అభిషేక్‌ను చూసి అసూయపడేవాళ్లం.. జట్టులో అతడే సూపర్ స్టార్: సంజు శాంసన్
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:33 AM
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా స్టార్ బ్యాటర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇండియా టుడే కంక్లేవ్‌కు హాజరయ్యారు. తమ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ టోర్నీ ఆరంభంలో కాస్త విఫలమైనప్పటికీ.. ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో తమ ఓపెనింగ్ జోడీపై సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా టుడే కంక్లేవ్‌కు వీరిద్దరూ హాజరయ్యారు.
అతడే సూపర్ స్టార్..
‘మేమిద్దరం బరిలోకి దిగితే ఐస్ అండ్ ఫైర్‌లా ఉండం. అగ్గికి అగ్గి తోడైనట్లే. కొన్నిసార్లు నేను దూకుడుగా ఆడాను. మరికొన్నిసార్లు అతడు వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. మేమిద్దరం ఎప్పుడు ఓపెనింగ్ చేసినా ఇదే పద్ధతిలో సాగాం. కేరళం-పంజాబీ స్నేహం.. మేమిద్దరం సహజంగా ఆడతాం. అందుకోసం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చుకోం. ఒక్కోసారి అతడే ‘బాల్ ఎలా వస్తుంది?’ అని అడుగుతాడు. మామూలుగానే వస్తోంది సిక్స్ కొట్టేయొచ్చని చెబుతా. అభిషేక్ చాలా ధైర్యవంతుడు. అద్భుతంగా సిక్స్‌లు కొడతాడు. అతడి క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఇంతకుముందు వరకూ మేం అభిషేక్ పట్ల కాస్త అసూయపడేవాళ్లం(నవ్వుతూ). ఎక్కడికి వెళ్లినా అభిషేక్ అంటూ అభిమానులు పిలుస్తుండేవారు. మిగతావారిని చూడటం లేదా? అని అనిపిస్తుండేది. జట్టులో అతడే సూపర్ స్టార్. త్వరలో వివాహం చేసుకోవాలి’ అని సంజు సరదాగా వ్యాఖ్యానించాడు.
అదే నా కల: అభిషేక్ శర్మ
‘నేను చెప్పే మాట త్వరగా జీర్ణించుకోవడం కష్టమే. అయినా సరే చెబుతా. నా లక్ష్యం ఒకటే.. ఐసీసీ ట్రోఫీలను గెలవడమే నా గోల్. ఇప్పుడీ విజయం కేవలం ఆరంభం మాత్రమే. అయితే నేను అనుకున్నట్లుగా టోర్నీని ప్రారంభించలేదు. కానీ మిగతా సభ్యులు అదరగొట్టారు. నా కల మాత్రం తీరింది. ఇక ముందున్న లక్ష్యం కేవలం ఒక్క ట్రోఫీ కాదు.. చాలా గెలవాలి’ అని అభిషేక్ శర్మ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆటగాళ్లకు రూ.50లక్షల జరిమానా.. ఆ వార్తలను ఖండించిన పీసీబీ
పాకిస్థాన్ ప్లేయర్ ప్రపంచ రికార్డ్..