డొమెస్టిక్ సిలిండర్లకు ఇబ్బంది లేదు..
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:01 PM
‘ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో నగరంలో డొమెస్టిక్ సిలిండర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు.. గ్యాస్‌బండలు దొరుకుతాయో, లేవోననే భయంతో చాలామంది ప్యానిక్ అయి బుక్ చేసుకుంటున్నారు..’ అని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి తెలిపారు.
నిర్ణీత కాలవ్యవధిలో సరఫరా చేస్తున్నాం..!
భయంతో బుకింగ్‌లు.. దాంతో సాంకేతిక సమస్యలు
కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే చర్యలు
మూడు రోజుల్లో 234 కేసులు నమోదు
‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి
హైదరాబాద్ సిటీ: ‘ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధ నేపథ్యంలో నగరంలో డొమెస్టిక్ సిలిండర్లకు ఎలాంటి ఇబ్బంది లేదు.. గ్యాస్‌బండలు దొరుకుతాయో, లేవోననే భయంతో చాలామంది ప్యానిక్ అయి బుక్ చేసుకుంటున్నారు..’ అని జిల్లా చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి తెలిపారు. గృహాలకు కావాల్సిన ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరం కొనసాగించేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళనకూ గురికావద్దని ఆయన సూచించారు. గ్రేటర్‌లో గ్యాస్ కొరత, సిలిండర్ల బుకింగ్‌లపై శనివారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
మూడు రోజుల క్రితం 74వేల బుకింగులు
గ్రేటర్ వ్యాప్తంగా 18.61లక్షల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రోజుకు 40వేల బుకింగ్‌లు జరుగగా.. ప్రస్తుతం యుద్ధ భయంతో మూడు రోజుల క్రితం ఏకంగా 74వేలు బుక్ అయ్యాయి. 25 రోజుల గడువు పూర్తయిన వెంటనే కొందరు యాప్‌ల ద్వారా బుక్ చేసుకుంటున్నారు. మరికొందరు నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు.
రంజాన్ తర్వాత డిమాండ్ తగ్గుతుంది
ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో ఇళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం పెరిగిపోయింది. దీంతో బుకింగ్‌లు పెరిగిపోయాయి. అయితే, రంజాన్ తర్వాత డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

ఆస్పత్రులు, హాస్టళ్లకు ప్రాధాన్యం
నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు కావాల్సిన సిలిండర్లను అందజేస్తున్నాం. వీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే పౌరులకు కూడా సకాలంలో సిలిండర్లను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
డొమెస్టిక్‌ను వాణిజ్య అవసరాలకు వాడొద్దు..!
డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించొద్దు. ఇలా ఎవరైనా చేస్తే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, సెక్షన్ 6ఏ ప్రకారం కేసులు నమోదు చేస్తాం. ఈనెల 11 నుంచి 13 వరకు చేసిన తనిఖీల్లో నగరంలో 234 కేసులు నమోదు చేశాం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News