Share News

గిరిజన కుంభమేళా మేడారం

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:26 AM

దేశంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర అని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి జువల్‌ ఓరం అన్నారు. గురువారం మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క......

గిరిజన కుంభమేళా మేడారం

  • దేశంలోనే అతి పెద్ద గిరిజన పండుగ

  • గిరిజన సంక్షేమానికి కేంద్రం భారీ నిధులు

  • కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్‌ ఓరం

  • మొక్కులు సమర్పించుకున్న కేంద్రమంత్రి

  • 80 కోట్లతో ములుగులో పర్యాటకం వృద్ధి

  • 890 కోట్లతో గిరిజన వర్సిటీ.. త్వరలోనే ప్రధాని మోదీ భూమి పూజ: కిషన్‌రెడ్డి

వరంగల్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర అని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి జువల్‌ ఓరం అన్నారు. గురువారం మేడారం మహా జాతరలో సమ్మక్క, సారలమ్మలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి ఆయన మొక్కులు చెల్లించారు. అనంతరం విలేకరులతో జువల్‌ ఓరం మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందటే తాను ఇక్కడికి వచ్చానని, మళ్లీ ప్రధాని మోదీ ఆదేశాలతో ఈ పవిత్ర ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందన్నారు. మేడారం ప్రాంత అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించి సహకరిస్తోందని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ తనకు మిత్రుడని, పార్లమెంట్‌లో కలిసి పని చేశామన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. తెలంగాణలో వికారాబాద్‌, ఆదిలాబాద్‌, అచ్చంపేట ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గిరిజన గ్రామాలను ఈ పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. తెలంగాణకు 24 ఏకలవ్య రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేశామన్నారు.


త్వరలోనే గిరిజన వర్సిటీ ప్రారంభం: కిషన్‌రెడ్డి

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర ఏర్పాట్లలో భాగస్వాములైన మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌లతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈసారి జాతరకు కేంద్రం రూ.3.70 కోట్లు కేటాయించిందని తెలిపారు. లక్నవరం, బొగత జలపాతం, మల్లూరు, మేడారం, దామెరవాయిల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం రూ.80 కోట్లు కేటాయించిందన్నారు. మోదీ హయాంలోనే రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని, రామప్ప దేవాలయ అభివృద్ధికి ప్రసాద్‌ స్కీం కింద రూ.140 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. ములుగులో సమ్మక్క, సారలమ్మ పేరుతో ఏర్పాటు చేస్తున్న గిరిజన వర్సిటీకి 890 కోట్ల నిధులు కేటాయించామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. వర్సిటీకి కావాల్సిన భూమిని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, త్వరలోనే ప్రధాని మోదీతో భూమి పూజ చేస్తారని తెలిపారు. మేడారం మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌.. జువల్‌ ఓరంను కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందించారు.

Updated Date - Jan 30 , 2026 | 04:26 AM