Share News

వివాదాల్లేని భూములను.. 22ఏ నుంచి తొలగిస్తాం

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:12 AM

వివాదాల్లేని ఆస్తులు/భూములు నిషేధిత జాబితా (22ఏ)లో ఉంటే.. వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు, రిజిస్ట్రార్‌లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని రెవె న్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

వివాదాల్లేని భూములను.. 22ఏ నుంచి తొలగిస్తాం

  • జిల్లా కలెక్టర్లకు, రిజిస్ట్రార్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం

  • ఎవరి భూమి ఎక్కడికీ పోదు.. ఆందోళన వద్దు

  • క్యూర్‌ పరిధిలో ఈవీలుగా ఆటోల మార్పు

  • ఆటోకు రూ.లక్షన్నర సబ్సిడీ.. 200 కోట్లతో పథకం

  • నేడు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ

  • ఏడు రకాల సన్నవడ్లకు రూ.500 బోనస్‌ చెల్లింపు

  • హిల్ట్‌ పాలసీ దరఖాస్తులకు మరో 3 నెలల గడువు

  • మరో 7 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా స్కూళ్లు

  • క్యాబినెట్‌ భేటీ నిర్ణయాలను వెల్లడించిన పొంగులేటి

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): వివాదాల్లేని ఆస్తులు/భూములు నిషేధిత జాబితా (22ఏ)లో ఉంటే.. వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు, రిజిస్ట్రార్‌లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని రెవె న్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భూములు/స్థలాలు కాకపోతే, ఆ భూములపై న్యాయస్థానాల్లో వివాదాలు లేకపోతే.. వాటిని నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలకు అనుమతించాల్సిందిగా నిర్దేశించామన్నారు. ఒక్క అంగుళం భూమి కూడా ఎక్కడికీ పోదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. 22ఏ జాబితాకు సంబంధించి ఏదైనా అంశం మీడియా దృష్టికి వస్తే.. తన నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించాలని, గంటలోపే స్పందిస్తానని అన్నారు. ఇప్పటికే కోర్‌ ఏరియా పరిధిలోని 46 మంది సబ్‌ రిజిస్ట్రార్‌లను ఆదేశాలు ఇచ్చామన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి మీడియాకు వివరించారు. స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ, క్యూర్‌ పరిధిలో ఆటోలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడం, సన్నవడ్లకు బోనస్‌ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.


పంద్రాగస్టు రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.43 లక్షల కుటుంబాలకు ఏకకాలంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గతేడాది డిసెంబరులో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ‘తెలంగాణ ఇన్వెస్‌మెంట్ థీమ్‌’తో సమ్మిట్‌ 2.0ను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయుంచినట్లు వెల్లడించారు. దీనికోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంతులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వివేక్‌లతో ఉపసంఘంతోపాటు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 2047 విజన్‌ను ఆవిష్కరించినట్లే.. రక్షణ, ఏరోస్పేస్‌, ఫార్మా రంగంలో పెట్టుబడుల స్వీకరణకు వీలుగా దీనిపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో తెలంగాణ స్టార్ట్‌పలు, పరిశ్రమలు సాధించిన విజయాలు, కొత్త ఆవిష్కరణలకు సంబంధించి ఎగ్జిబిషన్‌, స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.


ఏడ రకాల సన్నాలకు బోనస్‌..

మద్దతు ధరతోపాటు బోనస్‌ ఇచ్చేందుకు ఏడు సన్నవడ్ల రకాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ‘‘దీనికోసం ఇప్పటికే రైతాంగానికి విత్తనాలు కూడా సరఫరా చేశాం. ఏడు వడ్ల రకాలను వ్యవసాయ శాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకున్న వారినుంచి ఆయా రకాలను సేకరించేందుకు మద్దతు ధరతోపాటు బోనస్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఆ ఏడు రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు రకాల సన్నాలకే రూ.500 బోనస్‌ చెల్లించాలని తీర్మానించింది’’ అని పొంగులేటి వెల్లడించారు. యాసంగి ధాన్యం ేసకరణలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. ఇందులో 63.62 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందని, మిగతా 17.54 లక్షల టన్నులను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని అన్నారు. క్వింటాలుకు రూ.2,389 కనీస ధరగా నిర్ణయించి.. విక్రయించాలని నిర్ణయించిందన్నారు.


మరో ఏడు నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా స్కూళ్లు

రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిఽధిలోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సాంకేతిక విద్యాశాఖ నుంచి వర్సిటీ కిందికి తెస్తామని, వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ(కార్మిక శాఖ) పరిధిలోకి విలీనం చేేసందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అన్నారు. రాష్ట్రంలోని 113 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు ఏర్పాటు చేయనుండగా.. వీటిలో 86 చోట్ల ఇప్పటికే స్కూళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌, బోధ్‌, సిర్పూర్‌, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాలకు కొత్తగా స్కూళ్లను మంజూరు చేయాలని మంతివర్గంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి స్కూలుకు రూ.200 కోట్లు వెచ్చించి, నిర్మాణం చేపట్టనున్నట్లు, 3500 మంది చొప్పున విద్యార్థుల కోసం పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కూళ్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్‌ భేటీలో నిర్ణయించినట్లు వెల్లడించారు.


ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చుకునేందుకు సబ్సిడీ

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి, హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చేందుకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. క్యూర్‌ పరిధిలో డీజిల్‌, పెట్రోల్‌తో 18,766 ఆటోలు నడుస్తున్నాయని, వీటిని ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చడానికి వీలుగా రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ర్టిక్‌ కన్వర్షన్‌ స్కీమ్‌) అమలుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్‌ కిట్‌ అమర్చుకోవడం లేదా పాత వాహనాన్ని స్ర్కాప్‌ చేసి కొత్త విద్యుత్‌ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం అవకాశం ఇవ్వనుందన్నారు. ఇక ఔటర్‌ రింగు రోడ్డు లోపల ఉన్న 21 పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల భూములను క్రమబద్ధీకరించి, ఆయా పరిశ్రమలను ఔటర్‌ ఆవలికి తరలించడానికి వీలుగా ప్రభుత్వం తెచ్చిన హిల్ట్‌ పాలసీ కింద దరఖాస్తు చేసుకునే గడువును మరో మూడు నెలలు అక్టోబరు 31 దాకా పొడిగించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. మక్తల్‌-నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం రెండో దశలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి రూ.2100 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను చేపట్టడానికి పరిపాలన అనుమతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గూడెం దొడ్డిలో పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీని నియమించుకోవడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు.

Updated Date - Aug 15 , 2026 | 06:09 AM