Share News

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం

ABN , Publish Date - Aug 15 , 2026 | 06:44 AM

విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీలు నిర్మూలిస్తాం
President Droupadi Murmu

  • విద్యార్థులే భావి భారత నిర్మాతలు.. స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ముర్ము

  • రాష్ట్రపతి ప్రసంగానికి ముందు, తర్వాత ‘వందేమాతరం’ ఆలాపన

న్యూఢిల్లీ: విద్యార్థులే భావి భారత నిర్మాతలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించేందుకు, పరీక్షల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని తెలిపారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి శుక్రవారం ప్రసంగించారు. మహాత్మా గాంధీ, సర్దార్‌పటేల్‌, అంబేడ్కర్‌ తదితర స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.


స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి, విద్యార్థులు, దేశ భవిష్యత్తు, మహిళా సాధికారిత, సాంకేతిక పురోగతి, జాతీయ భద్రత, వికసిత్‌ భారత్‌ తదితర అంశాలపై ఆమె మాట్లాడారు. పబ్లిక్‌ పరీక్షల నిర్వహణలో అవకతవకలు లేకుండా చేసేందుకు, పరీక్షల వ్యవస్థలో విశ్వసనీయతను పెంచేందుకు ప్రభుత్వ సంస్కరణలు చేపట్టిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా జెన్‌జీ ఇటీవల చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


యువత వల్ల దేశంలో బలమైన స్టార్టప్‌ వ్యవస్థ ఏర్పాటైందని, భారత యువశక్తిని చూసి అంతర్జాతీయ సంస్థలు ఆశ్చర్యపోతున్నాయని తెలిపారు. ఉగ్రవాదంపై పోరు అంశంలో ఆపరేషన్‌ సిందూర్‌ భారత శక్తి, సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందని, ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి మద్దుతిచ్చే వారికి బలమైన హెచ్చరికలు పంపిందని చెప్పారు. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం జాతీయ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న అత్యంత వ్యూహాత్మక చర్య అని రాష్ట్రపతి అభివర్ణించారు.


నకల్సిజం నిర్మూలన అనేది దేశం సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు వేగంతో భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని, దశాబ్ద కాలంలో 22 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టేందుకు ప్రతీ పౌరుడి భాగస్వామ్యం అవసరమని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు రాసిన ‘ దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’’ అనే సందేశాన్ని ప్రస్తావించారు.


అలాగే, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై మాట్లాడుతుండగా పండిత్‌ రఘునాథ్‌ ముర్ము సంతాళి భాషలో రాసిన ‘ ఏక్‌ పేడ్‌ మా కీ నామ్‌’ అనే కవితను ప్రస్తావించారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ముందు, తర్వాత వందేమాతం గేయాన్ని తొలిసారి పూర్తిగా ఆలపించారు. ఇక, రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలారాష్ట్రపతి సందేశం ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాజకీయ యుద్ధాలకు కోర్టులా?

రాహుల్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 06:44 AM