రైతు బీమా బంద్!
ABN , Publish Date - Aug 15 , 2026 | 07:56 AM
రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
నిన్నటితో ముగిసిన రెన్యువల్ గడువు.. ప్రీమియం చెల్లించని ప్రభుత్వం
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నేపథ్యంలో నిర్ణయం
నవంబరు 19 నుంచి ఇందిరమ్మ బీమా.. రైతులతోపాటు అన్ని కుటుంబాలకూ వర్తింపు!
హైదరాబాద్: రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన బీమా రెన్యువల్ కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. దీంతో ఇక ఆ పథకం నిలిచిపోయినట్లేనని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా రైతులతోపాటు అన్ని కుటుంబాలకు జీవితబీమాను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే, రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రైతు బీమా పథకం ఎనిమిదేళ్లుగా అమలవుతోంది. ఏటా ఆగస్టు 14వ తేదీన రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది. ఎల్‌ఐసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఎంతో కొంత వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులను ఈ పథకంలో చేర్చారు. 18-59 ఏళ్ల వయసున్న రైతులు సహజ మరణం చెందినా, ప్రమాదవశాత్తు చనిపోయినా రైతు కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లిస్తున్నారు.
ఈ పథకంలో 42.16 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. ఏటా సగటున రూ.1400 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బీమా గడువు శుక్రవారంతో ముగిసింది. 2026-27 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు. 2018లో రైతుబీమా పథకం ప్రారంభం కాగా.. 2018-19లో 17,747 మంది, 2019-20లో 19,063 మంది, 2020-21లో 29,163 మంది, 2021-22లో 23,393 మంది, 2022-23లో 23,555 మంది, 2023-24లో 26 వేల మంది, 2024-25లో 26,089 మంది, 2025-26లో 21,353 మంది రైతులు మరణించారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రైతుబీమా ఆర్థిక సాయం లభించింది.
ఇందిరమ్మ కుటుంబ బీమాకు 4 వేల కోట్లు
రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సరికొత్త బీమా పథకాన్ని అమలు చేస్తామని గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించింది. 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ.4 వేల కోట్ల నిధుల కేటాయింపులు జరిపింది. ఈ ఏడాది జూన్ రెండో తేదీ నుంచి ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని పేర్కొన్నప్పటికీ.. ప్రారంభం కాలేదు. ఇటీవల జనగామ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించిన సందర్భంగా.. నవంబరు 19వ తేదీన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక, వివరాల నమోదు కోసం ఇంటింటి సర్వే చేపడతామన్నారు. కుటుంబ యజమానికి లేదా ఇంటి బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తికి రూ.5 లక్షలు బీమా చేస్తామని ప్రకటించారు.
ఆ కుటుంబాలకు ఆసరా కోసం..
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ కింద.. ఇంటి యజమాని మరణించిన కుటుంబానికి బీమా సొమ్ము చెల్లిస్తారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే... పిల్లల చదువులు ఆగిపోవటం, రోజువారీ ఖర్చులకు ఇబ్బందులు కలగటం వంటి సమస్యలతో ఆ కుటుంబం చితికిపోకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడితేనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఇది అమలు కావటానికి ఇంకా 3 నెలల వ్యవధి ఉన్నందున.. ఈ మధ్య కాలంలో మరణించే రైతుల కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతు బీమా పథకం నిలిచిపోయిన నేపథ్యంలో ఆయా కుటుంబాలకు సొమ్ము లభించే అవకాశం లేదు. దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?
సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ
Read Latest AP News And Telangana News And International News And Telugu News