Share News

శ్రీశైలానికి ఆగిన వరద..

ABN , Publish Date - Aug 15 , 2026 | 07:34 AM

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 20,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సాయంత్రం ఆరు గంటలకు సంపూర్తిగా ఆగిపోయింది.

శ్రీశైలానికి ఆగిన వరద..

ఆలమట్టి, నారాయణపూర్‌ నుంచి దిగువకు నామమాత్రపు ప్రవాహం

తుంగభద్ర ఎల్‌ఎల్‌సీకి కర్ణాటక రైతుల అడ్డుకట్ట

కర్నూలు/అమరావతి, (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 20,269 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. సాయంత్రం ఆరు గంటలకు సంపూర్తిగా ఆగిపోయింది. చుక్క నీరు కూడా రావడం లేదు. ఎగువన వర్షాలు ఆగిపోవడంతో.. ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు వరద తగ్గింది. దీంతో దిగువకు నామమాత్రంగా నీరు విడుదలవుతోంది. ప్రవాహం పెద్దగా లేకపోవడంతో జూరాల గేట్లు మూసివేశారు. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. 179.8995 టీఎంసీలకు పడిపోయింది. ఉదయం ఏపీ ప్రభుత్వం కుడిగట్టు విద్యుత్కేంద్రంలో ఉత్పత్తి ద్వారా 7,902 క్యూసెక్కులు, తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు కేంద్రంలో ఉత్పత్తి ద్వారా 39,631 క్యూసెక్కులు వినియోగించి దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశాయి.


సాయంత్రానికి ఏపీ ప్రభుత్వం విద్యుదుత్పత్తిని నిలిపివేయగా.. తెలంగాణ కొనసాగిస్తోంది. 40,023 క్యూసెక్కులు వినియోగిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో తాగునీటి కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 10 వేలు, హంద్రీ-నీవా కాలువ, కేసీ కెనాల్‌కు 3,370 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటోంది. తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తోంది. వరద లేకపోయినా 55,770 క్యూసెక్కులు వాడేస్తుండడంతో డ్యాంలో నీటి నిల్వ 185.563 టీఎంసీల నుంచి 179.899 టీఎంసీలకు తగ్గిపోయింది. తుంగభద్ర డ్యాంకు 27,897 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలో 89.442 టీఎంసీలున్నాయి.

కర్ణాటకలోని కాలువలకు 4,665 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ గరిష్ఠ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 154.989 టీఎంసీల నిల్వ ఉంది. డ్యాంలోకి 53,239 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు గరిష్ఠ సామర్థ్యం 45.77 టీఎంసీలకుగాను 28.676 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదు. లీకుల ద్వారా 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. ప్రకాశం బ్యారేజీ గరిష్ఠ సామర్థ్యం 3.071 టీఎంసీలు కాగా.. పూర్తి నిల్వలున్నాయి. బ్యారేజీలోకి వస్తున్న 6140 క్యూసెక్కులనూ కిందకు వదిలేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ముంబై రైలా మజాకా.. కొరియా వ్యక్తికి చుక్కలు కనిపించాయిగా..

ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. రైలు ఎక్కుతుండగా..

Updated Date - Aug 15 , 2026 | 08:41 AM