Share News

ట్రోఫీలు గెలవడం భారత్ డీఎన్ఏలోనే ఉంది: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 15 , 2026 | 09:34 AM

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన టీమిండియా వరుసగా రెండో సారి ట్రోఫీని ఘనంగా ముద్దాడింది. అయితే పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే పాక్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర విమర్శలు చేశాడు.

ట్రోఫీలు గెలవడం భారత్ డీఎన్ఏలోనే ఉంది: పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Rashid Latif

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన టీమిండియా వరుసగా రెండో సారి ట్రోఫీని ఘనంగా ముద్దాడింది. అయితే పాకిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. సూపర్ 8 దశలోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే పాక్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ తీవ్ర విమర్శలు చేశాడు. పీసీబీ తీసుకున్న నిర్ణయాలు, బోర్డు పనితీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌తో పాక్ జట్టును పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.


‘ట్రోఫీలు గెలవడం భారత్ డీఎన్ఏలోనే ఉంది. నా డీఎన్ఏలో మాత్రం నాకౌట్ దశకు ముందు ఓడిపోవడం ఉంది. భారత్ వరుస విజయాలతో అద్భుత ప్రదర్శన చేస్తూ వచ్చింది. ఐసీసీ టోర్నీల్లో ఇలాంటి ప్రదర్శన చేయడం ఒక్కరోజులో వచ్చిన ఫలితం కాదు.. దాదాపు పదేళ్ల కష్టానికి నిదర్శనం. ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్‌పై టాస్ ఓడినా 250 పరుగులు చేసిన ఘనత టీమిండియాది. వారిని అందుకోవడం, ఓడించడం అంత సులువైన పని కాదు. అది వారు ఒక్కరోజులో చేసిన ప్రదర్శన వల్ల వచ్చిన పేరు కాదు.. ఏళ్ల తరబడి వారి దేశ క్రికెట్ కోసం పడుతున్న కష్టం. ఇటీవలే జరిగిన ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ చూస్తే వారి స్థాయి అర్థం అవుతుంది’ అని లతీఫ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.


పీసీబీపై ఆగ్రహం

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కూడా లతీఫ్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్ల కాంట్రాక్టుల విషయంలో వ్యవస్థం సక్రమంగా లేదని ఆరోపించాడు. ‘బలహీనమైన బోర్డులు ఇలాగే వ్యవహరిస్తాయి. కాంట్రాక్టులో జరిమానాలు, బహుమతులు అన్నీ స్పష్టంగా ఉండాలి. ఈ విషయంలో బోర్డు తీవ్రంగా విఫలమైంది’ అని ఆరోపించాడు.


కాగా ఈ విజయంతో భారత్ టీ20 వరల్డ్‌ కప్ చరిత్రలో మూడు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. వరుసగా రెండు సార్లు ట్రోఫీని ముద్దాడిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇటీవల భారత్ వరుసగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గెలిచిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ బాటలో.. సూపర్ ఫిట్‌గా మారిన రిషబ్ పంత్

ఐపీఎల్ 2026: టైటిల్‌కు కేకేఆర్ గట్టి పోటీదారుగా ఉండలేదు.. అనిల్ కుంబ్లే

Updated Date - Mar 15 , 2026 | 09:43 AM