కేటీఆర్.. మాపై కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించొద్దు
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:21 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించవద్దని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు
భూకేటాయింపులపై అసత్య ప్రచారం
నిబంధనల మేరకే కేటాయించాం
5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం
ఇదే భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎకరాకు 90 లక్షలకే ఇచ్చింది: దుద్దిళ్ల
హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపించవద్దని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసి అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు చేసిందని స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు.. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 212 అర్జీలు రాగా.. వాటిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, వాటర్ వర్క్స్, దేవాలయాల అభివృద్ధి, పెండింగ్ బిల్లుల మంజూరు, భూ సమస్యల పరిష్కారం, వృద్ధాప్య పెన్షన్లు, రెవెన్యూ పరమైన అంశాలు, ఉద్యోగాల సమస్య ప్రధానంగా ఉన్నాయి. ఈ సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్న పరిశ్రమకు ఎకరాకు రూ.కోటిన్నర చొప్పున ధరకు 5 ఎకరాలను రూ.7.5 కోట్లకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఇందులో రూ.200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలన్నారు. పైగా, ఇదే భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు.
హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా కేటీఆర్ వారిని భయపెట్టడం మంచిది కాదని హితవు పలికారు. అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు చేపట్టిన వాటిని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని, తామూ కొనసాగిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. కృష్ణా నీటి వాటాల విషయంలో తెలంగాణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. తాము మాత్రం రాజీ పడేది లేదని, గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి వెళ్లి గట్టిగా కొట్లాడతామని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోదావరి నీళ్లు గట్టిగా ఎత్తిపోయండి
విదేశీ విరాళాల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
Read Latest AP News And Telangana News And International News And Telugu News