Share News

నర్మాలకు మళ్లీ జీవం!

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:44 PM

మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల తో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు (నర్మాల) ప్రాజెక్టుకు మళ్లీ జీవం వస్తోంది.

నర్మాలకు మళ్లీ జీవం!
Upper Manair Project

  • పాల్వంచ వాగు ఉధృతి..

  • కూడవెల్లిలో నెమ్మదిగా ప్రవాహం

  • ఎగువ మానేరు నీటిమట్టం పెరుగుతుందనే ఆశలో సరిహద్దు జిల్లాల రైతులు

దుబ్బాక(సిద్దిపేట): మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల తో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు (నర్మాల) ప్రాజెక్టుకు మళ్లీ జీవం వస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతుండగా, సరిహద్దు జిల్లాల రైతన్నల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మా ల ప్రాజెక్టు వర్షాల కారణంగా మళ్లీ జీవం పోసుకుంటోంది. ఈ పరిణామం జిల్లా దుబ్బాకతో పాటు సరిహద్దు జిల్లాల రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ప్రాజెక్టుకు ప్రధాన జలవనరు అయిన కామారెడ్డి జిల్లాలో పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వరద నీటిని నర్మాలకు చేర్చుతోంది. మరోవైపు దుబ్బాక నియోజకవర్గానికి జీవనాధారమైన కూడవెల్లి వాగులోనూ ప్రవాహం మొదలైంది.


పాల్వంచ ఉధృతి.. పెరుగుతున్న ఇన్‌ఫ్లో

ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాల్వంచ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నాటికి ప్రాజెక్టులోకి 2,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతానికి ప్రాజెక్టు నుంచి ఎలాంటి నీటిని విడుదల చేయలేదు. స్పిల్‌వేతో పాటు కుడి, ఎడమ ప్రధాన కాలువలు మూసివేసి ఉన్నాయి.


ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎగువ మానేరు ప్రాజెక్టు నీటిమట్టం 1472.67అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1482.50 అడుగులు కాగా, ప్రస్తుతం 0.912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ప్రాజెక్టులో 1473.80 అడుగుల నీటిమట్టంతో 1.01 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.


upper.jpgనెమ్మదిగా కూడవెల్లి ప్రవాహం

దుబ్బాక ప్రాంతానికి జీవనాడిగా భావించే కూడవెల్లి వాగు, ఈ ఏడాది మల్లన్నసాగర్‌ నుంచి నీటి విడుదల సక్రమంగా లేకపోవడంతో ఎండిపోయింది. కురుస్తున్న వర్షాలకు వాగులో స్వల్పంగా ప్రవా హం మొదలైంది. రామలింగేశ్వరాలయ సన్నిధి వరకు నీరు చేరింది. శుక్రవారం సాయంత్రం మళ్లీ వర్షం ప్రారంభం కావడంతో, శనివారానికి వాగు మరింత ఉధృతిని సంతరించుకునే అవకాశముంది. ఈ వాగు పూర్తిగా ప్రవహిస్తే దీనిపై ఉన్న 54 చెక్‌డ్యాంలు నిండి పరివాహక రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది.


పెరుగనున్న భూగర్భ జలాలు

ఎగువ మానేరు ప్రాజెక్టు నీటిమట్టం పెరిగితే దుబ్బాక మండలంతో పాటు కామారెడ్డి జిల్లా బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్‌ మండలాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని రైతులు భావిస్తున్నారు. ముఖ్యంగా దుబ్బాకతో పాటు చెల్లాపూర్‌, రాజక్కపేట, అప్పనపల్లి గ్రామాల వరకు నర్మాల ప్రాజెక్టు ఊట నీటి ప్రభావంతో బోరుబావుల్లో నీటి మట్టాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.


ఆకాశం వైపే రైతుల చూపు

దుబ్బాక నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో చెరువుల్లోకి నీరు చేరలేదు. చెరువులను పూర్తిస్థాయిలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు అనుసంధానం చేయకపోవడంతోనే ఈ నీటి ఎద్దడి తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ముసురువానలతో పాటు భారీ వర్షాలు నమోదైతేనే తడిసిన నేల నుంచి వరద నీరు నేరుగా చెరువుల్లోకి చేరే అవకాశం ఉంది. రానున్న రెండు రోజుల వర్షాలపైనే ఎగువ మానేరు నీటిమట్టం, భూగర్భ జలాల పెరుగుదల ఆధారపడి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మూడు రోజులైన దొరకని వృద్ధుడి డెడ్‌బాడీ.. కొనసాగుతున్న గాలింపు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 12:44 PM