రాజకీయ యుద్ధాలకు కోర్టులా?
ABN , Publish Date - Aug 15 , 2026 | 06:16 AM
రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని..
ఆళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
ఏ రైతూ కోర్టుకు ఎందుకు రాలేదు?.. పరిహారం కోసం వారు పిటిషన్ వేశారా?
ఓ పార్టీ వ్యక్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు.. సమీకరణ అంటే సివిల్ కేసు కదా
క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధం.. దురుద్దేశంతోనే ‘అమరావతి’పై కేసు
నిజమైన బాధితులు వస్తే న్యాయం చేస్తాం.. అమరావతి భూసమీకరణ కేసు కొట్టివేత
చంద్రబాబు, నారాయణలకు ఊరట.. హైకోర్టు తీర్పును సమర్థించిన సీజేఐ బెంచ్
‘‘రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులను వాడుకోవద్దు. నిజమైన బాధితులు (రైతులు) కోర్టుకు వస్తే చట్టం ప్రకారం న్యాయం జరుగుతుంది. కానీ రాజకీయ నేతలు ప్రజా ప్రయోజనం పేరుతో తమ రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేయడం తప్పు.’’
‘‘ఒక్క రైతు అయినా నేరుగా ముందుకు వచ్చి నష్టపరిహారం కావాలని కోర్టులో పిటిషన్ వేశారా? ఫిర్యాదు చేశారా? ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తే ఎస్సీ/ఎస్టీ రైతుల పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు తప్ప, ఒక్క రైతుగానీ, సామాజిక వర్గం వ్యక్తిగానీ నేరుగా ముందుకు రాలేదు.’’
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి కోసం భూసమీకరణలో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే పోరాటాలకు న్యాయస్థానాలను వాడుకోవడం సరికాదని హితబోధ చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ‘‘అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ప్రధాన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ప్రధాన కేసు వీగిపోయిన తర్వాత, పబ్లిక్ డ్యూటీకి సంబంధించిన సెక్షన్ 166 వంటి తక్కువ స్థాయి నేరాల అభియోగాలతో మళ్లీ విచారణను కోరడం సహేతుకం కాదు.
కేవలం రాజకీయ ప్రత్యర్థులు ఇచ్చిన ఫిర్యాదుతో దాఖలైన కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణం కోసం 2016లో రైతుల నుంచి వ్యవసాయ భూములను సేకరించేందుకు ఏపీ ప్రభుత్వం భూసమీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. భూమి ఇచ్చిన రైతులకు ఎకరానికి 1,000 చదరపు గజాల చొప్పున నివాస స్థలం, 250 చదరపు గజాల చొప్పున వాణిజ్య స్థలం అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. రికార్డుల ప్రకారం 25 గ్రామాల్లోని 27,181 మంది భూ యజమానులు 35,215 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే, ఇందులో అక్రమాలు జరిగాయంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 2021 మార్చి 12న సీఐడీ అవినీతి నిరోధక చట్టం కింద చంద్రబాబు, నారాయణలపై కేసు నమోదు చేసింది. అసైన్డ్ భూములకు కూడా ల్యాండ్ పూలింగ్ లబ్ధి వర్తించేలా ప్రభుత్వం నిబంధనలను అక్రమంగా సవరించిందని, దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులు, ఆక్రమణదారులకు మేలు జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బలహీన వర్గాలు (ఎస్సీ, ఎస్టీ), పేద రైతులకు అన్యాయం చేసి, మధ్యవర్తులు ప్రయోజనం పొందేలా ఒత్తిడికి గురిచేశారని ఆరోపించారు. అయితే, ఏపీ హైకోర్టు చంద్రబాబు, నారాయణలపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. సీఐడీ నమోదు చేసిన కేసును రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు తీర్పు ఇచ్చారు. ‘‘ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, జీవోలను క్రిమినల్ కుట్రగా పరిగణించడం రాజ్యాంగబద్ధంగా నిలవదు. శాసనసభ ఆమోదం పొందిన నిర్ణయాలను రాజకీయ కక్ష సాధింపుతో కేసుగా మార్చారు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 31న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వీ.మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
