Share News

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రంగంలోకి పోలీసులు

ABN , Publish Date - Mar 15 , 2026 | 10:44 AM

దంపతులు నమ్మకంగా ఆ ఇంట్లో పని వారిగా చేరారు. వారిని నమ్మిన యజమానులు.. ఇంటి పనిని వారికి అప్పగించారు. అదే అదనుగా భావించిన ఆ దంపతులు.. అత్యంత విలువైన వజ్రపు నగలతో ఉడాయించారు.

జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. రంగంలోకి పోలీసులు

హైదరాబాద్, మార్చి 15: దంపతులు నమ్మకంగా ఆ ఇంట్లో పని వారిగా చేరారు. వారిని నమ్మిన యజమానులు.. ఇంటి పనిని వారికి అప్పగించారు. అదే అదనుగా భావించిన ఆ దంపతులు.. అత్యంత విలువైన వజ్రపు నగలతో ఉడాయించారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకంది. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన ఆ కుటుంబం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 25లో అనిరుధ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో నేపాల్‌ నుంచి వచ్చిన దంపతులు పనికి 45 రోజుల క్రితం చేరారు. అప్పగించిన పనులను ఎంతో నమ్మకంగా.. పొందికగా చేసుకుంటూ వెళ్తున్నారు. దీంతో ఆ దంపతులుపై అనిరుధ్ కుటుంబానికి నమ్మకం కుదిరింది.


అయితే శనివారం రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత.. చోరీకి ఇదే మంచి సమయమని నేపాలి దంపతులు భావించారు. అంతే లాకర్‌ను పగలకొట్టారు. అందులో అత్యంత ఖరీదైన వజ్రాల హారాలు, బంగారు నగలు, విదేశీ వాచీలను దోచుకుని పారిపోయారు. ఆదివారం ఉదయం లాకర్ తెరచి ఉండడంతోపాటు పని మనుషులుగా కుదిరిన నేపాలి దంపతులు అదృశ్యమైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.


అనిరుధ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిరుధ్ రెడ్డి నివాసం సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇంట్లో పని మనుషులను పెట్టుకునే ముందు.. వారి ఆధార్ కార్డులను పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని నగర వాసులకు పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే నిందితులకు సంబంధించిన అన్ని ఆధారాలను హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు పంపారు. చోరీ అయిన వజ్రాలు, బంగారం, విదేశీ వాచీల విలువ రూ. 2 కోట్లు ఉంటుందని పోలీసులు వివరించారు.

Updated Date - Mar 15 , 2026 | 11:41 AM