పాడేరు డీఎస్పీపై నరసరావుపేటలో కేసు నమోదు
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:03 AM
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు పంచాయతీ పరిధిలోని ‘ఆదిత్య వెంగమాంబ వెంచర్’ స్ధల వివాదానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డితో సహా ఐదుగురిపై నరసరావుపేట రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా బెదిరిస్తున్నారంటూ మహిళ ఫిర్యాదు
రాజసింహారెడ్డి సహా ఐదుగురిపై కేసు
నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు పంచాయతీ పరిధిలోని ‘ఆదిత్య వెంగమాంబ వెంచర్’ స్ధల వివాదానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డీఎస్పీ రాజసింహారెడ్డితో సహా ఐదుగురిపై నరసరావుపేట రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్‌ఐ చల్లా కిశోర్ కథనం మేరకు.. రావిపాడు పంచాయతీ పరిధిలోని ఆదిత్య వెంగమాంబ వెంచర్‌లో ఈ నెల 7న నరసరావుపేటలోని రామిరెడ్డిపేటకు చెందిన కోటపాటి తిరుపతమ్మ తన కుమారుడు సాయికృష్ణ, వెంచర్ భాగస్వాములతో కలిసి ప్లాట్ల వద్ద పిచ్చి మొక్కలను తొలగిస్తుండగా వెన్నా శ్రీనివాసరెడ్డి, వెన్నా భరత్ సింహారెడ్డి, వెన్నా మాధవి, వెన్నా వెంకట రెడ్డి సహా ఇతర వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడుతూ, భౌతిక దాడికి యత్నించి, బెదిరింపులకు పాల్పడినట్టు తిరుపతమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిరుపతమ్మ భర్త మల్లికార్జునరావు బతికి ఉన్న సమయంలో 2020 జూలై 5న వెన్నా శ్రీనివాసరెడ్డి కుమారులు రాజసింహారెడ్డి(డీఎస్పీ), భరత్ సింహారెడ్డి నుంచి ఎకరా రూ.1,35,50,000 చొప్పున 2 ఎకరాల భూమి కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.67,75,000 చెల్లించి, మిగిలిన మొత్తాన్ని 2021 జనవరి 5 లోపు చెల్లించి రిజిరేస్టషన్ చేయించుకునేలా ఒప్పందం కుదిరింది. మల్లికార్జునరావు మరణించిన తర్వాత, మిగిలిన సొమ్ము తీసుకొని స్ధలాన్ని రిజిరేస్టషన్ చేయాలని కోరినా నిందితులు సాకులు చెబుతూ కాలయాపన చేశారు.
రాజసింహారెడ్డి (డీఎస్పీ) తన కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి, స్ధలం వద్దకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తిరుపతమ్మ ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నరసరావుపేట ఎస్‌డీపీవో అనుమతి పొందిన అనంతరం పాడేరు డీఎస్పీతో సహా అయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.