విద్యుత్ వినియోగం పైపైకి..
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:21 AM
గ్రేటర్‌లో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు గ్యాస్ కొరతతో గృహాల్లో కరెంటు వినియోగం పెరిగింది.
గ్యాస్ కొరత ప్రభావం వల్ల..
ఇండక్షన్ స్టవ్‌లతో పెరుగుతున్న వాడకం
గ్రేటర్‌లో 80 మిలియన్ యూనిట్లకు చేరిన వైనం
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు గ్యాస్ కొరతతో గృహాల్లో కరెంటు వినియోగం పెరిగింది. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కొంతమంది ఇళ్లలో ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తుండటంతో కూడా విద్యుత్ వినియోగం పెరుగుదలకు కారణమైంది. గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, చిన్నతరహా టిఫిన్ సెంటర్లలో ఇండక్షన్ స్టవ్‌లు వినియోగిస్తున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో గురువారం 79.20 మిలియన్ల విద్యుత్‌వినియోగం నమోదయింది. గ్యాస్ కొరత ఇదే తరహాలో కొనసాగితే విద్యుత్‌వినియోగం మరింత పెరుగుతుందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది.
తక్కువ ఖర్చు..
గ్యాస్ కంటే ఇండక్షన్ స్టవ్‌లు వాడితే నెలవారీ ఖర్చు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలకు ఒక సిలిండర్ (డొమస్టిక్ గ్యాస్ 14.2 కిలోలు) ఖర్చవుతుంది. దీని ధర 965గా ఉంది. అదే ఇండక్షన్ స్టవ్‌లు వినియోగస్తే ఇవి విద్యుదయస్కాంత ప్రేరణతో పాత్రను వేడిక్కిస్తాయి. దీంతో వేడి ఎక్కువగా వృథా కాదు. రోజుకు సుమారు 3 యూనిట్ల విద్యుత్ నమోదవుతుంది. ఇలా నెలకు 90 యూనిట్ల ఖర్చవుతే నెలకు రూ.720 (యూనిట్‌కు రూ.8గా లెక్కిస్తే) బిల్లు వస్తుంది. అంటే ఎల్‌పీజీ డొమస్టిక్ సిలిండర్‌తో పోలిస్తే రూ.245 వరకు ఆదా అవుతుందన్నమాట.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News