Share News

కేసీఆర్‌కు నోటీసు

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:13 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ..

కేసీఆర్‌కు నోటీసు

  • ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేడు మధ్యాహ్నం విచారణకు రావాలని సిట్‌ ఆదేశం

  • వయసు దృష్ట్యా విచారణ ఇంట్లోనా.. సిట్‌ ఆఫీసులోనా ఎంచుకునే చాన్స్‌ కేసీఆర్‌కే

  • రాధాకిషన్‌రావు తదితరులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నించేందుకు సిద్ధం

హైదరాబాద్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ.. బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామమని సిట్‌ ఏసీపీ వెంకటగిరి.. నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు కాపీని సిట్‌ అధికారులు.. నందినగర్‌లోని కేసీఆర్‌ ఇంటికి వెళ్లి, అక్కడి సిబ్బందికి అందజేశారు. ‘‘పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2024లో క్రైం నంబర్‌ 243 కింద నమోదైన క్రిమినల్‌ కేసు విచారణలో భాగంగా వెల్లడైన అంశాల్లో మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది’’ అని.. 160 సీఆర్‌పీసీ కింద ఇచ్చిన ఈ నోటీసులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. అయితే, కేసీఆర్‌ వయసు రీత్యా హైదరాబాద్‌ పరిధిలో ఆయన కోరిన స్ధలంలో దర్యాప్తు అధికారి, ఆయన బృందం విచారణ చేపడతారని, లేదా ఆయన సిట్‌ కార్యాలయానికి హాజరుకావచ్చని.. ఏ విషయాన్నీ దర్యాప్తు అధికారికి తగు ముందస్తు వ్యవధిలో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టు అయిన పోలీసు అధికారులు.. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎస్‌ఐబీ అధికారులు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల వాంగ్మూలాల్లో పలుచోట్ల తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, పెద్దాయన ఆదేశాల మేరకే ట్యాపింగ్‌ చేశామని చెప్పారు. నాటీ సీఎంవో గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావును విచారించినప్పుడు.. తనకు పైనుంచి ఆదేశాలు అందిన విషయాన్ని ఆయన అంగీకరించారు. దీంతో ఆ ఆదేశాలెవరు ఇచ్చారన్న విషయాలను తెలుసుకోవడానికి కేటీఆర్‌, హరీశ్‌, సంతో్‌షలను సిట్‌ అధికారులు ఇటీవల విచారించారు.


విచారణలో వారందరూ పేర్కొన్న అంశాలు, తమ అనుమానాలు, దర్యాప్తులో వెలుగుచూసిన విషయాల ఆధారంగా ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు.. వీటన్నింటిపై సిట్‌ చీఫ్‌ వీసీ సజ్జనార్‌ సమీక్ష నిర్వహించిన తర్వాత, కేసీఆర్‌ను విచారించడానికి సిట్‌ అధికారులు సిద్ధమయ్యారు. మావోయిస్టుల పేరిట.. విపక్ష నేతలు, వారి కుటుంబసభ్యులతోపాటు, బీఆర్‌ఎస్‌ నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్లను ట్యాపింగ్‌ చేయించడంతో పాటు వారిపై నిరంతర నిఘా కొనసాగించడానికి ఒకవైపు నిఘా బృందాలను, మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ బృందాలను గత సర్కారు వాడుకుందని నిరూపించే పక్కా అధారాలను సిట్‌ ఇప్పటికే సేకరించినట్టు సమాచారం! వీరిలో కొందరిపై నిఘా పెట్టాలని పెద్దాయన చెపితే మరికొందరిపై నిఘా పెట్టాలని చిన్నాయన, ఇంకొందరిపై నిఘా పెట్టాలని కేసీఆర్‌ కుటుంబసభ్యులు, బంధువులు అడిగారని.. ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌ను దుర్వినియోగపరిచారని సీనియర్‌ పోలీసుఅధికారులు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారు. ఇలా తెలుసుకున్న సమాచారం ఆధారంగా.. బెదిరించి రూ.కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లు బీఆర్‌ఎ్‌సకు ఇప్పించుకున్నారన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరుగుతోందని వారు చెబుతున్నారు.


అలా ఎలా నియమించారు?

‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును రిటైర్‌అయిన తర్వాత మళ్లీ అదే సాఽ్ధనంలో ఓఎ్‌సడీగా ఎలా నియమించారు? రిటైరైన అధికారికి ఇంటెలిజెన్స్‌ విభాగం బాధ్యతలు ఎందుకు అప్పగించారు? రాధాకిషన్‌రావు రిటైరైన తర్వాత కూడా ఏళ్ల తరబడి కొనసాగడానికి కారణాలేమిటి? ఇవి పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలా? లేక మీరు చెబితేనే వారు ఆదేశాలిచ్చారా?’’ ..తదితర ప్రశ్నలు కేసీఆర్‌కు సంధించేందుకు సిట్‌ అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. అలాగే.. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ నెంబర్లు మీరే సంతోష్‌ రావు ద్వారా కింది స్ధాయి అధికారులకు పంపించారా? ట్యాపింగ్‌ రికార్డింగ్‌లు మీకు ఏవరి ద్వారా అందేవీ? మీరు విన్నారా? ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు బయటపెట్టిన ఆడియో రికార్డింగ్‌లు మీకు ఏవరు తెచ్చిచ్చారు? అనధికారికంగా వేలాది మంది ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయనే విషయం మీకు తెలుసా?’’ అనే అంశాలపైనా సిట్‌ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2023లో సాధారణ ఎన్నికల్లో తాము ట్యాపింగ్‌ చేశామని, ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీలకు అందే డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేశామని, తనకు అందిన సమాచారం అంతా వీలున్నంత వరకూ ప్రభాకర్‌ రావు ద్వారా పెద్దాయనకు పంపించేవాడినని అప్పట్లో రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించడానికి సిట్‌ ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. కాగా.. కేసీఆర్‌ విచారణ తర్వాత తుదిచార్జీషీట్‌ దాఖలు చేయనున్న క్రమంలో మరోసారి కేటీఆర్‌, హరీశ్‌, సంతో్‌షను సిట్‌విచారించొచ్చని తెలుస్తోంది.


మునిసిపోల్స్‌ బిజీలో ఉన్నా..హాజరు కాలేను

మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంవల్ల విచారణకు హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నానని, విచారణకు మరోతేదీని నిర్ణయించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు. బాధ్యతాయుత పౌరుడిగా విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. కానీ, మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున అభ్యర్థులకు బి-ఫారాలు, ఇతర అధికారపత్రాలు జారీచేయడంలో తాను చాలా బిజీగా ఉన్నానని, అందుకే విచారణకు హాజరు కాలేకపోతున్నానని వివరించారు. తన నివాసం సిద్దిపేట జిల్లా, మర్కూక్‌ మండలం, ఎర్రవల్లి గ్రామంలోని ఇంటి నంబర్‌ 3-96లో ఉందని, అక్కడికే వచ్చి విచారణ జరపాలని ఏసీపీని కోరారు. కేసీఆర్‌ లేఖపై సిట్‌ సానుకూలంగా స్పందించిందని.. విచారణకు మరో తేదీని ఖరారుచేసి సమాచారం ఇవ్వాలని సిట్‌ చీఫ్‌ నిర్ణయించినట్లు సమాచారం.

ఫోన్‌ ట్యాపింగ్‌ నేరస్థులు పర్యవసానాలను ఎదుర్కొంటారా? లేదా?

  • ఈ కేసులో నాన్‌ సీరియ్‌సగా ప్రభుత్వం.. ఎన్నికలున్నందుకే కేసీఆర్‌కు నోటీసులు: కవిత

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నేరస్థులు దాని పర్యవసానాలను ఎదుర్కొంటారా? లేదా? అన్నది వేచి చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్‌ నోటీసు జారీ నేపథ్యంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మునిసిపల్‌ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారని అన్నారు. గుంపు మేస్త్రీ వేసిన సిట్‌ విచారణ నాన్‌ సీరియ్‌సగా జరుగుతోందని పరోక్షంగా సీఎం రేవంత్‌ రెడ్డిని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది కచ్చితంగా బాధాకరమైన అంశమని, ఈ అంశంపై విచారణను పూర్తి చేసి కేసును తుది దశకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది కచ్చితంగా బాధాకరమైన అంశమని, ఈ అంశంపై విచారణను పూర్తి చేసి కేసును తుది దశకు చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో ప్రభుత్వం సీరియ్‌సగా లేదని, ఇందులో వారి ఉద్దేశమేంటో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొందని కవిత విమర్శించారు.

Updated Date - Jan 30 , 2026 | 06:47 AM