Share News

భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:26 PM

ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు చేసింది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యంపై రోహిత్ తాజాగా స్పందించాడు.

భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది: రోహిత్ శర్మ
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టోర్నీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుతాలు చేసింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండుసార్లు టీమిండియా ముద్దాడింది. మరోవైపు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో తొలిసారి మహిళా వన్డే ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ప్రస్తుతం ఐసీసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో భారత ఆధిపత్యంపై రోహిత్ తాజాగా స్పందించాడు.


‘భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మున్ముందూ ఇదే దూకుడు కొనసాగుతుందని నమ్ముతున్నా. పురుషుల జట్టు వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లను నెగ్గింది. అయితే మహిళా జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూడటం చాలా బాగుంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒక్కసారి ఇలాంటి స్థితికి చేరుకున్న తర్వాత ముందుకు సాగిపోవాల్సిందే. అందరిపై బాధ్యత ఇంకా పెరుగుతుంది’ అని రోహిత్ శర్మ వివరించాడు.


సవాళ్లను స్వీకరించాలి..

‘ఎప్పుడు అవకాశం వచ్చినా అందుకోవడానికి రెడీగా ఉండాలి. ప్రతి సవాల్‌ను స్వీకరించాలి. అందుకోసం సన్నద్ధతే కీలకం. జాతీయ జట్టుకు ఎవరినైనా ఎంచుకున్నారంటే దానికి కారణం ఉంటుంది. మన దేశంలో చాలా పోటీ ఉంది. కాబట్టి అండర్ 14 నుంచే కష్టపడుతూ రావాలి. ఎంత టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలి. సరైన సమయంలో మనలోని ఆటగాడిని గుర్తించే వ్యక్తి తారసపడాలి. మీ దగ్గర మంచి నైపుణ్యం ఉన్నా సరే ఎవరికీ చూసే అవకాశం రాకపోతే వృథానే. అలా అని అదృష్టం కోసమే ఎదురుచూస్తూ ఉండకూడదు.. నిరంతరం శ్రమిస్తూ ఉండాలి’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

‘సన్‌రైజర్స్’ జట్టుకు పాక్ ప్లేయర్ అబ్రార్ దూరం?

ఏ జట్టు సంస్థ కంటే పెద్దది కాదు.. ప్రపంచ కప్ బహిష్కరణ డ్రామాపై జైషా ఆగ్రహం

Updated Date - Mar 15 , 2026 | 12:27 PM