సమీకరణ కోసమే ‘శివాయ్ జమ’ క్యాటగిరీ: ఆళ్ల
భూసమీకరణ కోసమే ప్రత్యేకంగా ‘శివాయ్ జమ’ అనే క్యాటగిరీని ప్రవేశపెట్టారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, రంజిత్ కుమార్ వాదించారు. ‘‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 482 కింద హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించి కేసును కొట్టివేయడం చట్టవిరుద్ధం. అసైన్ ్డ భూములకు సంబంధించి జీవో నంబర్ 41 ద్వారా నిబంధనలు సవరించి పైవ్రేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. దీనివల్ల అసైన్ ్డ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయి. తొలుత పథకం ప్రకారం....అసెన్డ్ భూములకు పరిహారం లేదని ప్రచారం చేశారు. ఇదే అదనుగా అమాయకులు, ఎస్సీ, ఎస్టీ, పేదల దగ్గర భూములను బలవంతంగా కొనుగోలు చేశారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు స్వయంగా ఎంతో స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు. ‘నేను చెప్పిందే చట్టం, మీరు నా ఆదేశాలను పాటించాలి.’ అని హెచ్చరించినట్లు వాంగ్మూలంలో ఉంది. కలెక్టర్ ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌లో ప్రపోజల్ పంపమని తనపై ఒత్తిడి తెచ్చారని స్పష్టంగా పేర్కొన్నారు. జీవో 41ని క్యాబినెట్ ముందు ఉంచలేదు. ఒక సబ్ క్యాటగిరీని సృష్టించి దానిని దుర్వినియోగం చేశారు.’’ అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇది 25 వేల మంది రైతులకు చెందిన దాదాపు 30 వేల ఎకరాల భూమితో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భూసమీకరణ విధానంలో మార్పుల వల్ల ఎవరికైనా లాభనష్టాలు జరిగితే అది కేవలం సివిల్ వివాదం అవుతుంది. ఒకవేళ నిజంగానే ఎవరికైనా నష్టం జరిగి ఉంటే, ఆ బాధితులే నేరుగా కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఈ కేసు నమోదు చేయడం వెనుక వ్యక్తిగత కక్ష లేకపోవచ్చు, కానీ చట్టపరంగా చూస్తే ఇది దురుద్దేశంతో చేసినట్లే కనిపిస్తోంది. కేవలం ఎవరో ఒకరు ఫిర్యాదు చేశారనే ఒకే ఒక్క కారణంతో కేసులు నమోదు చేసుకుంటూ పోవడం దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించింది.
రైతుల రక్షణకు మద్దతుగా ఉంటాం..
రైతుల సంక్షేమం, వారి హక్కుల రక్షణ విషయంలో మేం పూర్తి మద్దతుగా ఉంటామని, వారికి రావలసిన ప్రయోజనాలను తప్పకుండా కాపాడతామని సీజేఐ స్పష్టం చేశారు. ‘‘భూసమీకరణ విధానంలో మార్పుల వల్ల రైతులు ఎవరైనా నష్టపోయి ఉంటే, అది సివిల్ వివాదం కిందకు వస్తుంది. నష్టపోయిన రైతులు నేరుగా కోర్టులను ఆశ్రయించవచ్చు. రైతులు వ్యక్తిగతంగా దాఖలు చేసిన సివిల్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయా’’ అని ధర్మాసనం ఆరా తీసింది. వాటన్నింటిని ఆయా కోర్టులు స్వతంత్రంగా విచారించుకోవచ్చని వెల్లడించింది. ఏపీ హైకోర్టు తీర్పు... వ్యక్తిగత కేసులపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. కాగా, కేసులో ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పుడు, ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందినవారనే ఒక్క కారణంతో కేసును కొట్టివేయకూడదని సింఘ్వీ వాదించారు. ఫిర్యాదుదారుడి వ్యక్తిగత వివరాల కంటే, ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకే ప్రాధాన్యమివ్వాలన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.