Share News

తాయిలాలు సమర్పయామి..!

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:51 AM

ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే.....

తాయిలాలు సమర్పయామి..!

  • పురపాలిక ఎన్నికల ‘పంపకాలు’ పూర్తి

  • ఓటర్లకు చీర, సారె, భరిణెలు, క్వార్టర్‌ సీసాలు, నగదు

  • ఓటుకు సగటున రూ.1,000-2,500 వరకు..

  • మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులైతే రూ.5 వేలకు పైనే

  • పాశమైలారం, రంగారెడ్డిలో ఓటుకు రూ.50 వేలు

  • డబ్బుల పంపిణీ.. మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్డగింత

  • అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్‌ వాహనాలపై రాళ్ల దాడి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌): ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే..!! రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు! చీర, సారె, కుంకుమ భరిణెలు, కుక్కర్లు, వంటసామగ్రి, మద్యం, మాంసం, నగదు.. ఇలా దేన్నీ వదల్లేదు! ఖర్చుకు వెనకాడలేదు. గెలుపే లక్ష్యంగా పంపిణీ చేసేస్తున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పంపకాల సందడి నెలకొంది. ఒక్కో ఓటుకు రూ.1000-2500 పంపిణీ జరగ్గా.. మేయర్‌, ఛైర్మన్‌ అభ్యర్థులైతే రూ.5 వేల నుంచి ఆపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.50 వేల వరకూ పంచడం గమనార్హం. సంగారెడ్డిలోని పాశమైలారం పరిధిలో ఓ అభ్యర్థి ఓటు కోసం రూ.30-50 వేల వరకు పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలన్నీ పోటీపడి మరీ ఓటర్లకు డబ్బు పంచుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అభ్యర్థులు ఇంటింటికీ డబ్బులు పంపిణీ చేసేశారు. ఎవరికి వారు తగ్గేదే లేదన్నట్లుగా ఓటుకు నోటు విలువను పెంచుకుంటూ పోయారు. ఓటర్లు కూడా అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు! ప్రతిష్ఠాత్మకంగా ఉన్న స్థానాల్లో అయితే డబ్బులు వెదజల్లారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో బరిలోకి దిగినవారు సైతం గెలవాల్సిందేనన్న పట్టుదలతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. మంగళవారం రాత్రి కీలకమైన ఓట్లు, తటస్థంగా ఉన్నవారి ఓట్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ ఓటర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. తాయిలాలు సమర్పించుకుంటూనే.. ‘మీ వాడినే.. మీతోనే ఉంటున్నా.. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. ఎన్నికల్లో నన్ను గెలిపించండి’ అంటూ అభ్యర్థులు ఓటర్లను వేడుకుంటున్నారు. ఇక పోటీలో ఉన్న కొంతమంది తమ ఆస్తులు, నగలు తాకట్టు పెట్టడం, అమ్మేయడంతో పాటు అందినకాడికి అప్పులు తీసుకొచ్చి మరీ ఓటర్లకు పంపిణీ చేయడం గమనార్హం. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు సమర్పించేసుకున్నారు.


రాత్రి వేళ ఎన్నికల సందడి..

కార్పొరేషన్‌, మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే ఎన్నికల సందడి మొదలైంది. ఓట్లు తమకే పడేలా పార్టీలు, అభ్యర్థులు వ్యూహాలు రచించారు. పురపాలికల పరిధుల్లో ఉన్న అపార్ట్‌మెంట్లు, కాలనీలు, శివారు ప్రాంతాల్లో పంపిణీ ప్రక్రియ జోరుగా నడిచింది. ఒక్క ఓటు కూడా జారిపోకుండా ఉండేలా పకడ్బందీగా ఈ తతంగాన్ని నడిపారు. మరోవైపు తమ బూత్‌ పరిధిలోని ఓటరు ఎక్కడున్నా సరే పోలింగ్‌ కేంద్రానికి రప్పించేలా ప్రయత్నాలు చేశారు. కొంతమందిని తీసుకురావడం కోసం ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తుండగా, యువత కోసం ‘స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ’లు అందించారు.

పంచుడే పంచుడు..

