్నామని చెబుతున్నారు.
పూర్తయినా కేటాయించరా?
జిల్లాలో డబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణ పరిస్థితి కూడా అధ్వాన్నం గా ఉంది. ఏళ్లు గడుస్తున్నా చాలాచోట్ల ఇప్పటికీ పూర్తికాలేదు. పూర్తయిన చోట్ల లబ్ధిదారులకు కేటాయింపులు జరగడం లేదు. జిల్లాకు 4219 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయిం చింది. రూ.228.27 కోట్ల వ్యయంతో వీటిని చేపట్టాల్సి ఉంది. ఈ ఇళ్లలో ఇప్పటి వరకు 2480కి టెండర్లు ఖరారయ్యాయి. 2158 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 109 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. 213 ఇళ్ల పనులు అసలే ప్రారంభం కాలేదు. 24 ఇళ్లు పునాదుల వరకు, 7 ఇళ్లు స్తంభాల వరకు, 15 ఇళ్లు గోడల వరకు 63 ఇళ్లు ప్లాస్టరింగ్ వరకు వచ్చాయి.
ఇప్పటి వరకు లబ్ధిదారులకు 1176 ఇళ్లను మాత్రమే కేటాయించారు. ఇంకా 1030 ఇళ్లు కేటాయించా ల్సి ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో 72, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 592ఇళ్లు, జిల్లా పరిధిలోకి వచ్చే హుజూరాబా ద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాల్లో 10, పరకాల నియోజకవ ర్గంలో 482, భూపాలపల్లిలో 20 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరో 608 ఇళ్లు కేటాయించాల్సి ఉంది. వీటిలో 467 మంది లబ్ధిదారుల జాబితా సిద్ధమైంది. 141 మంది లబ్ధిదారుల జాబితా తయారవుతోంది.
పూర్తయినవి 260 ఇళ్లే..
హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ మొదటి, రెండో దశ కింద 9,860 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు కలెక్టర్ 7,800 ఇళ్లకు ఆమోదం తెలిపారు. ఇంకా 2,060కు ఆమోదం లభించాల్సి ఉంది. ఆమోదం పొందిన ఇళ్లలో ఇప్పటి వరకు 6287కి గృహనిర్మాణ శాఖ మార్కింగ్ ఇచ్చింది. లబ్ధిదారు లు కాళ్లరిగేలా తిరిగిన తర్వాత గానీ ఈ మాత్రం మార్కింగ్ జరిగింది. ఇంకా 1,513ఇళ్లకు మార్కింగ్ ఇవ్వాల్సి ఉంది. వీటికెప్పుడు మార్కింగ్ జరుగుతుందో తెలియదు. మార్కింగ్ తర్వాత 885 ఇళ్ల పనులు బేస్‌మెంట్ లెవల్ కన్నా కింది స్థాయికి రాగా బేస్‌మెంట్ లెవల్‌కు 1,385, గోడల వరకు 685 ఇళ్లు, స్లాబుల వరకు 3,099 ఇళ్లు వచ్చాయి. మొత్తంగా పూర్తయినవి కేవలం 260 ఇళ్లు మాత్రమే. మంజూరైన మొత్తం 9860 ఇళ్లలో వాస్తవంగా పనులు మొదలైంది 5402 (69.20 శాతం) ఇళ్లే..
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News