ముగ్గురి ప్రాణాలు తీసిన సెప్టిక్ ట్యాంక్
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:15 AM
పొట్టికూటి కోసం హైదరాబాద్ వచ్చి కూలిపనులు చేసుకుంటున్న ముగ్గురు యువకులను ఓ సెప్టిక్ ట్యాంక్ పొట్టన పెట్టుకుంది. ఓ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే క్రమంలో అందులో ఇరుక్కొని మునిగిపోయి మృత్యువాత పడ్డారు.
శుభ్రం చేయడానికి దిగి ఊపిరాడక మృత్యువాత
తొలుత ఓ యువకుడు ఇరుక్కుపోగా.. అతన్ని కాపాడేందుకు మిగిలిన ఇద్దరి విఫలయత్నం
విషవాయువు, దుర్వాసన తీవ్రతతో బయటకు రాలేకపోయిన వైనం
బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన
మృతులు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు
నిజాంపేట్, హైదరాబాద్ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పొట్టికూటి కోసం హైదరాబాద్ వచ్చి కూలిపనులు చేసుకుంటున్న ముగ్గురు యువకులను ఓ సెప్టిక్ ట్యాంక్ పొట్టన పెట్టుకుంది. ఓ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే క్రమంలో అందులో ఇరుక్కొని మునిగిపోయి మృత్యువాత పడ్డారు. హైదరాబాద్, బాచుపల్లి ప్రాంతంలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం జరిగిన ఘటనలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన షణ్ముఖరావు(27), గాజింగి సురేష్ (24), పవన్(21) సెప్టిక్ ట్యాంక్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించి పోలీసులు, స్థానికులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాకవరం గ్రామానికి చెందిన కల్మట షణ్ముఖరావు అలియాస్ సురేష్(27), గాజింగి సురేష్ (24), జలుమూరు మండలం తిలారుకు చెందిన పవన్(21) కుటుంబాలు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చాయి. హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్న వీరు కాంట్రాక్టు పద్ధతిలో కూలి పనులకు వెళుతుంటారు. ఇదే తరహాలో హెచ్‌ఆర్ ఎన్విరో ప్రొడక్షన్ సిస్టమ్స్ నిర్వాహకుడు పలోరప్ప అలియాస్ రవి ద్వారా బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్స్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి మంగళవారం వెళ్లారు. ఉదయం 8 గంటలకు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న వీరు 11 గంటల వరకు నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకు పంపారు. ట్యాంక్‌లో మోకాలిలోతుకు పైగా వ్యర్థాలు పేరుకుపోగా వాటిని తొలగించేందుకు షణ్ముఖరావు లోపలికి దిగాడు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే రక్షించండి అంటూ కేకలు వేశాడు. అక్కడే ఉన్న సురేష్, పవన్ కూడా లోపలికి దిగి షణ్ముఖను బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
కానీ, సెప్టిక్ ట్యాంక్‌లోని విషవాయువులు, దుర్వాసన తీవ్రతకు ముగ్గురూ లోపలే ఇరుక్కుపోయారు. అపార్ట్‌మెంట్‌లో ట్యాంక్ మెయింటెనెన్స్ చూసుకునే సాయిచరణ్ కాసేపటికి అక్కడికి రాగా.. ముగ్గురూ కనిపించలేదు. ట్యాంకు లోపల నుంచి కేకలు వినిపించగా.. అపార్ట్‌మెంట్ వాసులను, ఎన్విరో కంపెనీ ప్రతినిధికి సాయిచరణ్ సమాచారం ఇచ్చాడు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక, హైడ్రా బృందాలు తీవ్రంగా శ్రమించి సెప్టిక్ ట్యాంక్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురిని బయటకు తీశాయి. కానీ ముగ్గురూ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హెచ్‌ఆర్ ఎన్విరో సంస్థ నిర్వాహకుడిపై హత్య కేసు నమోదు చేస్తామని కుత్బుల్లాపూర్ జోన్ ఏసీపీ బాలగంగిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 25 అడుగుల లోతు, 12 అడుగుల వెడల్పు ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి కార్మికులను పంపిన హెచ్ ఆర్ ఎన్విరో సంస్థ కనీస భద్రత చర్యలు పాటించలేదంటూ బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, మృతుల్లో ఒకరైన సురేష్ మంగళవారం ఉదయం 11 గంటలకు సినిమాకు వెళ్లాల్సి ఉంది. కానీ పని ఉందని షణ్ముఖ పిలవడంతో బాచుపల్లి వెళ్లి మృత్యువాత పడ్డాడని కుటుంబసభ్యులు రోధించారు. షణ్ముఖరావుకు రెండేళ్ల క్రితమే పెళ్లయిందని, ఏడాది, ఆరు నెలల వయస్సున్న పిల్లలు ఉన్నారని లబోదిబోమంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
నిబంధనల ప్రకారం దేశంలో సివరేజ్ పైపులైన్లు, సెప్టిక్ ట్యాంకులను యంత్రాలతోనే శుభ్రం చేయాలి. మనుషులు నేరుగా దిగకూడదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మనిషిని లోపలికి పంపించాల్సి వస్తే ముందుగా సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి. మనిషిని లోపలికి దింపేటప్పుడు ఆక్సిజన్ మాస్కు, గ్యాస్ డిటెక్టర్, ఇతర రక్షణ పరికరాలు తప్పనిసరి. నిషేధాన్ని ఉల్లంఘించి కార్మికులను నేరుగా దించి శుభ్రం చేయిస్తే బాధ్యులకు చట్టప్రకారం జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News