Share News

గేమ్‌ చేంజర్‌ కారిడార్‌!

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:10 AM

హైదరాబాద్‌కు తూర్పు వైపున గౌరెల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డును; పడమర వైపు నార్సింగి-మంచిరేవుల మధ్య ఓఆర్‌ఆర్‌ను కలిపితే..!? నగరం మధ్యలోంచి అటూ ఇటు 43 కిలోమీటర్ల మేర...

గేమ్‌ చేంజర్‌ కారిడార్‌!

  • హైదరాబాద్‌ మధ్యలో 43 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి

  • ఓఆర్‌ఆర్‌పై తూర్పు, పడమరను కలుపుతూ..

  • ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ మీదుగా గౌరెల్లి నుంచి నార్సింగికి 69 కి.మీ. దూరం

  • మూసీ కారిడార్‌ నిర్మాణంతో 26 కిలోమీటర్లు తగ్గనున్న దూరం

  • రెండు గంటల ప్రయాణం కాస్తా గంటలోపే.. నిమిషాల్లో ఓఆర్‌ఆర్‌పైకి

  • మూసీ ప్రణాళికతో రాజధానికి కొత్తరూపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు తూర్పు వైపున గౌరెల్లి వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డును; పడమర వైపు నార్సింగి-మంచిరేవుల మధ్య ఓఆర్‌ఆర్‌ను కలిపితే..!? నగరం మధ్యలోంచి అటూ ఇటు 43 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మిస్తే..!? ఈ ‘ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌’ నగర రవాణా వ్యవస్థకే గేమ్‌ చేంజర్‌గా మారుతుంది! నగరం మధ్యలో ఎక్కడి నుంచి అయినా ఓఆర్‌ఆర్‌కు వెళ్లే సమయం భారీగా తగ్గిపోతుంది. శివార్ల నుంచి నగరంలోకి తక్కువ సమయంలో వచ్చేయొచ్చు. నగరంలోనూ ట్రాఫిక్‌ సమస్యలకు భారీగా చెక్‌ పడుతుంది! ఈ దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. మూసీ నది వెంబడి ఈస్ట్‌-వెస్ట్‌ ఎట్‌ గ్రేడ్‌ కారిడార్‌ను నిర్మించనుంది. రెండేళ్ల వ్యవధిలోనే దీనిని పూర్తి చేయాలని భావిస్తోంది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో ఈ కారిడార్‌ అత్యంత కీలకం కానుంది. హైదరాబాద్‌కు మణిహారంలా మారిన ఓఆర్‌ఆర్‌ తరహాలోనే.. నగర ఆధునిక రవాణా వ్యవస్థకు ఆయువు పట్టుగా నిర్మించాలని దీనిని రూపకల్పన చేసింది.


తూర్పు నుంచి పడమరకు గంటలోపే!

గ్రేటర్‌ చుట్టూ ఓఆర్‌ఆర్‌ ఉంది. నగరం మధ్యలోంచి అటు ఇటు దానిని కలుపుతూ మూసీ నదీ తీరం వెంబడి కారిడార్‌ నిర్మిస్తే.. రాకపోకలు అత్యంత వేగంగా సాగనున్నాయి. 45-50 నిమిషాల్లోనే నార్సింగి నుంచి గౌరెల్లి చేరుకోవచ్చు. ప్రస్తుతం గౌరెల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా కోకాపేటకు రావాలంటే గంటన్నరకుపైగా సమయం పడుతోంది. నగరంలో మధ్యలోంచి రావాలంటే 2 గంటలపైనే పడుతోంది. ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌ పూర్తయితే 55 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం గౌరెల్లి నుంచి ఓఆర్‌ఆర్‌ మీదుగా నార్సింగికి 69 కి.మీ. దూరం ఉంది. మూసీ కారిడార్‌ నిర్మాణంతో 26 కి.మీ. దూరం తగ్గనుంది. దీంతో, ప్రయాణ సమయం సగానికి సగం తగ్గనుంది. ఈ కారిడార్‌ అందుబాటులోకి వస్తే కోర్‌ సిటీలోని ప్రధాన రహదారులపైనా ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గి, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోఠి, అబిడ్స్‌, అఫ్జల్‌గంజ్‌ ప్రాంతాల నుంచి ఓఆర్‌ఆర్‌కు చేరుకోవాలంటే ప్రస్తుతం గంటకుపైగా సమయం పడుతోంది. అదే ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌ మీదుగా 25-30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. గ్రేటర్‌ చుట్టూ ఉన్న 158 కి.మీ. ఓఆర్‌ఆర్‌పై 23 వరకు ఇంటర్‌ చేంజ్‌లు ఉన్నట్లుగానే 43 కి.మీ.ల ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌ పొడవునా ఇంటర్‌ చేంజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.


పలు కీలక జంక్షన్ల వద్ద వీటిని నిర్మించడం ద్వారా ప్రధాన రహదారులకు సులభంగా కనెక్టివిటీ లభిస్తుంది. ముఖ్యంగా తూర్పు నుంచి వచ్చే మార్గంలో నాగోల్‌- ఉప్పల్‌ మధ్య ఉన్న ఇన్నర్‌ రింగు రోడ్డు, అంబర్‌పేట- మూసారంబాగ్‌ మధ్య ఉన్న రహదారి, గోల్నాక, చాదర్‌ఘాట్‌, ఎంజీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, పురానాపూల్‌, హైకోర్టు-సిటీ కాలేజ్‌, మంగళ్‌హాట్‌, బహదూర్‌పుర, హై దరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు హైవే, అత్తాపూర్‌- మెహిదీపట్నం మధ్య ఉన్న ఇన్నర్‌ రింగు రోడ్డు, బాపుఘాట్‌, చెవేళ్ల-శంకర్‌పల్లి రాష్ట్ర రహదారులు, చివరగా మంచిరేవుల-నార్సింగి మధ్య ఉన్న ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం అవుతుంది. మూసీ పునరుజ్జీవంతోపాటు ఆధునిక రహదారి వ్యవస్థను అభివృద్ధి చేసి నగర రూపురేఖలను మార్చే మహా ప్రణాళికగా ప్రభుత్వం దీన్ని అభివర్ణిస్తోంది. దీని నిర్మాణంతో కొత్త వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Updated Date - Mar 15 , 2026 | 05:11 AM