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌లోని ఏదులాపురం మునిసిపాలిటీ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయింది. ఇక్కడ సోమవారం నుంచి అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రలోభాలకు తెరలేపాయి. కాంగ్రెస్‌ రూ.3 వేలు, బీఆర్‌ఎస్‌ రూ.2 వేలు, సీపీఐ రూ.2 వేలు చొప్పున ఓటర్లకు నగదును పంచాయి. ఇక్కడ ఛైర్మన్‌ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో అంతా ఇదే మొత్తంలో పంపిణీ చేశారు. గుర్రాలపాడులో కాంగ్రెస్‌ అభ్యర్థి రూ.5 వేలు ఇవ్వగా, పెద్దతండాలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.4 వేల చొప్పున పంచారని తెలిసింది. వైరా మునిసిపాలిటీలోనూ రూ.1000 ఇవ్వగా, 5 వార్డుల్లో మాత్రం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు రూ.5 వేల చొప్పున ఇచ్చాయి. సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో కొన్ని వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య గట్టి పోటీ ఉండడంతో ఇక్కడ పంపకాల్లోనూ పోటాపోటీ ఏర్పడింది. 2వ వార్డు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సల తరఫున ఓటుకు రూ.7 వేల చొప్పున పంపిణీ చేశారు. వీటికి అదనంగా మద్యం, మాంసం అందించారు. ఇక నిజామాబాద్‌లో మేయర్‌ అభ్యర్థిగా భావిస్తున్న ఓ వ్యక్తి ఓటుకు రూ.5 వేలకు పైగా పంపిణీ చేశారు. కామారెడ్డిలో ఒక్కో ఓటుకు రూ.1500-2500 వరకు పంపిణీ చేస్తుండగా, డిమాండ్‌ చేసినచోట ఇంతకంటే ఎక్కుగానే సమర్పించుకుంటున్నట్లు తెలిసింది. కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోనూ ఒక్కో ఓటుకు రూ.2-4 వేల వరకు పంపిణీ చేశారని సమాచారం. సంగారెడ్డి మునిసిపల్‌ ఏరియాలోని పాశమైలారంలో ఓ అభ్యర్థి ఓటుకు రూ.30-50 వేల వరకు ఇవ్వడంతో ఇక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందనేది అర్ధమవుతోంది. ఇక ఇస్నాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలో ఓటుకు రూ.30-50 వేలు చొప్పున పంచగా, చిట్కుల్‌లో రూ.5-10 వేల వరకు పంచారు. సూర్యాపేట, చౌటుప్పల్‌, పోచంపల్లిలోనూ నగదు పంపిణీ భారీగానే జరిగింది. రూ.5-10 వేల వరకు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు వచ్చేందుకు వాహనాలు ఏర్పాటు చేయగా, రాకపోకల ఖర్చును ప్రత్యేకంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. నిర్మల్‌లో సోమవారం రాత్రి అన్ని పార్టీల అభ్యర్థులు రూ.1000 చొప్పున పంచగా, మంగళవారం రాత్రి కూడా మరో రూ.1000 చొప్పున పంచారు.


ఆదిలాబాద్‌లో బీజేపీ, కాంగ్రె్‌సలు రూ.1000-2000 వరకు పంపిణీ చేశాయి. కాగజ్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలు రూ.1000 చొప్పున పంచాయి. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి ఓటు ఖరీదు వేలం పాటలా పెరిగిపోవడం గమనార్హం. సురంగల్‌, పెద్దమంగళారం, చిల్కూరు పరిధిలోని వార్డుల్లో ఓటుకు రూ.50 వేల చొప్పున కొందరు అభ్యర్థులు పంపిణీ చేశారు. శంకరపల్లిలోని ఓ వార్డు పరిధిలో వెండి నాణేలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మిక్సీలు, చీరలు, గ్యాస్‌ పొయ్యిలు పోటీపడీ మరీ పంచేశారు. మరో నాలుగు వార్డుల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.25-30 వేల వరకు పంపిణీ చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఓ మూడు వార్డుల పరిధిలో రూ.15 వేలకు పైగా నగదు పంపిణీ జరిపారు. అలాగే కొంతమంది పెళ్లిళ్లకు పుస్తెలు, మెట్టెలు చేయించి ఇస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. వరంగల్‌ జిల్లాలోనూ ఓటుకు రూ.1000-5000 వరకు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల ఓటర్లకు కొత్త బట్టలు పెట్టి మరీ ఓట్లు అడిగారు. జనగామలో ఓ వార్డులో చైర్మన్‌ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఓటుకు రూ.9 వేలు ఇవ్వగా, ప్రత్యర్థి రూ.8 వేల చొప్పున పంచారు. మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది.

మెదక్‌లో ఉద్రిక్తత

కాంగ్రెస్‌ అభ్యర్థి డబ్బులు పంచుతున్నాడంటూ స్థానికులతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవడంతో మెదక్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 15వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి నరేశ్‌ గౌడ్‌ డబ్బులు పంచుతున్నారంటూ మంగళవారం రాత్రి ఎస్సీ కాలనీ ప్రజలు ఆయన్ను అడ్డుకున్నారు. రాత్రివేళ ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి నిలదీశారు. విషయం తెలిసి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అక్కడికి వచ్చారు. కొందరు ఆయన వాహనాలపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో రెండు కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఎమ్మెల్యే వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు కల్పించుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంఘటనా స్థలానికి వెళ్లి మాట్లాడినట్లు సమాచారం. ఓ మహిళ తనను బీఆర్‌ఎస్‌ నాయకులు కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయడంతో మాజీ మునిసిపల్‌ చైర్మన్‌తో పాటు మరికొందరు నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.

వెండి ప్రతిమలు, మద్యం పట్టివేత

సిరిసిల్లలోని 34వ వార్డులో బీఅర్‌ఎస్‌ అభ్యర్థి దార్ల సందీప్‌ ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యంతోపాటు వెండి ప్రతిమలను తీసుకొచ్చి దూస సాయికుమార్‌ ఇంట్లో నిల్వ చేశారు. పోలీసులు ఆ ఇంటిని తనిఖీ చేసి 48 మద్యం బాటిళ్లతోపాటు 36 వెండి గణేశ్‌ ప్రతిమలు, స్మార్ట్‌ ఫోన్‌లను సీజ్‌ చేశారు. బీఅర్‌ఎస్‌ అభ్యర్థి సందీప్‌, మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 6వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటేశ్‌ అనుచరుడు కృష్ణ ఓటర్లకు డబ్బు పంచుతుండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పట్టుకున్నారు. రూ.13,500 సీజ్‌ చేశారు.

Updated Date - Feb 11 , 2026 | 02:51 AM