మున్ముందు భారీ ఉద్యమాలు
ABN , Publish Date - Aug 15 , 2026 | 05:29 AM
దేశంలో ముందుముందు జెన్‌జీ భారీ ఉద్యమాలు నిర్వహిస్తుందని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. అయితే, వారి ఉద్యమాలకు సీజేపీ ఒక్కటే వేదిక కాదని, ఎవరి దారిలో వారు ఉద్యమాలు చేస్తారని అన్నారు.
జెన్‌జీకి సీజేపీ ఒక్కటే వేదిక కాదు.. సమస్యలపై ఎవరి పోరాటం వారిదే..
ప్రజల్లో భయం పోగొట్టాం.. ఇక అందరూ ప్రశ్నిస్తారు
నాపై పోలీసులు నిత్యం నిఘా పెడుతున్నారు: అభిజీత్ దీప్కే
ముంబై, ఆగస్టు 14: దేశంలో ముందుముందు జెన్‌జీ భారీ ఉద్యమాలు నిర్వహిస్తుందని కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. అయితే, వారి ఉద్యమాలకు సీజేపీ ఒక్కటే వేదిక కాదని, ఎవరి దారిలో వారు ఉద్యమాలు చేస్తారని అన్నారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో గత నెలలో తాము నిర్వహించిన ఉద్యమం ద్వారా దేశ ప్రజల్లో గత పదేళ్లుగా ఉన్న భయాన్ని తొలగించామని, ఇకపై ప్రజలంతా తమ సమస్యలపై గళమెత్తుతారని తెలిపారు. ప్రస్తుతం అనేకచోట్ల యువత తమ సమస్యలపై స్వయంగా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. ఝార్ఖండ్ వంటి చోట్ల జెన్ ఆల్ఫా కూడా పాఠశాలల కోసం ఉద్యమించిందని వెల్లడించారు. ఝార్ఖండ్‌లో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి తాము మద్దతు తెలిపామన్నారు. ప్రజలు ఏ ఒక్క వ్యక్తినీ రాత్రికి రాత్రి హీరోను చేయడం మంచిది కాదని.. తమకు ఎవరో వచ్చి సాయం చేస్తారన్న భావనను వదిలేయాలని సూచించారు. సీజేపీని రాజకీయ పార్టీగా మార్చబోమని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పెద్దపెద్ద పార్టీలే మనుగడ కోసం పోరాడుతున్నాయన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి.. సీబీఐ, ఈడీలతో బెదిరించి పార్టీలు మారేలా చేస్తున్నారని.. ఆ ట్రాప్‌లో తాము పడబోమని స్పష్టంచేశారు. సీజేపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పోలీసులు తనపై నిఘా పెట్టారని ఆరోపించారు.