Share News

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

ABN , Publish Date - Aug 15 , 2026 | 07:24 AM

సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం
Ganja, Students, Hyderabad

  • ఉద్యోగాల పేరుతో గ్రామీణ యువతుల్ని తీసుకొచ్చి లైంగిక వేధింపులు

  • మహిళల పేరుపై బ్యాంకు ఖాతాలు, సిమ్‌లు.. వాటి ద్వారానే వ్యాపారం

  • ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు వెలుగులోకి..

  • గంజాయి ముఠాతో దోస్తీ చేసిన పోలీసులపై ఉన్నతాధికారుల చర్యలు

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ బాలానగర్‌లోని వినాయక్‌నగర్‌ శ్మశానవాటిక సమీపంలోని బొల్లా కిరణ్‌ గంజాయి స్థావరంపై దాడులు చేసిన ఈగల్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను విశ్లేషించి వేర్వేరు ప్రాంతాలకు చెందిన 203 మంది కాంటాక్ట్‌లను గుర్తించారు. విద్యార్థులు, వ్యాపారవేత్తలే టార్గెట్‌గా గంజాయి వ్యాపారం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.


ఒడిశా నుంచి ప్రతిరోజు 30కి పైగా గంజాయి పార్సిళ్లు వచ్చేవని.. వాటిని బొల్లా బ్రదర్స్‌, ఇతర ముఠా సభ్యులు తీసుకుని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డెడ్‌ డ్రాప్‌ పద్ధతి (ప్రత్యక్షంగా కలవకుండా)లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. బొల్లా కిరణ్‌ గతంలో వరంగల్‌ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో విడిపోయి వరంగల్‌కు చెందిన మరో మహిళతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మాజీ భార్య తిరిగి కిరణ్‌ వద్దకు చేరుకున్నట్లు సమాచారం.


అయితే వరంగల్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర మారుమూల ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని మరీ ముఖ్యంగా మైనర్‌ బాలికల్ని ఉద్యోగం పేరుతో హైదరాబాద్‌కు తీసుకువచ్చి కిరణ్‌ ముఠా లైంగికంగా వేధించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు గర్భం దాల్చిన సమయంలో ఆస్పత్రులకు తీసుకెళ్లకుండా ప్రమాదకర రీతిలో అబార్షన్లు చేయించినట్లు తెలిసింది. గంజాయి వ్యాపారానికి మహిళల పేరుతో సిమ్‌ కార్డులు తీసుకుని వాటితోనే కస్టమర్లకు కాంటాక్ట్‌లో ఉన్నట్లు తేలింది. మహిళల పేరుతో బ్యాంకు ఖాతాలు, యూపీఐ చెల్లింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.


బొల్లా బ్రదర్స్‌ రోజుకు 25 మందికి గంజాయి అమ్మకాలు జరిపినట్లు ఆధారాలు సేకరించారు. సోదాల సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కాళ్లకు గాయాలైన బొల్లా కిరణ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు మిగతా వారిని అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఒడిశాతో పాటు ఇతర రాష్ట్రాలకు ఈ కేసుతో లింకులు ఉండటం, ఇప్పటికే 100 మందికి నిర్వహించిన డ్రగ్స్‌ పరీక్షల్లో 70 మందికిపైగా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఇక బొల్లా బ్రదర్స్‌ పక్కా ప్లాన్‌ ప్రకారం స్థానిక పోలీసుల్ని మచ్చిక చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులకు తరుచూ పార్టీలు ఇస్తూ ఆయా కేసుల్లో ఇతర ప్రాంతాలు,


రాష్ట్రాల నుంచి నిందితుల్ని పట్టుకొచ్చేందుకు వెళ్లే సమయంలో తమ కారును ఇచ్చి పంపించేవారు. పోలీసు సిబ్బంది ప్రైవేటుగా చేసుకునే పార్టీలకు బొల్లా బ్రదర్స్‌ క్యాటరింగ్‌ కూడా సమకూర్చేవారు. ముందు గదిలో పోలీసులకు పార్టీ ఇస్తూనే వెనుక గదిలో గంజాయి నిల్వలు ఉంచి అక్కడి నుంచే వ్యాపారం చేసినట్లు తేలింది. ఈగల్‌ ఫోర్స్‌ దాడులకు కొద్ది గంటల ముందు అక్కడ స్థానిక పోలీసుల్లో కొందరు పార్టీ చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈగల్‌ దాడులకు సంబంధించి వారికి ముందస్తుగా సమాచారం చేరవేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. బొల్లా బ్రదర్స్‌తో అంటకాగినట్లు ఆరోపణలున్న ఓ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?

సింగరేణిలో మారనున్న ’గుర్తింపు’ ప్రక్రియ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 07:24 AM