వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:36 AM
ఇద్దరు యువకులు పెళ్లి పేరుతో మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని అనిత అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం నెలకొంది. మంచి భవిష్యత్తు ఉన్న తమ కూతురు చావుకు కారణమైన ఆ ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్: ఇద్దరు యువకులు వేధించడం, అవమానించడం తట్టుకోలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. అనితను తొర్రూరు మండలానికి చెందిన దూరపు బంధువు రాజేందర్ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. ఇటీవల అనిత డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయమని చెప్పడం, ఎవరితోనో మాట్లాడుతున్నావంటూ రాజేందర్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక అనిత తన తల్లిదండ్రులతో చెప్పి బాధపడింది. రాజేందర్ పద్ధతి నచ్చక, తమ కూతురుని అతడికి ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని తేల్చి చెప్పారు. అయినా అనితను పెళ్లి చేసుకుంటానంటూ బతిమలాడుతూనే ఉన్నాడు.
మరోవైపు అనిత తన క్లాస్‌మేట్ అయిన జబ్బార్ లాల్‌ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని భావించారు. ఇటీవల జబ్బార్ కూడా మోసగాడని తేలింది. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని పదేపదే వేధించడం మొదలు పెట్టాడు. జబ్బార్ వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన అనిత ఈ నెల 27న రాజేందర్ కు ఫోన్ చేసి ‘నువ్వు, జబ్బార్ నా జీవితంతో ఆడుకున్నారు, నన్ను వేధించారు, అవమానించారు, మీ వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ బాధపడింది.
అనితకు ధైర్యం చెప్పాల్సిన రాజేందర్ నిర్లక్ష్యంగా 'చావు.. నీ ఇష్టం' అంటూ ఫోన్ కట్ చేశాడు. దాంతో అనిత తీవ్ర మనస్తాపానికి గురై గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అనిత కన్నుమూసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు రాజేందర్, జబ్బార్ లపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
రేవంత్ నయా రికార్డ్.. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
Read Latest Telangana News And Telugu News